350 కోట్ల 'డిజిటల్ డిలేమా లో తెలుగు నిర్మాతలు. ఏమా డిలేమా?

నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ ,సోనీ లివ్ వంటి వంటి డిజిటల్ సంస్దల చేతుల్లోకి మెల్లిమెల్లిగా నిర్మాతలు వెళ్లిపోతున్నారు.

Update: 2024-11-03 03:00 GMT

తెలుగు చిత్ర పరిశ్రమ ముఖ్యంగా పెద్ద నిర్మాతలు ఓటిటి సంస్దల నుంచి వచ్చే ఆదాయాలపై ఆధారపడటం ఇప్పుడు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ ,సోనీ లివ్ వంటి వంటి డిజిటల్ సంస్దల చేతుల్లోకి మెల్లిమెల్లిగా నిర్మాతలు వెళ్లిపోతున్నారు.ఓటిటి సంస్దల రూల్స్, రెగ్యులేషన్స్ తో టాలీవుడ్ లో నిరుత్సాహంగా ఆవరిస్తోంది. గత కొద్ది కాలంగా ఓటిటి సంస్దలు తెలుగు పరిశ్రమపై పెట్టుబడులు తగ్గించటం నిర్మాతలను నష్టాలవైపుకు తోసేస్తోంది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కేవలం నెట్ ప్లిక్స్, అమేజాన్ మాత్రమే కాకుండా డిస్నీ హాట్‌స్టార్ ,. జీ5 కూడా ఈ సంవత్సరం పెద్ద సినిమాల OTT డీల్స్ ను పెండింగ్‌లో ఉంచాయి. దాంతో ఓటీటీ రెవెన్యూ ని నమ్ముకుని ఆల్రెడీ పెద్ద సినిమాలు ప్రారంభించి అందుకు తగిన రేట్లు రాక ఇబ్బంది పడుతున్న పెద్ద నిర్మాతల లిస్ట్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఫిల్మ్ ఛాంబర్ లోనూ, ఫిల్మ్ క్లబ్ లోనూ కూర్చుని ఒకరినొకరు ఓదార్చుకోవటం తప్పించి నిర్మాతలు ఏమి చేయలేని సిచువేషన్. డిజిటల్ దిగ్గజాలు దీన్ని వినోదంగా చూస్తున్నట్లున్నాయి. గత కొంతకాలంగా తెలుగు సినిమాలను తగ్గించి ఇండస్ట్రీలో కలకలం రేపిన మాట వాస్తవం. ఇది తెలుగు సినిమాకు నిజంగా ఆందోళనకరమైన పరిస్థితి .

ఓటీటీ సంస్దలు కరోనా తర్వాత నుంచి పెద్ద సినిమాలను భారీ రేట్లకు కొనటం మొదలెట్టాయి. దాంతో ప్రతీ పెద్ద హీరో ఓటీటీలో ఇంత వస్తోంది కాబట్టి మాకు ఇంత ఇవ్వాల్సిందే అని రేట్లు పెంచుకుంటూ వెళ్లిపోయారు. ఇప్పుడు ఓటీటీ సంస్దలు మేము అంతంత రేట్లకు కొనలేము అని చేతులు ఎత్తేసాయి. కానీ హీరోలని మాత్రం రేట్లు తగ్గించండి అని నిర్మాతలు అడగలేరు. అడిగితే వాళ్లకు డేట్స్ ఇవ్వరు. ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోతాయి. ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్రిమెంట్స్ ప్రకారం సొమ్ము ఇవ్వాల్సిందే. అన్నేసి కోట్లు హీరోలకు ఇచ్చేసి ఓటీటీల్లో ఆ రేట్లు రాకపోతే ఏం చెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో పెద్ద నిర్మాతలకు తెలియడం లేదు.

గతంలో టీవీ శాటిలైట్ రైట్స్ ని బట్టి హీరోలు తమ రెమ్యునరేషన్స్ నిర్ణయించుకనేవారు. శాటిలైట్ మార్కెట్ ఉన్న హీరోలతోనే సినిమాలు ప్రారంభమయ్యేవి. ఇప్పుడు అదే సిట్యువేషన్ ఓటీటీ సంస్దలు వైపు టర్న్ అయ్యింది. అయితే శాటిలైట్ సంస్దలు లోకల్ కాబట్టి లెక్కలు వేరుగా ఉండేవి. నిర్మాతలకు ధైర్యంగా ఉండేవి. కానీ పెద్ద ఓటీటీ సంస్దలన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. వాళ్ల బాస్ లు, మెయిన్ ఆఫీస్ లు ముంబైలో ఉంటారు. వాళ్లు కార్పొరేట్ కల్చర్ లో నడుస్తుంటారు. వాళ్లు ఒక్కో సినిమా కొనుగోలు చేసేటప్పుడు వంద పేజీలు పైగా ఎగ్రిమెంట్స్ చేయిస్తున్నారు. అందులో క్లాజ్ లు చదివే ఓపిక ఏ నిర్మాతకు లేదు. చదివినా నేను సైన్ చేయను అనే ధైర్యం అంతకన్నా లేదు.

ఓటీటీ సంస్దలు,నిర్మాతలతో చేసుకునే అగ్రిమెంట్ లలో సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర దాని ఫెరఫార్మెన్స్ బట్టి కూడా రేట్లు తగ్గిస్తామని రాసి ఉంటోంది. అదే నిర్మాతల పాలిట శాపంగా మారుతోంది. చివరకి రిలీజ్ డేట్ ని వాళ్లే నిర్ణయించే స్థితికి పరిస్థితి చేరుకుంది. సూపర్ స్టార్స్ సినిమాలకు సైత్ వాళ్లు రేట్లు తగ్గించటం నిర్మాతలకు మాట రావడం లేదు. దాదాపు ఎనభై చిన్న సినిమాలు ఓటిటి సంస్దలు చుట్టూ ఎగ్రిమెంట్స్ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. వాళ్లకు ఏ రేటు నిర్ణయించి అగ్రిమెంట్ చేస్తారనేది తెలియక టెన్షన్ తో ఉన్నారు.

ఈ నేపథ్యంలో మొదట్లో అంత ఉత్సాహంగా ఎంత రేటు అయినా పెట్టి సినిమాలు కొనుకున్న ఓటీటీ సంస్దలు ఎందుకు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయనే సందేహం వస్తుంది.దానికి సమాధానం ఏమిటంటే... అప్పుడు వారికి వ్యూయర్ షిప్ టార్గెట్ ఉంది. పెద్ద స్టార్స్ సినిమాలు తమ దగ్గర ఉంటే సబ్ స్కైబర్స్ పెరుగుతారని భావించి ఆ సినిమాల రైట్స్ తీసుకున్నారు. ఇప్పుడు తాము దాదాపు ఎక్సపెక్ట్ చేసిన సబ్ స్క్రిప్షన్ టార్గెట్ రీచ్ అయ్యారు.

దాంతో ఇప్పుడు అంత అర్జెంట్ గా అంతంత రేట్లు పెట్టి మరీ సినిమాలు కొనాల్సిన అవసరం లేదు. దాంతో నాన్చుడు బేరం చేస్తున్నాయి. డీల్స్ ని సాగ తీస్తున్నాయి. దానికి తోడు మనవాళ్లకు ఇంగ్లీష్, కొరియన్ సినిమాలు తెలుగులో డబ్ చేసి మరీ అలవాటు చేయటంతో తెలుగు కంటెంట్ తోనే తమ ఓటీటీ నింపాల్సిన అవసరం అసలు లేదు. కాబట్టి నిర్మాతలు చుట్టూ వాళ్లు తిరగడం లేదు. నిర్మాతలే వాళ్ల చుట్టూ తిరిగేలే చేసుకున్నారు. ఏదైమైనా ఓటీటీ సంస్దలు 300 నుంచి 350 కోట్ల దాకా తెలుగు ఓటీటీ కంటెంట్ పై ఖర్చు పెడుతున్నట్లు అంచనా. ఇప్పుడు అందులో తమ వాటా ఎంత అనేది ప్రతి నిర్మాత వెతుక్కుంటున్నారు.

Tags:    

Similar News