మేధో దోపిడీ కథే ‘ద స్టొరీ టెల్లర్’

క్యాపిటలిస్ట్ దోపిడీ ఎవ్వరని వదలదు!;

Update: 2025-02-03 06:59 GMT

సత్యజిత్ రే (Satyajith Ray)పరిచయం అవసరం లేని పేరు:

సత్యజిత్ రే సినీపరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. బెంగాలీ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన దర్శకుడు. ‘నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చూసిన భారతీయ సినిమా పథేర్ పాంచాలి. ఆ సినిమా ఒక భారతీయుడు భారతీయుల కోసం,అలాగే ప్రపంచం కోసం తీసాడు. అది ఒక సంస్కృతికి పరిమితమయ్యే చిత్రం కాదు. నాకు ఇతర ప్రపంచాల గురించి తెలుసుకునేలా చేసిన సినిమా అది’ అని ప్రఖ్యాత అమెరికన్ దర్శకుడు మార్టిన్ స్కోర్సేస్ (Martin Scorsese)కీర్తించిన వాడు సత్యజిత్ రే. ఒక రచయితగా, తన తాత,తండ్రులు నడిపిన పత్రికను వారి తర్వాత నడిపిన పబ్లిషర్ గా, మొదటి గౌరవ ఆస్కార్ (OSCAR)పొందిన భారతీయుడిగా, భారతరత్న పురస్కారం పొందిన తొలి చలనచిత్ర ప్రముఖుడిగా తనకంటూ ఒక చరిత్రను లిఖించినుకున్న మేధావి సత్యజిత్ రే). దర్శకుడిగా ఎంత గొప్పవాడో, రచయితగా కూడా అంతే గొప్ప ముద్రను నిలుపుకోగలిగాడు సత్యజిత్ రే. ఇప్పుడు సత్యజిత్ రే రాసిన ‘గోల్పో బోలియే తరిని ఖురో’ అనే కథను కిరీత్ ఖురానా అనే రచయితతో కలిసి అనంత్ నారాయణ్ మహదేవన్ అనే దర్శకుడు ‘ద స్టొరీ టెల్లర్’ (The Story Teller)సినిమాను తీసాడు. ఇది ఇప్పుడు హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

సత్యజిత్ రే కథ సినిమాగా తీయడం అంత సులభమా?

సత్యజిత్ రే సినిమాను 2025 లో మారిన ప్రేక్షక అభిరుచుల రీత్యా నాణ్యతలో రాజీ పడకుండా తీయడం సులభమైన విషయమేమి కాదు. సత్యజిత్ రే మీద ఒక విమర్శ ఉంది. మరి స్లో నెరేటివ్ తోను,కేవలం కథల,నవలల ఆధారమైన స్క్రీన్ ప్లే తోనే సినిమా మాత్రమె తీస్తారని, మారిన ప్రేక్షకుల అభిరుచులకు తగట్టు కొత్త ఒరవడిని ఆయన అందిపుచ్చుకోలేదని. దానికి సత్యజిత్ సమాధానం కూడా కొన్ని ఇంటర్ వ్యూ లలో ఇచ్చారు.

‘ఇక్కడ కొంత వెనుకబడిన ప్రేక్షకులు ఉన్నారు. ఎంత ప్రగతి సాధించిన వాతావరణంలో ఉన్నా ఎక్కువశాతం మంది అన్ సాఫీస్టికేటేడ్ ఆడియన్స్ ఉండటం వల్ల వారు కమర్షియల్ అంశాలను దాటిన వాటిని చూడలేరు. ముందు నుండి కూడా, నేను తీసే సినిమాలకు ఎటువంటి ఆడియన్స్ ఉండాలి,వారు ఎలా స్పందించాలి అనే విషయాలపై నాకో అవగాహన ఉంది. అటువంటి ప్రేక్షకులకు నా సినిమా చేరితే నేను విజయం సాధించినట్టే’అన్నారు ఒక ఇంటర్ వ్యూ లో సత్యజిత్ రే .


ఇలా భిన్నంగా ఆలోచించే సత్యజిత్ రే కథల్లో చాలా సాధారణ విషయాలే ఉంటాయి. మాములు మనుషులే ఉంటారు. కానీ కథలో ఎన్నో పరోక్ష అంశాలు ప్రేక్షకులు ఆలోచిస్తే తప్ప అర్థం కానివి ఉంటాయి. అవి అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే సత్యజిత్ రే మేధను గుర్తించగలరు, అభినందించగలరు. మరి ఈ నేపథ్యంలో సత్యజిత్ రే రాసిన కథను సినిమాగా ప్రేక్షకులు మెచ్చేలా చేయడం సులభమేనా ? ఈ ప్రయత్నంలో అనంత్ ,కిరీత్ ఏ మేరకు సఫలికృతం అయ్యారో చూద్దాం.

కథ ఏంటి?

తనకు ఒంటరిగా ఉన్న వాళ్ళ గురించి రాయడమంటే ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో సత్యజిత్ రే చెప్పారు. ఇద్దరూ ఒంటరి వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి చెప్తూ, వారిద్దరూ కలవడానికి ఒక సామాన్య అంశం ఉండేలా సత్యజిత్ రే రాసిన కథే ‘గోల్పో బోలియే తరిని ఖురో.’ కథ విషయానికి వస్తే తరుణీ బందోపాధ్యాయ కోల్కతా లో ఉండే ఒక స్టొరీ టెల్లర్. ఏ ఉద్యోగంలొనూ స్థిరంగా ఉండనివాడు. ఉద్యోగం చేసిన సమయంలో 73 ఉద్యోగాలు మారినవాడు. కథ జరిగే సమయానికి 60 ఏళ్ల వయసు దాకా ఉన్నవాడు. భార్య లేదు. కొడుకు అమెరికాలో ఉద్యోగం చెస్తూ కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. కథలు చెప్పడంలో తరుణీ దిట్ట. కానీ తన కథలకు ఆదరణ ఉంటుందో ఉండదో అన్న భయంతో రాయలేదు. ప్రస్తుతం ఖాళిగా ఉంటున్నాడు. క్యాపిటలిస్టు విధానాన్ని గట్టిగా వ్యతిరేకిస్తాడు. కొడుకు రమ్మని పిలిచినా అమెరికా క్యాపిటలిస్ట్ దేశం కాబట్టి వెళ్ళడానికి ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ పేపర్ లో ఒక స్టొరీ టెల్లర్ కోసం ప్రకటన కనిపిస్తుంది. అది ఒక గుజరాతి వ్యాపారవేత్త గరోడియా ఇచ్చింది. గరోడియాకు నిద్ర పట్టకపోవడం వల్ల కథలను స్లీపింగ్ పిల్ గా వాడటం కోసం ఈ ప్రకటన ఇచ్చాడు. ఇక్కడ ఆ వ్యాపారవేత్త జీతమిస్తాడు, తరుణీ కథలు చెప్పాలి ప్రతి రాత్రి,ఇది మాములు కథే. స్టొరీ టెల్లర్ గా పరేష్ రావల్, వ్యాపారవేత్తగా అదిల్ హస్సేన్ ,సరస్వతిగా రేవతి బాగా నటించారు.

కానీ ఈ ఇద్దరు ఒంటరి వాళ్ళు. వ్యతిరేక జీవన సిద్ధాంతాలు,మనస్తత్వాలు ఉన్నవారు. తరుణీ మాంసాహారి, క్యాపిటలిస్ట్ వ్యతిరేకి. గరోడియా శాఖాహారి,స్వయంగా తానె క్యాపిటలిస్ట్ (Capitalist )స్వభావం కలవాడు.కథలు అంటే ఏవో ఒకటి కాకుండా తప్పక ఒరిజినల్ కథలే చెప్పాలి అంటాడు గరోడియా. అక్కడ లైబ్రరికి వెళ్తూ ఉంటాడు తరుణీ.అక్కడ ఒక రోజు గరోడియా కథలు కొత్తగా పబ్లిష్ అవుతున్నట్టు, అవి తన కథలే అని కూడా అతనికి తెలుస్తుంది. అప్పుడు తరుణీ ఏం చేసాడు? గరోడియా ఎవరి కోసం దొంగ రచయితగా మారాడు? చివరకు ఏమైంది అన్నదే ఈ బెంగాలి సినిమా కథ.

మేధో దోపిడీ కథ!

గరోడియా ఇంట్లో పుస్తకాలూ బోలెడు ఉన్నాయి. కాని ఒక్క పుస్తకం కూడా చదవలేదు.అలాగే ఆ ఇంట్లో పికాసో పెయింటింగ్ ఒకటి నకలు ఉంది. అంటే ఇతరులు రాసినవి, బొమ్మలు వేసినవి ఒక కలక్షన్ గా ఉంచుకోవడం ఒక హాబి అయితే పర్లేదు,లేదా జ్ఞానం పెంచుకోవడానికి ఒక సాధనంగా ఉన్న పర్లేదు. కాని ఇతరుల మేధను తమ మేధగా చిత్రించుకుంటే మాత్రం ప్రమాదం.

ఈ పుస్తకాలు, పెయింటింగ్ సత్యజిత్ రే కథలో తానూ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న ‘క్యాపిటలిస్ట్ దోపిడీ’కి ఎన్నుకున్న వస్తువులు. గరోడియాలోని దోపిడీదారుని బయట పెట్టడానికి కేంద్రంగా ఉన్న వస్తువులు ఇవి. తరుణీ వాడిన మాక్సిం గోర్కి పేరును కూడా కాపి కొట్టి అదే పేరుతో కథలు రాస్తాడు గరోడియా. తరుణీ మాటలనే వల్లిస్తాడు తానూ ప్రేమించిన స్త్రి దగ్గర.

తరుణీ ఏ క్యాపిటలిస్ట్ విధానాన్ని వద్దనుకున్నాడో, తెలియకుండానే పరోక్షంగా ఒక క్యాపిటలిస్ట్ చేతుల్లో దోపిడీకి గురయ్యాడు. తెలియకుండా జరిగితేనే దోపిడీ కొనసాగుతుంది. తరుణికి విషయం తెలిసాక గట్టిగానే అలానే గరోడియా పద్ధతిలోనే బదులు చెప్పాడు.

తరుణీ గరోడియా నుండి సెలవు తీసుకుంటూ ‘Good artists copy,Great artists steal’ అని పికాసో అన్న మాటల్ని కోట్ చేస్తాడు. ఈ ఒక్క కోట్ తో,తరుణీ గోర్కి ప్రస్తావనతో, ఇంట్లో ఉన్న పిల్లితో సత్యజిత్ రే కథ ప్రేక్షకుల మీద మ్యాజిక్ చేస్తుంది. ఆర్ధిక దోపిడిని మాత్రమే ఎక్కువగా దోపిడిగా చూసే క్రమంలో మనకు తెలియకుండా ఎన్ని రకాల దోపిడీ ముఖ్యంగా మనిషి తెలివి తేటలు ఎంత తెలివిగా దోపిడీ చేసే వారు చుట్టూనే ఉంటారో అన్న అంశాన్ని చాలా సింపుల్ గా చెప్పే సినిమా ఇది.

మామూలు కథగా అయితే ఒక షార్ట్ ఫిలిం కి సరిపోతుంది; కానీ సత్యజిత్ రే కథగా ఈ సినిమాను చూపించాలన్న దర్శకుని తాపత్రయమే ఈ సినిమాను గంటన్నర పైగా నిడివి ఉండేలా చూసింది. ఒక కమర్షియల్ ఫార్ములా ట్రాక్ లో అయితే కొంత దారి తప్పినా, సత్యజిత్ రే  కథ ఆత్మ ప్రతిఫలించేలా చేయడంలో మాత్రం విజయం సాధించిన సినిమా ఇది. ఇన్స్టంట్ ఎక్సైట్మెంట్ ఇచ్చే సినిమా కాదు ఇది, ఒక ఆలోచనను మెదడులో నాటే సినిమా ఇది!

                                    * * *


Tags:    

Similar News