చిట్కాల డాక్టర్ సమంతగారూ… కాస్త బ్రేక్ ఇవ్వండి!
ఇది హెల్త్… హ్యాష్‌ట్యాగ్ కాదు!;
తెలుగు స్టార్ సమంత మళ్లీ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి కారణం ఆమె ప్రచారం చేసిన ఓ ఆరోగ్య సప్లిమెంట్. 'ఎన్ఎంఎన్ (NMN)' ఆధారిత ఈ సప్లిమెంట్ వయస్సుతో వచ్చే అలసట, మానసిక మందగింపు వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుందంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం పట్ల డాక్టర్లు, కొంతమంది వైద్య రంగానికి చెందిన వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రచారం "తప్పుడు సమాచారం"గా , "అశాస్త్రీయ" మైనదిగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు.అదే సమయంలో సెలబ్రిటీలు ఆరోగ్యంకి చెందిన విషయాలపై పోస్ట్ లు, పెట్టడం, సప్లిమెంట్స్ ప్రచారం చేయటం ఎంత వరకూ న్యాయం?పద్దతేనా? ప్రమాదమా? సామాజిక ప్రభావం వంటి అనేక విషయాలు పై విస్తృత చర్చకు దారితీస్తోంది.
"With great power comes great responsibility."
ఈ Spider-Man series లోని యునివర్సల్ మోరల్ స్టేట్‌మెంట్ సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుంది. సినిమావాళ్లు కావచ్చు లేదా మరో రంగంలో ఎదిగిన సెలబ్రెటీలు కావచ్చు. వారికి లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నప్పుడు, వారి మాటలు సామాన్యుల జీవనశైలిపై ప్రభావం చూపుతాయనటంలో సందేహం లేదు. ఈ పరిస్థితిలో వారు చెప్పే మాటల్ని , ఎక్సపీరియన్స్ లను సామాన్యులు “ఆదేశంగా” భావించటం సహజం. సెలబ్రిటీలు చెప్పిన ప్రతిదీ శాస్త్రసిద్ధంగా నిరూపించబడినదే అయి ఉండాలని రూల్ లేదు.
సైన్స్ వర్సెస్ సెలబ్రిటీ మార్కెటింగ్
ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు వ్యాపారంగా మారిన ఈ యుగంలో, సెలబ్రిటీలు చేసే ఒక్క ప్రోమోషన్ తో ప్రోడక్ట్ మార్కెట్ ఊపందుకుంటుంది. ఒక్క రాత్రిలోనే సూపర్ హిట్ అవుతుంది. కానీ ఆ ప్రాడెక్టు లు సైన్స్ ఆధారంగా ఉండకపోతే…?
“The plural of anecdote is not data.”
"ఒకరిద్దరు చెప్పిన చిన్న కథలు లేదా వ్యక్తిగత అనుభవాలు (అనెక్డోట్స్) అన్నీ కలిపి ఒక ప్రామాణికమైన సమాచారం (డేటా) అవ్వవు." ఇది ప్రపంచం అంతా ఒప్పుకునే మాట. సమంతా స్వయంగా అనుభవించిన మయోసిటిస్ నుంచి తాను పొందిన ఉపశమాన్ని ఒక ఉత్పత్తికి అన్వయించడమే పొరపాటు. ఒక వ్యక్తికి పని చేసినది అందరికీ పనిచేస్తుంది, చేయాలన్న నమ్మకం అర్థలేనిది. దీనికితోడు, NMN పైన ఇంకా పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ జరగలేదు.
అమెరికాలో కూడా FDA (Food & Drug Administration) ఈ ఉత్పత్తులను ఆమోదించలేదు. UK NHS, Mayo Clinic లాంటి సంస్థలు కూడా ఇవి ఎంతవరకు ఉపయోగకరమో స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
ప్రముఖుల బాధ్యత ఏమిటి?
ఈ వివాదం భారతీయ సినీ ప్రముఖులకే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు కూడా ఓ రెఫరెన్స్ పాయింట్. గతంలో Shakespeare in Love చిత్రంతో ఆస్కార్ అందుకున్న గ్వినేత్ పాల్ట్రో ( Gwyneth Paltrow ) IV drip గురించి ఓ ఇంటర్వూలో చెప్పటం , అలాగే తన ‘Goop’ బ్రాండ్ ద్వారా “జేడ్ ఎగ్స్”, “ఎనర్జీ స్టిక్కర్లు” వంటి ఆరోగ్య ప్రయోజనాల లేని ఉత్పత్తులను ప్రమోట్ చేసి తీవ్రమైన విమర్శలకు గురయ్యారు అలాగే కరీనా కపూర్ వంటి కొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇదే తరహా ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు ప్రమోట్ విషయంలో విమర్శలు వచ్చాయి.
అయితే సెలబ్రెటీలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటే ..వారిని ఫాలో చేస్తోంది ఫ్యాన్స్ ...పేషెంట్స్ కాదు.
చిట్కాలు పంచటానికి సోషల్ మీడియా ఫ్యామిలీ మ్యాగజైన్ కాదు.
సమంతా చేస్తోంది ఆమె వైపు నుంచి నిజాయితీగా తన పర్శనల్ ఎక్సపీరియన్స్ షేర్ చేసుకోవటం కావచ్చు. కానీ సోషల్ మీడియా అనేది డైరీ కాదు. అది ఒక ప్రజా వేదిక. ఇకపై సెలబ్రిటీలు ఏదైనా ఆరోగ్య చిట్కా చెప్పే ముందు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి:
“Wellness can be a story. But health must be science.”
సమంతా లాంటి ప్రముఖులు తమ అనుభవాన్ని వ్యక్తిగతంగా పంచుకోవచ్చు. కానీ ప్రజలపై దీని ప్రభావం పరిగణనలోకి తీసుకోకుండా ప్రచారం చేయడం అనేది ప్రమాదకరమైన చర్యగా మారుతుంది.
ముందు సెలబ్రిటీగా కాదు... బాధ్యతగల పౌరుడిగా ఆలోచించాలి
✅ ఆరోగ్య ప్రచారాలపై నిబంధనలు అవసరం
భారత్‌లో డిజిటల్ మీడియా వేదికలపై ఆరోగ్య సంబంధిత ప్రమోషన్లకు,సూచనకు గైడ్‌లైన్లు రూపొందించాలి.
✅ సెలబ్రిటీ హెల్త్ ఎండార్స్‌మెంట్స్‌కు వైద్య ప్రమాణాలు ఉండాలి
నేను కేవలం నా అనుభవాలనే వ్యక్తిగతంగా చెబుతున్నాను, నిన్ను మోసం చేయడం లేదు,ఫాలో అవమనటం లేదు అనడం సరిపోదు. సెలబ్రెటీలు చెప్పే ప్రతి హెల్త్ చిట్కాకు, ఆరోగ్య ప్రకటనకు హెల్త్ బోర్డు ప్రామాణికత ఉండాలి.
✅ ప్రజల్లో ఆరోగ్య విలువలపై అవగాహన పెంచాలి
అదే సమయంలో అంతా సమంత మీదో మరో సెలబ్రెటీమీదో తోసేయటం కాదు. "సమంతా చెప్పిందని చేసాను, నమ్మాను" అనే స్థాయిలో ఉండే సమాజం ప్రమాదకరం. ప్రజలలో మెడికల్ లిటరసీ పెరగాలి. ప్రతి ప్రకటనకు, ఆర్గ్యుమెంట్ కు పరిశోధన అడగాలి.
పాపులార్టీ అనేది ఒక వరం కాదు, బాధ్యత
సమంతా లాంటి సెలబ్రిటీలు ఆరోగ్య ప్రచారాలు చేయొచ్చు. పనికొచ్చే విషయాలు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని, ప్రత్యేక శ్రద్ధతో అభిప్రాయం - హక్కు - బాధ్యత అనే మూడు మార్గాలను జాగ్రత్తగా వేరు చేసుకుని ప్రపంచం ముందుకు రావాలి. ఎందుకంటే నిరూపించబడని లేదా హానికరం కాని ఉత్పత్తులను ప్రచారం చేయడం ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదాలను కలిగిస్తుంది. దీని వల్ల డబ్బు నష్టపోవడమే కాకుండా, సరైన వైద్య చికిత్సను ఆలస్యం చేసే అవకాశం కూడా ఉంది.
సమంత వివాదం సెలబ్రిటీలు ఆరోగ్య ఉత్పత్తులను ప్రచారం చేసేటప్పుడు పాటించాల్సిన నైతిక బాధ్యతలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. సెలబ్రిటీలు తమకున్న భారీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పద్ధతులను ప్రోత్సహించాలి, తప్పుడు సమాచారాన్ని లేదా హానికరం కాని ఉత్పత్తులను కాదనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.
ఒక నటుడు లేదా నటి లేదో మరో సెలబ్రెటీ తన అభిమానులపై ప్రభావం చూపడం సహజం. కానీ ఆ ప్రభావం వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండేలా చూసుకోవడం అనేది మానవులుగా కనీస బాధ్యత. ఆ భాధ్యత లేకుండా సెలబ్రెటీలు ఇచ్చే సలహాలు… శరీరానికి కాదు, వాట్సాప్ యూనివర్శిటీకి సరిపోతాయి!"