'సత్యం సుందరం' మూవీ రివ్యూ!

మానవ సంబంధాలని కొత్త కోణంలో చూపించే ఇలాటి సినిమాల్ని కూడా ప్రేక్షకులు చూసి ఆదరించాల్సి వుంది. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే ద్రోహం చేయడమే.

Update: 2024-09-28 10:27 GMT

-సికిందర్ 

ఈ రోజుల్లో యాక్షన్ సినిమాల పేరుతో అతి హింస, రక్తపాతం, జుగుప్స చూపించే సినిమాలు మార్కెట్ ని ఏలుకుంటున్న నేపథ్యంలో, వీటి మధ్య కొన్ని అమాయకమైన గొర్రె పిల్లల్లాంటి సినిమాలు వస్తూంటాయి. తెలుగులో కూడా వచ్చాయి ఇటీవలే. 35, గొర్రె పురాణం లాంటివి. వీటి క్వాలిటీ ఎలా వున్నా ఇలాంటి సినిమాలు తీయాలన్న ఆలోచన రావడమే గొప్ప. తమిళంలో నైతే ఇలాటి సినిమాల్లో నటించడానికి స్టార్లు సైతం ముందుకొస్తున్నారు. స్టార్ల వల్ల ఇలాటి సినిమాలకి గుర్తింపు వస్తుంది. తమిళంలో ఈవారం విడుదలైన ‘మీ అళగన్’ (స్వీట్ హార్ట్) తెలుగులో ‘సత్యం సుందరం’ గా విడుదలైంది. ఇందులో తమిళ స్టార్ కార్తీ, హీరో అరవింద్ స్వామి నటించారు. 2018లో విజయ్ సేతుపతి- త్రిష లతో ‘96’ అనే ఫీల్ గుడ్ హిట్ తీసిన దర్శకుడు సి ప్రేమ్ కుమార్, ఆరేళ్ళ తర్వాత మరో ఫీల్ గుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి తమిళ స్టార్ సూర్య, జ్యోతిక నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ కాంబినేషన్ల గ్లామర్ తోతెరకెక్కిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఎలా వుందో చూద్దాం...

కథేమిటి?

1996లో సత్యం (అరవింద్ స్వామి) కుటుంబంతో కలిసి గుంటూరు సమీపంలో ఓ గ్రామంలో వుంటాడు. తాతల కాలంనుంచి వస్తున్న ఆ ఇల్లన్నా, ఆ వూరన్నా సత్యంకి చాలా ఇష్టం. అలాంటిది కొందరు బంధువుల మోసం వల్ల ఆ ఇల్లు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కుటుంబంతో వైజాగ్ వెళ్ళి స్థిర పడాల్సి వస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ళు గడిచిపోయినా ఆ ఇల్లు, ఆ వూరు జ్ఞాపకాలు విడిచిపెట్టవు సత్యం ని.

ఇలావుండగా, బాబాయి కూతురి పెళ్ళికి అదే వూరు వెళ్లాల్సి వస్తుందిప్పుడు సత్యంకి. ఈ పెళ్ళిలో బావా అని పిలుస్తూ ఓ వ్యక్తి (కార్తీ) వెంటపడతాడు. ఇతనెవరో ఏంటో సత్యం గుర్తుపట్టక అతడి అతి మర్యాదలు, అప్యాయతలు, చొరవ, సాన్నిహిత్యం భరిస్తూ వుంటాడు. అతను జిడ్డులా సత్యంని పట్టుకుని అతి చేస్తూంటాడు. సత్యం ఇక చీదరించుకునే దశకొచ్చేస్తాడు. ఇదీ లాభంలేదని అతడ్ని అర్ధం జేసుకోవడానికి ప్రయత్నిస్తూ కలిసి గడుపుతూంటే, కొత్త విషయాలు తెలుస్తూంటాయి సత్యం కి. ఈ క్రమంలో అతడి వల్ల సత్యంకి తన గురించి తెలిసిన విషయాలేమిటి? ఇంతకీ ఇతనెవరో పేరైనా గుర్తుకొచ్చిందా లేదా? చివరికి ఇద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? ఇదీ మిగతా కథ.

ఫీల్ గుడ్ తో ప్రయోగం

దర్శకుడు ప్రేమ్ కుమార్ తిరిగి ‘96’ లోని పంథానే అనుసరించాడు- ఎత్తుపల్లాల్లేని, మలుపులూ సఘర్షణ లేని కథ, భావోద్వేగాలు, డ్రామా లేని సాదా సన్నివేశాలు- సినిమా నిజ జీవితాలకి దగ్గరగా వుండాలన్న మితిమీరిన వాస్తవికత, బయోగ్రఫీ లేదా డాక్యుమెంటరీ టైపు మేకింగ్. ‘96’ తో ఈ దర్శకుడి స్కూలు ఇదేనని తెలుసుకున్న తర్వాత అలవాటు పడి దీన్ని కూడా చూడాలి. అయితే ఒకటి- ఎంత ఫీల్ గుడ్ సినిమా అయినా ఇలా మూడుగంటల సేపు చూడాల్సి వస్తే ఫీల్ బ్యాడ్ అయిపోయే ప్రమాదముంది. ఈ సినిమాకి రెండు గంటల నిడివి చాలు.

ఎప్పుడు ఎలా నోరు మూసుకోవాలో తెలియని బంధువుగా కార్తీ పాత్ర మొదలవుతుంది. కానీ, కాలం గడిచేకొద్దీ, అతడి ఆకర్షణ, చమత్కారం, అమాయకత్వం కలిసి అత్యంత ప్రేమగల వ్యక్తిగా అనిపిస్తాడు. కార్తీ ప్రేమని అందుకోవడం ప్రారంభించిన తర్వాత అరవింద్ స్వామి లో మార్పు వస్తుంది. ఈ మార్పు దేని గురించి అన్నదే ఇక్కడ సస్పెన్స్.

నిజంగానే ఫస్టాఫ్ సీట్లకి కట్టిపడేస్తుంది. ఇది కేవలం కార్తీ టాలెంట్ వల్లే. సినిమాలోని ప్రధాన సంఘర్షణ చాలా సింపుల్‌గా, వుండీ లేనట్టు వుంటుంది. ఇలాటి సఘర్షణతో ఒకప్పుడు లైటర్ వీన్ సినిమాలంటూ తెలుగులో వచ్చి ఫ్లాపయ్యేవి. అయితే సెకండాఫ్‌లో ఒక పాయింట్ తర్వాత ఆ ఆకర్షణ అంతా విసుగు తెప్పిస్తుంది. రెండు పాత్రలూ జల్లికట్టు, స్టెరిలైట్ సంఘటన, శ్రీలంక అంతర్యుద్ధం అంటూ ఏవేవో మాట్లాడతాయి. ఈ విషయాలు నిజంగా కార్తీ విశాల హృదయాన్ని బహిర్గతం చేస్తున్నప్పటికీ, ఫస్టాఫ్ లో సృష్టించిన ఆకర్షణ ఇప్పటికి తగ్గిపోతుంది. ఇందుకే సినిమా నిడివి తగ్గాలనేది.

కథలో హృదయాల్ని కదిలించే అనేక క్షణాలున్నాయి. అయితే చివరి వరకూ ఇవే సాగి విసుగు తెప్పించినప్పటికీ, కార్తీ - అరవింద్ స్వామిల అద్భుతమైన బ్రోమాన్స్ వల్ల వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.

మేకింగ్ క్వాలిటీ ఒక ప్లస్

35 కోట్లతో ఈ కమర్షియలేతర రియలిస్టిక్ మూవీ తీశారంటే మేకింగ్ క్వాలిటీ గురించి చెప్పనక్కర్లేదు. పల్లెటూరి లొకేషన్లు, వాతావరణం, వీటిని హైలైట్ చేసే కెమెరా వర్క్, బీజీఎం అన్నీ కంటెంట్ కి న్యాయం చేసేలా వున్నాయి. కార్తీ, అరవింద్ స్వామిలతో గ్లామర్ కూడా పెరిగింది. విజువల్ అప్పీల్ సరే. ఇంకా ఇందులో శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి తదితరులు నటించారు. వయొలెంట్ సినిమాల మధ్య ఓ పిల్ల వాయువు ఈ ‘సత్యం- సుందరం’ అనే గొర్రెప్పిల్ల. మానవ సంబంధాలని కొత్త కోణంలో చూపించే ఇలాటి సినిమాల్ని కూడా ప్రేక్షకులు చూసి ఆదరించాల్సి వుంది. ఓటీటీలో చూద్దాంలే అనుకుంటే ద్రోహం చేయడమే.

రచన- దర్శకత్వం : సి. ప్రేమ్ కుమార్

తారాగణం : కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి తదితరులు

సంగీతం : గోవింద్ వసంత, ఛాయాగ్రహణం : మహేంద్రన్ జయరాజు, ఎడిటింగ్ ఆర్.గోవిందరాజ్

నిర్మాతలు: జ్యోతిక సదన, సూర్య శివకుమార్

విడుదల : సెప్టెంబర్ 28, 2024 

Tags:    

Similar News