అక్కడక్కడ నవ్వించే ...: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
సరదాగా చూపించిన ఈ చిత్రం కథ ఏంటి, మనవాళ్లకు నచ్చేదేనా మూవి రివ్యూలో చూద్దాం.;
మనవాళ్లు అప్పుడప్పుడు కొత్త కాన్సెప్ట్ లు ట్రై చేస్తున్నారు. అయితే అవి అనుకున్నంత స్ట్రాంగ్ గా చేయలేకపోతున్నారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఆత్మ ఆవహించిన మూడు చక్రాల బండి చుట్టూ జరుగుతుంది. గతంలో తెలుగులో వచ్చిన బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య టైమ్ సినిమా. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించిన ఈ చిత్రం కథ ఏంటి, మనవాళ్లకు నచ్చేదేనా (Tuk Tuk Telugu Movie Review) చూద్దాం.
స్టోరీ లైన్
అనగనగా ఓ ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు). వాళ్లు కొద్దిగా అల్లరి బ్యాచ్. డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి చేస్తారు. అయితే నిమజ్జనం సమయానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుసి వినాయకుడి నిమజ్జనం ఊరేగింపుగా చేస్తారు.
అయితే ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవటం మొదలవుతుంది. దాంతో వాళ్లు అందులోకి దేవుడు వచ్చాడు అనుకుంటారు. దానికి తోడు ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తూంటుంది. అది చూపెట్టి ఊళ్ళో డబ్బులు సంపాదించుకుంటారు.
కొద్ది రోజులకు అసలు నిజం తెలుస్తుంది . ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. అప్పుడు ఏమైంది. అసలు ఆ ఆత్మ ఎవరిది ? ఆ స్కూటర్ లోకి ఎందుకు వచ్చింది? చివరకు ఏమైంది, మధ్యలో నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు వాళ్ల అల్లరి, వినాయకుడు నిమజ్జనం కోసం ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం దాకా నవ్విస్తూనే సాగింది. అయితే ఎప్పుడైతే అందులోకి దేవుడు కాదు దెయ్యం ఉందని, దాని కథేంటో తెలియటం మొదలైందో, అక్కడ నుంచి కథలో సీరియస్ నెస్ మొదలైంది. నవ్వులు ముగిసి సినిమా విసుగించటం మొదలెట్టింది. ఆత్మ ప్లాష్ బ్యాక్ సీన్స్ అయితే పరమ బోర్ కొట్టించాడు.
కొత్త కుర్రాళ్లు కొత్త ప్రయత్నం అనుకుని సర్దుకుపోదామనుకున్నా కుదరదు. ఒక్కసారి పడిపోయిన స్టోరీ గ్రాఫ్ ఇంకా లేవదు. వాస్తవానికి సెకండాఫ్ లో ఎన్ని నవ్వులు నవ్వించాము అన్నదానిపైనే ఇలాంటి కాన్సెప్ట్ లు సక్సెస్ స్థాయి ఆధారపడి ఉంటుంది. అదే ఇక్కడ జరగలేదు. ఐడియా లెవిల్లో బాగానే ఉందనిపించినా, స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవటం దెబ్బ కొట్టింది. అలాగని మొదటి సీన్స్ పగలబడి నవ్విస్తాయి అని కాదు. ఫర్వాలేదు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే ముగించాలి కాబట్టి ముగించారు అనిపిస్తుంది. కంక్లూజన్ లేని కథలు ఇవి.
టెక్నికల్ గా..
చిన్న సినిమా నుంచి ఇంతకు మించి టెక్నికల్ వాల్యూస్ ఆశించొద్దు అన్నట్లు పనిచేసాయి డిపార్టమెంట్. అయితే విలేజ్ అట్మాస్పియర్, పచ్చని లొకేషన్ తో సినిమాటోగ్రఫీ నిండుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ అద్భుతం కాదు కానీ బాగానే ఉందనిపిస్తుంది. పాటలు జస్ట్ ఓకే. టుక్ టుక్ బండిని మాత్రం ఆర్ట్ డైరెక్టర్ బాగా డిజైన్ చేశారు. నిర్మాణ విలువలు చిన్న సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఆర్టిస్ట్ లు కొత్తవాళ్లైనా బాగా చేశారు. తెలుగమ్మాయి శాన్వి మేఘనకు మంచి సినిమా పడితే బ్రేక్ వస్తుంది. విషయం ఉందామెలో. టీనేజ్ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధులు మంచి ఎనర్జీతో బాగానే లాక్కెళ్లారు.
చూడచ్చా
థియేటర్ కు పరుగెత్తుకు వెళ్లి చూడాల్సిన సినిమా కాదు కానీ ఓటీటీలో వస్తే ఓ లుక్కేయచ్చు.
నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి.. తదితరులు
సంగీతం: సంతు ఓంకార్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్
ఎడిటర్: అశ్వత్ శివకుమార్
నిర్మాత: రాహుల్ రెడ్డి
దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణ