శ్రీవిష్ణు 'సింగిల్' మూవీ రివ్యూ
అసలు ఈ చిత్రం కథేంటి, శ్రీ విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడా? చూద్దాం!;
కామెడీ, ప్రేమ, ఎమోషన్‌ల మేళవింపుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో శ్రీవిష్ణు స్పెషలిస్ట్. ఆ ప్రత్యేకతను మరోసారి రుజువు చేయడానికి ఆయన ఈ సారి #సింగిల్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు —. “సింగిల్ లైఫ్ vs రిలేషన్‌షిప్ లైఫ్” మధ్య నడిచే ఈ ఫన్నీ ప్రయాణంలో, నవ్వులతో పాటు కొంత ఆలోచన కూడ అద్దింది టీమ్. ట్రైలర్, పాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచగా… థియేటర్లలో ఈ "సింగిల్" ఏమాత్రం కిక్కిచ్చాడు? అసలు ఈ చిత్రం కథేంటి, శ్రీ విష్ణు మరోసారి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడా? చూద్దాం!
స్టోరీ లైన్
విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేసే సాధారణ ఉద్యోగి. మంచి మనసున్నోడు, కానీ తన ప్రేమ విషయంలో చాలా సీరియస్. ఒక రోజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు పూర్వ (కేతికా శర్మ) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ ఆడి కార్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటుంది.
ఆమెను ప్రేమలో పడేయాలన్న ఉద్దేశంతో విజయ్ ఓ ప్లాన్ వేస్తాడు – ఆమెతో కార్ టెస్టు డ్రైవ్ వెళ్లి తన మనసు చెప్పాలని. కానీ ఆ ప్లాన్‌లో ఓ చిన్న ‘మిస్ కమ్యూనికేషన్’ జరుగుతుంది. హరిణి (ఇవానా) అనే యువ డ్యాన్సర్ తనని విజయ్‌ని ప్రేమిస్తున్నాడని అపోహ పడుతుంది. హరిణి విజయ్‌ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఇక్కడినుంచి కథ మెల్లగా ముక్కోణపు ప్రేమకథగా మారుతుంది.
ఒకవైపు విజయ్ పూర్వ వెంట తిరుగుతుంటే… మరోవైపు హరిణి విజయ్ వెనకాల తిరుగుతుంది. అప్పుడే కథలోకి ప్రవేశిస్తాడు మూర్తి (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి వచ్చి మలుపు తిప్పుతాడు. మరో ప్రక్క విజయ్‌కు బాసుగా ఉండే అరవింద్ (వెన్నెల కిషోర్) కథను కెలికేస్తూంటాడు. ఈ క్రమంలో విజయ్ ప్రేమ కథ ఎలా ఓ కొలిక్కి చేరుకుంది. చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
వాస్తవానికి ఇది ప్రేమ కథ కాదు. లైఫ్ లో ఉన్న రిలేషన్ కాంప్లెక్సిటీకి ఫన్ మిర్రర్. ‘#సింగిల్’ అనే టైటిల్ పెట్టినా… కథ మాత్రం డబుల్ కన్ఫ్యూషన్ – ట్రిపుల్ ఎమోషన్ – సింగిల్ చాయిస్! . కథలో ప్రధాన పాత్రలైన విజయ్, పూర్వ, హరిణి మధ్య నడిచే ఈ సినిమా సాధారణ ప్రేమ కథ అనిపించినా, కథలోని ప్లాన్‌లు, మిస్ కమ్యూనికేషన్, ఎమోషన్ చూపడం స్క్రీన్‌ప్లేను ప్రత్యేకంగా మారుస్తుంది. ప్రేమ ఒక ప్లాన్ అయితే, ఎంటర్టైన్మెంట్ ఒక స్క్రీన్‌ప్లే! అన్నట్లు కథను నడిపారు.
ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలోని ట్రెండింగ్ టాపిక్స్‌ని డైలాగుల్లో ఇమిడ్చిన విధానం బాగా కుదిరింది. వాటిని శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో..వెరైటి ఎక్సప్రెషన్స్ తో పలికిన తీరు ప్రేక్షకుల్ని బాగానే నవ్విస్తుంది. నిజానికి ఫస్ట్ హాఫ్ కథంతా మెట్రోస్టేషన్ చుట్టూనే అక్కడక్కడే తిరుగుతున్నట్లు ఉంటుంది. కథలో బలమైన కాంప్లిక్ట్స్ కూడా ఏమీ కనిపించదు. అయితే డైలాగుల బలంతో తెరపై విజయ్‌గా శ్రీవిష్ణు - అరవింద్‌గా వెన్నెల కిషోర్ కలిసి కనిపించిన ప్రతిసారీ థియేటర్లో జనం నవ్వుతారు.
ఇంటర్వెల్ తర్వాత అసలు కథలోకి వెళ్లడం కొంచెం ఆలస్యం అయ్యినప్పటికీ, డైరక్టర్, రైటర్స్ ఆ లోపాలను కామెడీ మరియు శ్రీ విష్ణు-వెన్నెల కిషోర్ కలయికతో పక్కగా కవరప్ చేసారు. కథ అంతా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా సాగకపోయినా, ప్రస్తుతం కమ్యూనికేషన్‌లో ఉన్న మీమ్స్ ఫ్లేవర్ జోడించడం సినిమాకు మరింత ఎంటర్టైనింగ్‌గా నిలిచింది.
ఎవరెలా చేసారు
శ్రీ విష్ణు తనకి ఫెరఫెక్ట్ గా సూటయ్యే మ్యానరిజంస్, నేచురల్ కామెడీ ట్రాక్, జెంటిల్ హ్యూమర్ ఉండటంతో చెలరేగిపోయాడు. కేతికా శర్మ, ఇవానా ఇద్దరికీ కూడా బాగా స్కోప్ ఇచ్చిన కథ ఇది. ముఖ్యంగా హరిణి క్యారెక్టర్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ బాగా నవ్వించారు.
టెక్నికల్ గా చూస్తే... ఇలాంటి సినిమాలకు అవసరమైన పాటలు మాత్రమే మొహం చాటేసాయి. అలాగే మేకింగ్ లో క్వాలిటీ లేదు. బాగా చిన్న సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది. మెట్రో స్టేషన్, ఆఫీసు సెటప్, పెంట్ హౌస్ తప్ప పెద్దగా లొకేషన్లు కూడా లేవు. కేవలం రైటర్స్, శ్రీవిష్ణు కలిసి మోసిన సినిమా ఇది. ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే... ప్లజెంట్ ఫీలింగ్ ఇచ్చింది.
ఫైనల్ గా
ఈ వీకెండ్ నవ్వుకునేందుకు మంచి ఆప్షన్ . శ్రీవిష్ణు ఫ్యాన్స్ కు అయితే పండగే.