సైఫ్ అలీ ఖాన్ 'జ్యువెల్‌ థీఫ్‌' OTT మూవీ రివ్యూ

కథ, నటన, స్క్రీన్‌ప్లే, టేకింగ్ అన్నీ మేం మీకోసం రివ్యూ చేస్తున్నాం.;

Update: 2025-04-30 06:15 GMT

ఒక విలువైన వజ్రం దొంగతనం... దాన్ని వెతికేది కేవలం పోలీసులే కాదు, ప్రేక్షకుల ఆసక్తి కూడా! హాలీవుడ్, బాలీవుడ్లో హీస్ట్ జానర్‌కు ఎప్పుడూ డిమాండే. ఈ మధ్యన ఆ క్రైమ్ డైమండ్స్ తగ్గాయి. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ తాను ‘జువెల్ థీఫ్‌' అని అంటూ మన ముందుకు వచ్చాడు. అయితే ఎప్పటిలా థియేటర్ లో కాకుండా స్ట్రైట్ గా ఓటీటీ లో దూకాడు. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌ లోకి వచ్చిన ఈ సినిమా, భారీ యాక్షన్‌, స్మార్ట్ ప్లానింగ్‌తో ఆకట్టుకోవాలని చూసిందా, ఈ క్రైమ్-హీస్ట్ డ్రామా మన టైమ్ ని పణంగా పెట్టేటంత విలువైనదేనా? ఇది నిజంగా విలువైన వజ్రమా, లేదా కేవలం నకిలీ డైమండా? కథ, నటన, స్క్రీన్‌ప్లే, టేకింగ్ అన్నీ మేం మీకోసం రివ్యూ చేస్తున్నాం.

కథా,కథనం

రెహాన్ రాయ్ (సైఫ్ అలీఖాన్) – అంతర్జాతీయ దొంగ. ఖరీదైన వజ్రాలే అతని లక్ష్యం. అతనికి, లైఫ్ లో వన్ టైమ్ సెటిల్మెంట్ లాంటి ఆఫర్ వస్తుంది. అయితే అది ఆఫర్ కాదు ఓ బ్లాక్ మెయిల్. తండ్రిని కాపాడాలనే బాధ్యత కూడా ఉంటుంది. దాంతో ఎంతటి రిస్క్ అయినా చేయాలని రంగంలోకి దూకుతాడు.

బుడాపెస్ట్‌లో ఉన్న రెహాన్‌ను కలిసిన అతని సోదరుడు – తండ్రి ఓ మోసానికి బలి అయ్యాడని, ఆ మోసం వెనక ఆర్ట్ కలెక్టర్ ముసుగులో దాగున్న క్రిమినల్ రాజన్ (జైదీప్ అహ్లావత్) ఉన్నాడని చెబుతాడు. తన తండ్రిని కాపాడాలంటే, రాజన్ వేసిన హీస్ట్‌ గేమ్‌లో భాగస్వామిగా మారాల్సిందే అని రెహాన్ కు అర్దమవుతుంది.

హీస్ట్ టార్గెట్?

"రెడ్ సన్" – ఆఫ్రికన్ రాజవంశాల గర్వంగా 18వ శతాబ్దం నుంచి దాచుకుంటున్న అపార విలువ గల వజ్రం. దాని విలువ రూ.500 కోట్లకు పైగా. అది ఇప్పుడు ముంబైలోని మ్యూజియంలో, కఠిన భద్రత మధ్య ప్రదర్శనకు ఉంచబడింది. అదే దొంగిలించాలన్నది రాజన్ డీల్.

రెహాన్ ఒప్పుకుంటాడు. కానీ సగం వాటా తనదని కండిషన్ పెడతాడు. ముంబైకి వచ్చి, అత్యంత సైంటిఫిక్‌గా, డీటెయిల్డ్‌గా ప్లాన్ సిద్ధం చేస్తాడు. కానీ అతనికి తెలియదు — చాలా కాలంగా అతన్ని ట్రాక్ చేస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ (కునాల్ కపూర్), ఈసారి తనకన్నా ముందే ముంబైలో రెడీగా ఉన్నాడు.

ఇప్పుడు…

వజ్రం దొంగతనం సక్సెస్ అవుతుందా?

రెహాన్ తన తండ్రిని కాపాడగలడా?

రాజన్ ఏ మేరకు డ్రామా ఆడాడో రెహాన్ గమనించాడా?

అన్నిటికంటే పెద్ద ప్రశ్న – దొంగ నిజంగా దొంగేనా, లేక తనదైన న్యాయం కోసం పోరాడే హీరోనా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

‘Jewel Thief’ అనే పేరు వింటే, మనకు ముందుగా గుర్తుకొచ్చేది గతంలో హిందీలో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా. అయితే దానికి దీనికి టైటిల్ లో తప్ప వేరే పోలిక లేదు. ఇక ఇలాంటి సినిమాల్లో సాధారణంగా స్క్రీన్ ప్లే .. ఒక సాదా హీస్ట్ డ్రామా గా మొదలై — క్లిష్టమైన ప్లాన్లు, చివరి నిమిషంలో షాక్ తిప్పే మలుపులు, ఏదో పెద్ద స్కీమ్ వెనుక దాగి ఉన్న అండర్‌కరెంట్ తో సాగుతాయి.

కానీ ఈ సినిమాకి అంత సన్నివేశం లేదు. సినిమా ప్రారంభంలో అలా అనిపించినా అది మన అతి ఊహే అని తర్వాత అర్థమవుతుంది. స్టోరీ లైన్ లీనియర్ గా సాగుతుంది. స్క్రీన్‌పైన జరిగేది ఓ భారీ హీస్ట్ అయినప్పటికీ, అసలు ఉత్కంఠ అనే పార్ట్ కనపడదు. డైరెక్టర్ ఉద్దేశ్యం...ఇది ఒక హీస్ట్ డ్రామా కన్నా ఎక్కువగా — ఒక ఆత్మగౌరవం కోల్పోయిన కుమారుడికి, తన తండ్రి గౌరవాన్ని తిరిగి తీసుకురావాలనే ప్రయత్నం .

స్క్రిప్ట్ పరంగా చెప్పాలంటే, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్నీ చూస్తే ఓ యూట్యూబ్ వీడియో లో చూపే "how to rob a museum" లెవల్లో ఉంటాయి. ఎలాంటి షాకింగ్ మోమెంట్స్ లేకుండా, ఊహించదగిన మార్గంలో కథ సాగిపోతుంది.

టెక్నికల్ గా ...

ఇలాంటి నాశిరకం కథలో జీవం పోసింది రెండు పాత్రలు. సైఫ్ అలీఖాన్ తన సహజమైన అటిట్యూడ్‌తో రెహాన్‌గా ప్రేక్షకుడిని మెప్పిస్తాడు. ఇది అతడి కెరీర్‌లో గొప్ప పాత్ర కాదు. కానీ అతడి ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ,క్యారెక్టర్ టోన్ తగినట్లుగా ఫెరఫెక్ట్ గా అనిపిస్తాయి. అలాగే మరొకటి జైదీప్ అహ్లావత్ చేసిన రాజన్ పాత్ర, ఓ సాధారణ విలన్ మాదిరిగా కనిపించిన తర్వాత క్రూరత్వాన్ని ఈ ఎటువంటి డైలాగ్ హైప్స్ లేకుండానే పర్ఫెక్ట్‌గా చేయగలిగారు.

టెక్నికల్‌గా సినిమాకు పెద్దగా చెప్పుకోదగ్గ విశిష్టతలు లేవు. సినిమాటోగ్రఫీ హైలైట్ కాకపోయినా, డీసెంట్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రొటీన్‌గా ఉన్నా, కొన్ని సీన్లలో తక్కువ శబ్దంతోనూ సన్నివేశానికి బలాన్ని ఇచ్చింది. కానీ హీస్ట్ జానర్‌కి ముఖ్యమైన టెన్షన్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ని చాలా చోట్ల మిస్ చేశారు.

ఫైనల్ థాట్

మొత్తానికి, ‘Jewel Thief’ ఒక జానర్ డిఫెండింగ్ సినిమా కాదు. ఓ బలమైన కథ, క్లిష్టత, థ్రిల్ ఆశించిన వారికి ఇది కొంత నిరాశే. కానీ, ఓటీటీలో వచ్చింది కదా ...అని ఓ బీన్ బాగ్ మీద కూర్చొని చూడటానికి స్టైల్‌తో కథ సాగితే చాలని అనుకునే ప్రేక్షకుడికి — ఈ సినిమా ఫెయిర్ అఫైర్.

ఎక్కడ చూడచ్చుEntertainment, Tollywood, Net Flix, Jewel Thief, Movie Review,

నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ ఉంది.

Tags:    

Similar News