నటి సౌందర్య హత్య రచ్చ, మోహన్ బాబు లింక్ ఏమిటి?

ఈ కొత్త రచ్చ వెనక ఎవరు ఉన్నారు?;

Update: 2025-03-12 09:04 GMT

గత కొద్ది నెలలుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో సమస్యలు మీద సమస్యలు వస్తున్నాయి. అవి తీవ్రమై ఓ టైమ్ లో పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వివాదం వెళ్లింది. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మొదలైన వివాదంలో మోహన్ బాబు కూడా భాగమై , ఓ రిపోర్టర్ ని కొట్టి సుప్రీంకోర్ట్ దాకా కూడా వెళ్లారు. అయితే ఈ వివాదానికి ఆస్తుల పంపకాలే కారణమనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ ఆస్దులు వివాదం ఇలా కొనసాగుతుండగానే.. ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరంగా మోహన్ బాబుపై ఓ కేసు నమోదైంది.అది ఆస్తులకు సంభందించిందే కావడం విశేషం.

మోహన్ బాబు పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి...ఖమ్మం జిల్లా కలెక్టర్, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సినీ నటి, స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జల్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు, ఆ క్రమంలో ఇద్దరినీ మోహన్ బాబు హత్య చేయించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే..

ఓ టైమ్ లో సౌందర్య తెలుగు సినిమాని ఏలింది. తెలుగు ,తమిళ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన సౌందర్య. అయితే పెళ్ళైన తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయిన సౌందర్య.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సౌందర్య మరణంతో ఇండస్ట్రీ షాక్ తిన్నది. ఇక సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్ళు పైనే అవుతుంది. ఆమె మరణం ప్రమాదం వల్లనే అని అంతా ఫిక్స్ అయిన తరుణంలో.. ఇన్నేళ్ళకు.. సౌందర్య ది సహజ మరణం కాదు, ఆమెను హత్య చేయించారు అంటూ ఓ వ్యక్తి బయటకు వచ్చి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాదులోని శంషాబాద్ సమీపంలోని జల్ పల్లి లో పెద్ద ఇంట్లో ఉంటున్నారు. అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు సమాచారం. అయితే అది ఆయన కొనలేదని.. సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఎదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు. సినీ నటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి అతను ఫిర్యాదు చేశాడు.


ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతే కాదు దివంగత హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.

దాంతో వారిపై ఈ విషయంలో కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణలో పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్షాలు దొరక్కుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఆ తర్వాత జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ని అక్రమంగా అనుభవిస్తున్నాడని చిట్టిబాబు తన కంప్లైంట్ లో తెలిపాడు.


అసలే ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న మోహన్ బాబుపై మరో బాంబ్ పేలినట్టు అయ్యింది. ఇక అంతటితో ఆగకుండా చిట్టిబాబు మరో డిమాండ్ కూడా చేస్తున్నాడు. మంచు టౌన్ లో ఉన్న ఆ గెస్ట్ హౌస్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అంతేకాక మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కి న్యాయం చేయాలని, ఈ విషయంలో మోహన్ బాబు పై తగు చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ లో కోరాడు చిట్టి బాబు.

ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అంత ధైర్యంగా ఓ వ్యక్తి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం, ఆరోపణలు చేయడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయంలో మంచు మోహన్ బాబు ఎలా స్పందిస్తారు అనేది పక్కన పెడితే ఈ ఆరోపణలు వెనక ఎవరు ఉన్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలవటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రికి శాలువా కప్పి సన్మానించారు. ముఖ్యమంత్రితో భేటీ కి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన 'ఎక్స్' ఖాతా వేదికగా పంచుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తమకు లభించిందని మంచు విష్ణు పేర్కొన్నారు. పలు ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చూపిన చొరవకు, నిబద్దతకు ధన్యవాదాలు అని తెలిపారు. అయితే ఈ కేసు విషయం ముందే తెలిసి వెళ్లి రేవంత్ రెడ్డి కలిసి ఉంటారా అనే సందేహం కొందరు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News