సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' రివ్యూ
అసలు ఈ సినిమా కథేంటి , సిద్దూ ఈ సినిమాలో మరోసారి మ్యాజిక్ చేసారా వంటి విషయాలు చూద్దాం.;
హిట్ వచ్చి చాలా గ్యాప్ వస్తే ఖచ్చితంగా తాను ఆడియన్స్ పల్స్ పట్టుకోలేకపోయానేమో అని, ఈ కాలం జనరేషన్ ఆలోచనలను అందుకోలేకపోతున్నామేమో అని చాలా భయాలు వస్తూంటాయి. అది బొమ్మరిల్లు భాస్కర్ కు జరిగినట్లుంది. బొమ్మరిల్లు సినిమా చాలా కాలం క్రితం సూపర్ హిట్ . ఎంత పెద్ద హిట్ అంటే బొమ్మరిల్లు అనేది లేకపోతే భాస్కర్ పేరు కూడా గుర్తు పట్టలేనంత. అంతకు మించిన హిట్ రాలేదు. ఎంత ట్రై చేసినా ఆ బొమ్మరిల్లు తనను వీడిపోలేదు. దాంతో ఆ ఛాయలను వీడి, కొత్త తరానికి పనికొచ్చే కథ చేయాలనే ఈ సినిమా చేసినట్లున్నారు. అందుకు సిద్దు జొన్నలగడ్డ వంటి ఈ జనరేషన్ ని మెప్పించే హీరో తోడయ్యారు. ఇద్దరు కలిసి తెరపై తొడ కొట్టి హిట్ కొట్టారా... అసలు ఈ సినిమా కథేంటి , సిద్దూ ఈ సినిమాలో మరోసారి మ్యాజిక్ చేసారా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
జాక్ అలియాస్ పాబ్లో నెరుడా (సిద్ధు జొన్నలగడ్డ) తెలివైన వాడే. కానీ సొంత పంధా కోరుకుంటాడు. దాంతో ఎవరేం చెప్పినా వినకుండా ముందుకు వెళ్లి బోల్తా పడుతుంటాడు. అలాంటి జాక్ కు జీవితాశయం రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా)లో జాయిన్ కావాలనేది. “రా” ఇంటర్వ్యూ అయిన తర్వాత సెలెక్ట్ అయ్యేవరకు ఎందుకు ఆగాలి అనే ఉద్దేశంతో, ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థ హైదరాబాద్‌లో చేసిన బాంబ్ బ్లాస్ట్‌ను ఒక స్లీపర్ సెల్‌ను అదుపులోకి తీసుకుని ఆపేస్తాడు.
అయితే ఆ క్రమంలో ఓ కన్ఫ్యూజన్ కు గురి అయ్యి “రా” ఏజెంట్ మనోజ్ (ప్రకాష్ రాజ్)ను కూడా అదుపులోకి తీసుకుంటాడు. అప్పుడు ఓ పక్క రా టీం అలాగే టెర్రరిస్ట్ గ్యాంగ్ కూడా జాక్ వెంటపడటం మొదలెడతారు. ఇది చాలదన్నట్లు జాక్ ఏ పని చేస్తున్నాడో తెలుసుకునేందుకు అతని తండ్రి(నరేష్) ఏర్పాటు చేస్తాడు.
ఇవన్నీ పట్టించుకోకుండా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ అంతు చూడాలని నేపాల్ వెళ్ళాడు. అప్పుడు ఏమైంది..ఇంతకీ జాక్ నేపాల్ స్పై ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా?, ‘రా’లో తనకు చోటు దక్కిందా? చివరికి ఏమైంది? అనేది మిగిలిన సినిమా.
ఎనాలసిస్
భాస్కర్ ఈ కథ కొత్తది అనుకున్నారు కానీ అంతకు ముందు తెలుగు తెరపై ఇలాంటి కళా ఖండాలు వచ్చేసాయనే విషయం చూసుకోలేదు. డైరక్టర్స్ కూడా అప్పుడప్పుడు ప్రక్క డైరెక్టర్స్ సినిమాలు చూస్తుండాలి మరి. అసలు ఈ ఏజెంట్ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీకు భయపెట్టాలా అఖిల్ క్లాస్ ఇచ్చాక కూడా ధైర్యం చేసారంటే వీరి సాహసానికి మెచ్చుకోవాలి. ఈ సినిమాలో ఏమి లేదు అని చెప్పలేం కానీ ... ఈ జనరేషన్ కు తగ్గ రైటింగ్ లేదు. ప్రెజెంటేషన్ లేదు అని చెప్పాలి.
అంటే పదేళ్ల క్రితం ఈ సినిమా రిలీజైతే హిట్ అవుతుందా అంటే ... అప్పుడు కూడా సినిమా అమాయకులు తక్కువే కానీ పోనీలే ఓ సారి థియేటర్ లో చూద్దాం అనే క్షమాపణ ధోరణి ఉండేది. ఇప్పుడు ఓటీటీలో చూసుకుందాంలే అనే కొత్త దాడి మొదలైంది. ఈ సినిమా ప్లస్ ఏమిటయ్యా అంటే ...ఫలానాది బాగుంది అని గుర్తు పెట్టుకుని చెప్పాల్సిన పనిలేదు. ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు ఒకేలాగ ఉన్నాయి. కాబట్టి పెద్ద విశ్లేషణ అవసరం లేదు. సినిమా చూసాక మీకు ఒకటే డౌట్ వస్తుంది .. ‘రా’ ఏజెంట్ అంటే...ఏమైనా ఇన్సూరెన్స్ ఏంజెంట్లా...అంత ఈజీనా అని.
టెక్నికల్ గా..
విచిత్రంగా టెక్నికల్ గా కూడా ఈ సినిమాకు పెద్ద సపోర్ట్ దొరకలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంటుంది. పాటలు అంతే సంగతులు. కెమెరా వర్క్ ఉన్నంతలో బెస్ట్ . ఎడిటర్ నవీన్ నూలి మనకు పెద్ద అన్యాయం చేశాడని వాపోతాం. ఏ మాటికా మాట ..నిర్మాతలు మాత్రం ఎక్కడ తగ్గకుండా బాగానే ఖర్చుపెట్టారు. నటీనటుల్లో ...సిద్దు తప్పించి మిగతా వాళ్లు గురించి పెద్దగా చెప్పుకునేలా చెయ్యలేదు దర్శకుడు.
ఫైనల్ థాట్
జాకీలేసి లేపినా ఈ జాక్ ని రావడం కష్టం. సినిమా చూస్తూ రెండే పనులు చేయగలం..ఒకటి తెలియకుండా నిద్రలోకి వెళ్లిపోవటం లేదా సెల్ ఫోన్ ఓపెన్ చేసి మాట మాటకి చూసుకుంటూండటం