ఆ టైమ్‌లో ఎందరిని చంపినా, ఎన్ని క్రైమ్స్ చేసినా ఏం కాదు!

రజనీతో లోకేష్ కనగరాజ్ మూవీ.. అంతా హింస మయమా! లోకేశ్ ట్రాక్ రికార్డ్‌లో హింసే ప్రధానంగా ఉన్నా ఈ సినిమాపై వస్తున్న వార్తల్లో నిజమెంతో..

Update: 2024-04-06 06:47 GMT
Source: Twitter


12 గంటలు పాటు ఏమైనా చేసుకోవచ్చు.. ఎన్ని క్రైమ్‌లు అయినా విచ్చలవిడిగా చేసుకోవచ్చు. ఎవరు అడ్డుపడరు. పోలీసులు పట్టుకోరు. అసలు చట్టం, ధర్మం, న్యాయం, అరెస్ట్ చేయడం ఏమీ ఉండవు అంటే సమాజం పరిస్థితి ఎలా ఉంటుంది. 2013లో వచ్చిన The Purge 2013 ‘ది పర్జ్’ కాన్సెప్టు ఇదే. ఈ సినిమా ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందంటే ... సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీ ఇదే కాన్సెప్టుతో తయారు అవుతోందంటూ తమిళ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.


ఈ వార్తల్లో నిజమెంతో కానీ ఇలాంటి ఓ చిత్ర విచిత్రమైన కాన్సెప్టుతో సినిమాని మాత్రం గుర్తు చేసింది. నూటికి తొంభై శాతం ఇలాంటి కథే ఉండకపోవచ్చు. ఇది వండి వార్చిన వార్తే కావచ్చు. కానీ ఇలాంటి కథ అయితే బాగుండును అనుకున్నారో ఏమో కానీ ఈ న్యూస్‌ని మాత్రం జనం వైరల్ చేస్తున్నారు. అంటే వాళ్లు ఇలాంటివి కోరుకుంటున్నారా.. తమకు కూడా ఓ పన్నెండు గంటలు ఇలా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. పట్టించుకోము అంటే బాగుండును అని ఆశిస్తున్నారా.. ఏమో కానీ ఒక్కటి మాత్రం నిజం.. కొన్ని సినిమాలు హింసను బోధిస్తున్నాయి. వాటికి దూరంగా ఉండాలంటే వాటిల్లో స్టార్స్ నటిస్తున్నారాయే.


గతంలో సినిమాల్లో హింసను చూపించినా చివర్లో విలన్‌ని జైలుకు పంపటమో.. చంపటమో చేసి చేతులు దులుపుకునేవారు. ఇప్పుడూ అదీ తగ్గిపోయింది. సినిమా అంతా విలన్ విశ్వరూపమే కనపడుతోంది. దాంతో జనం హీరో కన్నా విలన్‌నే ఆరాధించటం మొదలెడుతున్నారు. అందుకే హీరోలు కూడా విలన్ లక్షణాలతో వర్దిల్లుతున్నారు. ఆయుధాల కల్చర్ అనేది సినిమాల్లో చాలా సామాన్య వ్యవహారంగా మారింది.


తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాల్లో మొదటి నుంచీ హింస మోతాదు కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదే ఆయన సక్సెస్ మంత్ర అయ్యింది. ప్రతి సినిమాకు హైప్ పెంచుకుంటూ పోతున్న ఈ డైరెక్టర్ సినిమాలో ఎన్ని లోపాలున్నా హింసనే ప్రధాన ఆయుధంగా పెట్టుకుని దూసుకుపోతున్నారు. అంతెందుకు రీసెంట్‌గా విజయ్‌తో చేసిన ‘లియో’నే చూస్తే అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడో చూశాం. లియోకి హాలీవుడ్ మూవీ ‘ఏ హిస్టరీ అఫ్ వయొలెన్స్’ నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. సినిమాలో ఎక్కువ శాతం హింసే.

ఇక లియో సినిమా విష‌యంలో మ‌దురైకి చెందిన రాజు మురుగ‌న్ అనే ఓ వ్య‌క్తి.. లోకేశ్ క‌న‌గ‌రాజ్(Lokesh Kanagaraj) మాన‌సిక ప‌రిస్థితిని ఓ సారి పరీక్షించండి అంటూ హైకోర్టు మ‌దురై బెంచ్‌లో ఫిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం అప్పట్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది. లియో(Leo) సినిమా హింస‌ను ప్రేరేపించేలా, ప్రోత్స‌హించేలా ఉన్న‌ద‌న్నారు.


సినిమాలో అయుధాల వాడ‌కం అధికంగా ఉన్న‌దని, మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం, మ‌త‌ప‌ర‌మైన స‌న్నివేశాలు, పిల్లలు, ఆడ వారిపై మితిమీరిన హింసా దృశ్యాలు వంటి సంఘ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల అంశాల‌ను త‌న చిత్రాల‌లో ఎక్కువ‌గా చిత్రీక‌రిస్తున్నార‌ని ఈ క్ర‌మంలో లోకేశ్ క‌న‌గ‌రాజ్ మాన‌సిక ప‌రిస్థితిని గురించి ప‌రీక్ష చేయించాలంటూ ఆరోపిస్తూ పిటిష‌న్ వేశారు.


లోకేష్‌(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో ఇలాంటి సందేశమే ఉంటుందని, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా సమాజానికి చెడు సంకేతం ఇస్తున్నార‌న్నారు. ఆ పిటీషన్ ఏమైందో కానీ లోకేష్ సినిమా అనగానే ..హింసను గ్లోరిఫై చేస్తారనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఇప్పుడు రజనీకాంత్‌తో సినిమా చేస్తూ కూడా ఆ స్థాయి హింసను మళ్లీ చూపిస్తాడనేదే ఆయన అభిమానులలో కొద్దిగా ఆందోళనగా ఉంది. రజనీ సినిమాలకు కుటుంబాలు కదలి వెళ్తాయి. అలాంటప్పుడు హింసను తెరపై గ్లోరిఫై చేస్తే ఇబ్బందే అనేది నిజం. అయితే సినిమా మొదలెట్టక ముందే, అందులో నిజంగా ఏముందో తెలియక ముందే ఇలాంటి ఆలోచనలు సరికాదు. దర్శకుడు లోకేష్ గత చిత్రాలను గుర్తు చేసుకుంటే రజనీ కన్నా ముందే హింస కళ్లముందు మెదులుతుంది.

Tags:    

Similar News