వివాదంలో చిక్కుకున్న తమిళ నటుడు ‘సంతానం’
తన కొత్త సినిమాలో శ్రీ వేంకటేశ్వర భక్తి గీతాన్ని రీమిక్స్ చేయడంతో వివాదం, ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-14 13:39 GMT
ఒకప్పటి తమిళ స్టార్ కమెడియన్ సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని కిస్సా-47 అనే పాట ప్రారంభంలో వేంకటేశ్వర స్వామి పై పాడే భక్తి గీతాన్ని వాడుకున్నారు.
దీనిపై భక్తులతో పాటు టీటీడీ దేవస్థానం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పలువురు రాజకీయా ప్రముఖులు కూడా ఈ చిత్రంలోని వేంకటేశ్వర స్వామి గీతాన్ని తొలగించాలని, భారీ నష్టపరిహారాన్ని వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆగ్రహం రేకెత్తిన పాట..
ఈ సినిమాలోని కిస్సా-47 పాట విడుదల చేయడంతో సమస్య మొదలైంది. పాట ప్రారంభంలోనే ‘ శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశ గోవిందా, భక్త వత్సల గోవిందా’ అంటూ ప్రారంభం అయి, పాశ్చాత్య గీతంతో మిక్స్ చేశారు. దీనితో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ గీతాన్ని లిరిక్ గా విడుదల చేశారు. ఆఫ్ రో స్వరపరచిన ఈ పాటను కెలిథీ రాశారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ పాపులారిటీ తో పాటు రాజకీయ, మత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించింది.
ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడూ సంతానం తాను పెరుమాళ్ కు అంకితభావంతో సేవచేసే వాడినని చెప్పుకున్నాడు. తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు.
చట్టపరమైన, రాజకీయ పరిణామాలు..
తిరుమల,తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయిన బీజేపీ నాయకుడు భానుప్రకాశ్ రెడ్డి, సంతానంతో పాటు నిర్మాత నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పై పరువు నష్టం నోటీసు జారీ చేశారు. ఆ పాట హిందు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, సినిమా నుంచి తక్షణమే పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. పాట అలాగే ఉంటే రూ. 100 కోట్లు చెల్లించాలని కూడా నోటీస్ లో డిమాండ్ చేశారు.
జనసేన నిరసన..
ఈ సినిమా పాటపై జనసేన నిరసన వ్యక్తం చేసింది. ఆ పార్టీ తిరుపతి ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ తిరుపతి వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఈ పాట వేంకటేశ్వరుడిని అవమానించేలా ఉందని, మతపరమైన భావాలు కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ ఈ చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని కోరాడు.
పాటను తొలగించే వరకూ తమిళనాడు ప్రజాప్రతినిధులకు తిరుమల వేంకన్న దర్శనాన్ని నిలిపివేయాలని ప్రతిపాదించాడు. తమిళనాడు ప్రభుత్వం హిందూ మనోభావాలపై ఇటువంటి దాడులకు మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. దేవుడిపై విశ్వాసం లేని నాస్తికులు దీనిని నడుపుతున్నారని, అందువల్ల వారు అలాంటి వివాదాస్పద కంటేంట్ ను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతిక తివారీ, సెల్వరాఘవన్, గౌతమ్ వాసుదేవ మీనన్ తో సహ ఇతరులు నటించారు. ఈ చిత్రంలో ఓ ప్రయాణం భయనకంగా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
ఈ చిత్రం విడుదలకు ముందే అనేక వివాదాలకు కేంద్రంగా మారింది. సెన్సార్ షిప్ కోసం డిమాండ్లు వస్తన్న తరుణంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున డెవిల్స్ డబుల్స్ నెక్ట్స్ లెవెల్ సజావుగా విడుదల అవుతుందా ? లేదా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.