'జై మహేంద్రన్' వెబ్ సీరీస్ రివ్యూ!

ఈ సీరిస్ ఎలా ఉంది. అసలు కథేంటి, మనం చూడదగ్గ సీరిస్ యేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Update: 2024-10-29 08:04 GMT

చాలా వరకూ మళయాళం నుంచి వచ్చే సినిమాలు, వెబ్ సీరిస్ లు ఎంటర్టైన్మెంట్ తోనూ, సహజత్వం తోనూ నిండి ఉంటున్నాయి. దాంతో వాటిని చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. దాంతో అక్కడ ప్రతీ సీరిస్ ని , సినిమాని మాగ్జిమం ఇక్కడకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఓటిటి సంస్ధలు. ఆ క్రమంలో తాజాగా వచ్చిందే జై మహేంద్రన్ వెబ్ సీరిస్. సుహాసిని, సైజు కురుప్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సీరిస్ ఎలా ఉంది. అసలు కథేంటి, మనం చూడదగ్గ సీరిస్ యేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

త్రివేండ్రమ్ లోని 'పలాజిక్కుళం'లో డిప్యూటీ తాశిల్దారు మహేంద్రన్ (సైజు కురుప్). అతను కొద్దిగా కన్నింగ్. తన ఆఫీస్ కు వచ్చేవారి పనులు చేయాలంటే వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూంటాడు. అతని భార్య ప్రియా (మియా జార్జ్) కి ఇదేమీ ఇష్టం ఉండదు. కానీ ఆమె మాట మహేంద్రన్ వినడు. ఈలోగా అక్కడికి తాశీల్దారుగా శోభ (సుహాసిని) వస్తుంది. ఇద్దరివీ విభిన్న వ్యక్తిత్వాలు శోభ చాలా సిన్సియర్ కావటం మహేంద్రన్ ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఆమె క్రమశిక్షణకి ఎడ్జెస్ట్ కాలేకపోతాడు. శోభ పట్ల మహేంద్రన్ తీవ్రమైన అసంతృప్తిని పెంచేసుకుంటాడు.

ఈలోగా ఓ నిరుపేద వ్యక్తికి స్ధలం విషయంలో తన పరిదికి మించి శోభ సాయం చేయటానికి ఓ నిర్ణయం తీసుకుంటుంది. అది రివర్స్ అయ్యి ఆమె మెడకు చుట్టుకుని శోభ,మహేంద్రన్ పై సస్పెన్షన్ వేటు పడుతుంది. శోభకు అప్పుడు గ్రౌండ్ రియాలటీ అర్ధమవుతుంది. తమ చుట్టూ ఉన్న రాజకీయాలు ఎలా లీడ్ చేస్తాయో తెలుసుకుంటుంది. దాంతో ఇప్పుడామెకు ఉద్యోగం అత్యవసరం కావటంతో ఈ సమస్య నుంచి బయిటపడాలనుకుని వేరే దారి లేక మహేంద్రన్ ని పిలిచి మాట్లాడుతుంది. అక్కడ నుంచి మహేంద్రన్ ఏం చేసి ఇద్దరి ఉద్యోగాలు కాపాడుకున్నారు..చివరకు ఏమైంది అనేది మిగతా కథ.

ఎలా ఉంది

సాధారణంగా గవర్నమెంట్ ఆఫీస్ లలో పని చేసేవాళ్లను జనం పెద్ద ఆదరణీయంగా చూడరు. వాళ్లు బద్దకంగా ఉంటారని, పనులు చేయరని, లంచాలు మరుగుతారని, బాధ్యత లేకుండా మాట్లాడతారని , ఎంత ఇంపార్టెంట్ విషయమైనా నిర్లక్ష్యంగా వ్యవహిస్తారని చెప్పుకుంటారు. అందులో చాలా వరకూ నిజం ఉందని చాలా సార్లు రుజువైంది. ఇదే విషయాన్ని ఈ సీరిస్ కూడా మరో సారి చెప్పే ప్రయత్నం చేస్తుంది. సోనీ లివ్ మొదటిసారిగా చేసిన ఈ సీరిస్ సెటైరికల్ డ్రామా. వ్యంగ్యం ప్రధానంగా సాగుతుంది. అయితే ఆ వ్యంగ్యం చాలా సార్లు అర్ధం కాదు. అందులో సెటైర్ ని మనం అర్ధం చేసుకోలేదా లేక అక్కడ నిజంగానే ఏమీ లేదా అనే సందేహం వస్తూంటుంది. సైజు కరూప్ పాత్ర మనని ఆకట్టుకుంటుంది. చాలా నేచురల్ గా సీన్స్ తీసారు.

అయితే ఫన్ కు పెద్దగా ప్రియారిటి ఇవ్వలేదు. ప్రభుత్వ ఆఫీస్ లో మనం కాసేపు కూర్చుంటే గమనించే అంశాలే అక్కడ కనపడతాయి. కథలోనూ క్యారక్టరైజేషన్స్ లోనూ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇక సుహాసిని ఉంది అంటే ఆమె పాత్రకు ప్రయారిటీ ఇచ్చి కథనం నడుపుతారని ఆశిస్తాము. అయితే అదీ పెద్దగా జరగదు. ఆమెకు సమస్య రాగానే తను అవినీతితో నడిచే వ్యక్తి సాయాన్నే కోరుకుంటుంది. ప్రిమైజ్ వరకూ బాగానే ఉన్నా ట్రీట్మెంట్ సరిగ్గా సెట్ కాలేదు ఈ సీరిస్ కు. లైట్ హార్టెడ్ గా చూడాలనే లక్ష్యంతో చేసిన సీన్స్ చాలా వరకూ తేలిపోయాయి. అప్పటికప్పుడు నవ్వటం కోసం బలవంతంగా కొన్ని జోక్స్ ని ఇరికించినట్లు అర్ధమవుతుంది. దాంతో ప్లాట్ గా తయారైంది.

టెక్నికల్ గా చూస్తే..

స్క్రిప్టు ఎలాంటి మలుపులు లేకుండా కథ ప్లాట్ గా నడవటంతో అక్కడ ఆడియన్స్ పల్స్ ని పట్టుకోవటం ఫెయిలైంది. ఇక ప్రశాంత్ రవీంద్రన్ ఫొటోగ్రఫీ .. సిద్ధార్థ్ ప్రదీప్ సంగీతం .. క్రిష్టి సెబాస్టియన్ ఎడిటింగ్ సాదా సీదాగా అనిపిస్తాయి. అయితే గొప్ప విషయం ఏమిటంటే...తాశీల్దారు కార్యాలయం దగ్గర కనిపించే వాతావరణాన్ని చాలా నాచురల్ గా చూపే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. అయితే స్క్రిప్టు ఫెయిల్ అవటంతో వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. మంచి ఆర్టిస్ట్ లు ఉన్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

చూడచ్చా

మరీ గొప్పగా లేకపోయినా కాలక్షేనికి ఓ సారి చూడటానికి ఈ సీరిస్ పనికొస్తుంది

ఎక్కడ చూడవచ్చు

సోనీ లివ్ ఓటిటి లో తెలుగులో ఉంది.

Tags:    

Similar News