థగ్ లైప్: తమిళనాడులో ఫుల్.. కర్ణాటకలో నిల్..
మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలతో కర్ణాటకలో విడుదలకు అంగీకరించని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్..;
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) నటించిన 'థగ్ లైఫ్' (Thug Life) సినిమా ఈ రోజు(జూన్5) రిలీజ్ అయ్యింది. కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ విడుదలైంది. ఈ సందర్భంగా తమిళనాడు(Tamil Nadu)లో 'థగ్ లైఫ్' ప్రదర్శితమవుతున్న ధియేటర్ల వద్ద సందడి నెలకొంది. కమల్ అభిమానులు బాణసంచా పేలుస్తూ.. కేరింతలు కొడుతూ కనిపించారు. కాగా ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో కమల్ చేసిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో కర్ణాటక(Karnataka)లో ఈ చిత్రం విడుదలకు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం తెలిపింది. అయితే బెంగళూరు నుంచి కమల్ హాసన్ అభిమానులు కర్ణాటక సరిహద్దులోని హోసూర్ చేరుకుని మూవీ రిలీజ్ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
బాక్సాఫీస్ బజ్..
ప్రీ-రిలీజ్ బుకింగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే రూ.13.89 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంలో సిలంబరసన్, త్రిష కృష్ణన్, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ వంటి ప్రముఖ నటులు నటించారు.
అసలు వివాదమేంటి?
‘థగ్ లైఫ్’ (Thug Life) ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని కమల్ వ్యాఖ్యానించారు. దాంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేగింది. కన్నడ భాషా ప్రేమికులు నిరసనకు దిగారు. కమల్ ఫొటోలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక సంస్థ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కన్నడ భాషాభిమాన సంఘాలు, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేకపోతే సినిమా విడుదల కాదని తేల్చిచెప్పారు. అయితే కమల్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించి, కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ఒకరి మనోభావాలు గాయపరిచే హక్కు మరొకరికి లేదని చెబుతూనే.. ‘‘ఒక్క క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అయ్యేది" అని కోర్టు పేర్కొంది. ఇక చేసేదేమీ లేక ప్రస్తుతానికి కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ రిలీజ్ కావడం లేదని కమల్ చెప్పారు.