సలార్ మూవీ రివ్యూ

2014 లో వచ్చిన ‘ఉగ్రం’ కథనే మరోసారి, మరోవిధంగా ‘సలార్’ రూపంలో వచ్చిందా అనిపిస్తుంది

Update: 2023-12-22 13:31 GMT
సలార్ పోస్టర్ (ట్విట్టర్ నుంచి)

(సి ఎస్ సలీమ్ బాషా)


చిట్టచివరికి సలార్ part-1 cease fire(కాల్పుల విరమణ)! వచ్చేసింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనేక కథలు, కథనాలు, ఇంటర్వ్యూలు, విశేషాలు, వివరాలు పత్రికల్లో, ఇంటర్నెట్లో, ట్విట్టర్లలో ఊదరగొట్టి, ప్రేక్షకులను ఊరించి, భారీగా అంచనాలు పెంచి, సినిమా పరిశ్రమ దృష్టిని ఆకర్షించి మొత్తం మీద అన్ని వర్గాల్లో ఆసక్తిని పెంచిన ఈ సినిమా చివరికి స్క్రీన్ మీదకి వచ్చేసింది.

ఉగ్రం (2014) కథనే కే జి ఎఫ్ స్టైల్ లో మరోసారి కొంచెం కొత్తగా తీసిన సినిమా ఈ సలార్. ఈ సినిమా 400 కోట్ల ఖరీదైన సీసాలో, కొత్త లేబుల్ అంటించి, కాస్త కొత్త సారాను నింపి అందించాడని అనుకోవచ్చు. ఈ సినిమా ప్రేక్షకులకు కిక్ ఇచ్చిందా? లేదా? అన్నది చూసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది రీమేక్ కాదు. ఉగ్రం కథ తన మనసుకు నచ్చిన కాబట్టి దాన్నే మరోసారి చెప్తున్నాను (retelling) అని చెప్పినప్పటికీ, ఇది కొంచెం కొత్తగా తీయడం విశేషం. ఉగ్రం కథ నేపథ్యం పూర్తిగా వేరు. సలార్ కథ వేరు.

ఈ సినిమాకు మొదటి నుంచి భారీతనమే (లేదా ఎక్కువ) ఉంది . దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ" సలార్ అనేది ఒక వైవిధ్య భరితమైన ప్రపంచం. ఈ సినిమాలో యాక్షన్ భారీగా ఉంటుంది. అది బలమైన పాత్రల మధ్య జరుగుతుంది. అన్నిటికన్నా మించి ఇది ఒక ఉద్వేగ భరితమైన కథ. ఖాన్సార్ అనే ప్రపంచంలో ఇద్దరు స్నేహితుల ప్రయాణమే ఈ యాక్షన్ తో నిండిన భావోద్వేగాల సినిమా. నేను ఇలాంటి సినిమా తీయాలి అనుకున్నాను. సలార్ నాకు అవకాశం ఇచ్చింది. ఖాన్సార్ అన్నది భావోద్వేగాల మీద ఆధారపడి ఇంతవరకు మానవాళికి తెలియని అత్యంత హింసాత్మకమైన ప్రపంచం"


 



ఈ సినిమాకు (దర్శకుడి మిగతా విజయవంతమైన సినిమా లకు కూడా ) ఒక చిత్రమైన విశేషం ఉంది. అది సినిమా మొత్తం ఒకే రకమైన డార్క్ షేడ్ లో ఉంటుంది. కేజిఎఫ్ కూడా అంతే. దీనికి కారణం దర్శకుడి OCD (obsessive cumpulsive disorder). దర్శకుడిగా ప్రశాంత్ నీల్ సినిమాల గురించి చెప్పేముందు, ఓసిడి గురించి కొంచెం చెప్పాలి. దానివల్ల ఏ రకమైన సినిమాలు తీస్తున్నాడు అనేది అర్థమవుతుంది.

ఇది ఒక రకమైన మానసిక రుగ్మత. కొన్నింటి పట్ల ఇష్టం, లేదా వ్యామోహం ఉంటుంది. దీంతో పెద్దగా ప్రమాదం లేదు కానీ వ్యక్తుల వ్యక్తిగత ప్రవర్తన కొంత మారుతుంది. అందువల్లనే ప్రశాంత్ నీల్ తీసిన మిగతా మూడు పెద్ద సినిమాలు అలాగే ఉంటాయి. ప్రశాంత్ నీల్ కు డార్క్ షేడ్ అంటే వ్యామోహం. ఒకటే రంగుతో(అంటే డార్క్ షేడ్ తో) సినిమాలు తీస్తున్నాడు. కేజీఎఫ్ నుంచి మొదలుపెట్టి, సలార్ వరకు స్క్రీన్ మొత్తం డార్క్ షేడ్ లోనే ఉంటుంది. .ఇదంతా ప్రముఖ దర్శకుడు రాజమౌళికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ చెప్పడం జరిగింది.

భారీ యాక్షన్, పాత్రల మధ్య హింసాత్మకమైన ప్రవర్తన, ఒకే రకమైన బ్యాక్ గ్రౌండ్ ఈయన సినిమాల నేపథ్యం. ఉగ్రం సినిమాలో ఒక క్రైమ్ సిండికేట్ ( నేర సామ్రాజ్యం) చుట్టూ తిరిగే కథ. కేజిఎఫ్ రెండు సినిమాలు కూడా గోల్డ్ ఫీల్డ్( ఉత్తర కర్ణాటకలో కోలార్ బంగారు గనుల నేపథ్యం). ఇప్పుడు సలార్ ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత దౌర్జన్య పూరిత, హింసాత్మక సామ్రాజ్యంలో జరిగే ఇద్దరు స్నేహితుల కథ.

. సలార్ లాంటి సినిమాలకు అది కొంతవరకు సరిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఒక ఊహజనిత, కల్పిత కథ కాబట్టి. ఇక్కడే దర్శకుడు కొంచెం తెలివిగా వ్యవహరించాడు. ఈ కథలో లాజిక్ వెతకడం కుదరదు. అందుకే చాలా ఫ్రీడం తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు లాగానే హిందీలో కూడా బీభత్సమైన, హింస ఉంది. అయితే దర్శకుడు దాన్ని చాలా జాగ్రత్తగా చిత్రీకరించాడు (దీనికన్నా ముందు రిలీజ్ అయిన " అనిమల్ సినిమా కన్నా" ఇది కొంచెం భరించదగ్గ స్థాయిలో ఉంటుంది).

"ఖాన్సార్" అనే సామ్రాజ్యంలో ఇద్దరు స్నేహితుల కథ ఇది. ఆ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దానిలో ఉన్న రాజకీయాలు, యుద్ధాలు, కుట్రలు కుతంత్రాలు, చంపడాలు చంపుకోడాలు చిత్రీకరించడంలో కొంత ఫ్రీడమ్ ఉంటుంది. అయితే ఆ ఫ్రీడమ్ ని కూడా ఈ డైరెక్టర్ క్రియేటివ్ గానే వాడుకున్నాడని చెప్పుకోవాలి.


గతంలో సినిమాలకు స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఫోటోగ్రఫీ వంటి వాటికి విమర్శకుల నుంచి కూడా ప్రశంస పొందిన ప్రశాంత్ నీల్ ఇందులో కూడా తన క్రియేటివిటీని చూపించాడు. దర్శకుడు ఇంకో విషయంలో కూడా ప్రశంసించదగ్గ పని చేశాడు. అదేమిటంటే ఇందులో ఉన్న ఎన్నో పాత్రల మధ్య సమన్వయం కుదిర్చి అన్ని పాత్రలకు ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చి, కథను నిజం అనిపించేలా ముందుకు నడపడం. మరో విషయం ఏంటంటే చరిత్రలో కాన్సర్ నిజంగానే ఉందేమో అనిపించేలా చేయడం. 1127 లో చెంగిస్ ఖాన్ శకం నుంచి 2017 వరకు చరిత్రను చెప్పడం నిజమైన అనిపిస్తుంది. ఏమైనా భారతదేశంలో భాగంగా ఖాన్ సార్ ని చూపించడం, దాని నియమ నిబంధనలు, దాని రాజ్యాంగం ఇవన్నీ కొంచెం క్రియేటివ్ గానే చేసినట్లు లెక్క.

ఈ సినిమాలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది.ప్రశాంత్ నీకు ఇదివరకు మూడు విజయవంతమైన సినిమాలు తీసిన అనుభవం ఉంది. కాన్సర్ లో ముఖ్యమైన మూడు తెగల మధ్య కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ఇక ఈ సినిమాకి తన మూడు సినిమాలకు పనిచేసిన ఫోటోగ్రాఫర్(మోహన గౌడ), సంగీత దర్శకుడు(రవి బస్రుర్) లనే తీసుకున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం నిర్మాణ సంస్థ " హుంబలే" తో తనకు మూడో సినిమా.


ఇక్కడ ప్రభాస్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ సినీ ప్రయాణం బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని విభజించాలి. బాహుబలికి ముందు ప్రభాస్ సినిమాలు ఒకటి రెండు తప్ప అన్ని అంతో ఇంతో విజయం సాధించి సాధించిన సినిమాలే. మొదట్లో "వర్షం", " ఛత్రపతి" బాగా విజయవంతమైన సినిమాలు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ తో తీసిన " సాహో", " రాధే శ్యాం" " ఆది పురుష్", 3 సినిమాలు బాగా నిరుత్సాహపరిచాయి. ముఖ్యంగా రాధే శ్యాం. ఈ సినిమాకు ముందు ఒక ప్రభాస్ మాత్రమే విజయవంతమైన సినిమాలు తీయలేదు. ఆ విధంగా ఈ సినిమాలో 3 సంఖ్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది.(సినిమా తీయడానికి కూడా మూడు సంవత్సరాలు పట్టింది. అది వేరే విషయం.)




 


అలాగే క్రైమ్ సిండికేట్ నేపథ్యం అన్న ప్రశాంత్ నీల్ కి చాలా ఇష్టం. కేజిఎఫ్ నుంచి ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాంతం లో ఉన్న వ్యాపారాన్ని(అది ఆ ప్రాంతానికే పరిమితం). చూపించడం అన్నది కూడా ప్రశాంత్ కు ఇష్టం. కే.జి.ఎఫ్ లో బంగారు గనులు చూపిస్తే, ఇందులో బొగ్గు గని చూపించాడు.

ఇక కథ గురించి చెప్పాలంటే. చాలా సింపుల్ కథ. ఒక సామ్రాజ్యం, ఇద్దరు స్నేహితులు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, ట్విస్టులు, సస్పెన్స్ లు, ఏ సినిమాటిక్ లిబర్టీకి కూడా అందని పోరాటాలు, సన్నివేశాలు. ఇది సినిమా. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు ఒక సరికొత్త ప్రపంచంలో ఉండిపోతారు. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాలో ఫోటోగ్రఫీ, సంగీతం, అవి ఈ సినిమా కు ప్రధాన బలాలు. మూడు ఫ్లాపుల తర్వాత, ప్రభాస్ కు ఈ సినిమా చాలావరకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది.


చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ బాగా చేశాడు. ఇక్కడే డైరెక్టర్ తన తెలివితేటలను వాడాడు. ప్రభాస్ కు చాలా తక్కువ డైలాగులు ఉన్నాయి. అవే ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేశాయి. పృథ్విరాజ్ సుకుమార్ అని నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రకి సరిగ్గా సరిపోయాడు. దాదాపు మిగతా నటుల కాస్టింగ్ చాలా జాగ్రత్తగా చేశారు. ఇవే సినిమాకు బలాలు.

ప్రశాంత్ నీల్ టాలెంటెడ్ దర్శకుడు అన్నదాంట్లో అనుమానం ఏమీ లేదు. సినిమా నడిపించిన విధానం ప్రేక్షకులను సినిమా చూసేటట్లు చేస్తుంది. కొన్నిచోట్ల(ఫ్యాన్స్ అయితే దాదాపు అన్ని చోట్ల) ఈలలు థియేటర్లలో వినపడతాయి. చాలా బాగా తీసిన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి అందరికీ నచ్చుతాయి


ఇంతకు ముందు చెప్పినట్లు ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు తప్పించి, మిగతా అందరికీ కొంత, యువ ప్రేక్షకులకి కొంచెం ఎక్కువ " కిక్" ఇచ్చే అవకాశం ఉంది. మొదటిరోజు 50 కోట్ల రూపాయలు మేరకు అడ్వాన్స్ బుకింగ్ అయిన ఈ సినిమా ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.


చివరిగా ఒక చిన్నమాట మొదట్లో డబ్బులు కోసమే సినిమాలు తీయాలని అనుకున్న ప్రశాంత్ నీల్, ఇప్పుడు చాలా డబ్బులు పెట్టి సినిమాలు తీస్తున్నాడు, విజయవంతం కూడా చేస్తున్నాడు. ఇలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా ఇతర సినిమాలు కూడా తీస్తే బాగుంటుంది.

పిఎస్: సినిమా విడుదలకు ముందే ఈ సినిమా రెండో భాగం " శౌర్యంగా పర్వం" అన్న రెండో భాగం వస్తుందని

దర్శకుడు చివర్లో ఉన్న ట్విస్ట్ ద్వారా దాన్ని ధృవీకరించాడు.

తారాగణం:

నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ,జగపతిబాబు

:బాబీ సింహ, ఈశ్వరి రావ్, టిను ఆనంద్ తదితరులు, లాంటి అనేకమంది

సంగీతం :రవి బస్రూర్

ఫోటోగ్రఫీ : భువన్ గౌడ

ఎడిటింగ్ : ఉజ్వల్ కులకర్ణి

రచన,దర్శకత్వం :ప్రశాంత్ నీల్ సూరి

నిర్మాతలు : విజయ్ కిరందూర్, కార్తీక్ విజయ్, కె.వి.రామారావు,

నిర్మాణ సంస్థ: హొంబలె ఫిలింస్

విడుదల తేది:22/12/23 నిడివి: 175 నిమిషాలు

Tags:    

Similar News