ప్రముఖ కమెడియన్ అతుల్ పర్చురె (Atul Parchure) ఇక లేరు..

బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ ‘బిల్లు’, సల్మాన్ ఖాన్ ‘భాగస్వామి’ అజయ్ దేవగన్ ‘ఆల్ ది బెస్ట్’ చిత్రాలలో నటించిన అతుల్ పర్చురె మృతిచెందారు. ఆయన వయసు 57 సంవత్సరాలు.

Update: 2024-10-14 20:46 GMT
Atul Parchure Pic Credit : Starbiopic

ప్రముఖ మరాఠీ, హిందీ హస్యనటుడు అతుల్ పర్చురె కన్నుమూశారు. అయన వయసు 57 సంవత్సరాలు. కొంతకాలంగా లివర్ కాన్సర్‌తో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అతుల్‌కు తల్లి, భార్య, కూతురు ఉన్నారు. భార్య సోనియా కథక్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌ కూడా. కూతురు సఖీల్ పర్చురే ఫ్యాషన్ స్టైలిస్ట్‌.

2023లో వైద్యులు తన కాలేయంలో 5 సెంటీమీటర్ల కణితిని వైద్యులు గుర్తించినట్లు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతుల్ చెప్పారు. సరైన ట్రీట్మెంట్ జరగక పోవడంతో తన ఆరోగ్యం క్షీణించిదని తెలిపారు.

“మా పెళై 25 ఏళ్లు పూర్తి కావడంతో మేము ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాం. అక్కడ బాగానే ఉన్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఏమీ తినలేకపోయాను. నాకు వికారం అనిపించింది. నా ఆరోగ్యంలో కాస్త తేడా కనిపించింది. నా సోదరుడు నాకు కొన్ని మందులు ఇచ్చాడు కానీ అవి పెద్దగా పనిచేయలేదు. తర్వాత చాలామంది డాక్టర్లను సంప్రదించాను. అల్ట్రాసోనోగ్రఫీలో కణతిని గుర్తించిన డాక్టర్ కళ్ళలో నాకు భయం కనిపించింది. ఏదో సమస్య ఉన్నట్లు అనిపించింది. నా కాలేయంలో 5 సెంటీమీటర్ల పొడవున్న కణితి ఉందని, అది క్యాన్సర్ అని చెప్పారు. నేను కోలుకుంటానా? లేదా? అని డాక్టర్‌ను అడిగాను. నయమవుతుందని చెప్పారు. ప్యాంక్రియాస్‌కు క్యాన్సర్ పాకడంతో నాకు సమస్యలు మొదలయ్యాయి. ఆరోగ్యం మరింత క్షీణించింది. నడవలేకపోయాను. మాట్లాడేటప్పుడు మాటలు తడబడేవి. సర్జరీ చేస్తే కొన్నాళ్లకు కామెర్లు వస్తాయని, ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఆ తర్వాత డాక్టర్లను మార్చి సరైన మందులతో పాటు కీమో థెరపీ తీసుకోవడం ప్రారంభించా.’’ అని చెప్పారు.

కాలేజీ రోజుల్లో యాక్టింగ్ కెరీర్..

అతుల్ పర్చురే నవంబర్ 30, 1966న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. కాలేజీ రోజుల్లోనే యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. "ఖిచ్డీ" (1985)లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు. 1993లో విడుదలైన "బెదర్డి" హిందీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత "ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ," "ఖట్టా మీఠా," ​ "బుద్దా... హోగా టెర్రా బాప్" వంటి అనేక చిత్రాలలో కనిపించారు.

కమెడియన్‌గా మంచి గుర్తింపు..

పలు మరాఠీ, హిందీ చిత్రాల్లో నటించిన అతుల్‌కి మంచి హాస్యనటుడిగా పేరుంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘బిల్లు’, సల్మాన్ ఖాన్ నటించిన ‘భాగస్వామి’ అజయ్ దేవగన్ నటించిన ‘ఆల్ ది బెస్ట్’ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. కపిల్ శర్మ షోలోను కనిపించారు.

తెలుగు మూవీలో..

ఒకే ఒక్క తెలుగు చిత్రంలో అతుల్ నటించారు. 2023లో విడుదలైన ‘రూల్స్ రంజన్’ సినిమాలో కనిపించారు. చివరి సారిగా జాగో మోహన్ ప్యారే సీక్వెల్ ‘భాగో మోహన్ ప్యారే’లో కనిపించారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నా.. ప్రేక్షకులను అలరించడం కోసం మరాఠీ టీవీ షోలో నటించారు.

మహారాష్ట్ర సీఎం షిండే సంతాపం..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అతుల్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే, కొన్నిసార్లు కళ్లలో నీళ్లు తెప్పించే అతుల్ అకాల మరణం బాధాకరం. నాటకం, సినిమా, సీరియళ్లలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఆయన లోటు పూడ్చలేనిది.’’ అని కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News