టాలీవుడ్ సెలబ్రిటీలకి వివాదాల ఉచ్చు!

ఎవరి వెనుక ఏం కథ వుందో అనుమానాలు బలపడితే పానిండియా నిర్మాతలు కూడా రిస్కు తీసుకోలేరు. టాలివుడ్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో సరిపెట్టుకోవాలిక!

By :  Sikandar
Update: 2024-09-20 10:30 GMT

వివాదాలు లేకపోతే ఏ సినిమా పరిశ్రమ అయినా డల్‌గా వుంటుందన్నట్టు తయారయ్యింది టాలీవుడ్ ధోరణి. ఎప్పుడూ ఏదో ఒక సెక్స్ స్కాండల్ కేసు, డ్రగ్స్ కేసు, లేదా రేవ్ పార్టీ కేసు హెడ్ లైన్స్ సృష్టిస్తున్నాయి. సంచలనాలు సినిమాల్ని హిట్ చేసి సృష్టించేది పోయి ఇలాటి చీకటి కార్యకలాపాలతో క్రియేట్ చేస్తున్నారు. సెలబ్రిటీల జీవితాన్ని గడపడం అంత సులభమేమీ కాదు నిజమే, ఎందుకంటే వారి వ్యక్తిగత వృత్తిపర జీవితాల్ని ఎల్లప్పుడూ మీడియా స్కానింగ్ చేస్తూ వుంటుంది. అయినా లక్ష్యపెట్టక క్రిమినల్ కేసులకి దారితీసే కార్యకలపాలకి పాల్పడుతున్నారు.

దేశంలోని అత్యంత రిచ్ మాత్రమే కాదు, అత్యంత అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర పరిశ్రమలలో ఒకటిగా వున్న టాలీవుడ్ వివాదాల కేంద్రంగా మారింది. భారీ యెత్తున బాలీవుడ్ ని తలదన్నే పానిండియా సినిమాలు నిర్మిస్తూ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ

వ్యాప్తంగానూ ప్రతిష్ట గడిస్తున్న టాలీవుడ్ మీద అందరి దృష్టీ వుంది. కొత్తదనం లేని హిందీ సినిమాలతో ఇక లాభంలేదని బాలీవుడ్ నిర్మాతలు తెలుగులో పానిండియా సినిమాలు నిర్మించేందుకు టాలీ వుడ్ కి వలస వస్తున్నారు. ఇంతటి వందల కోట్ల రూపాయల బిజినెస్ ని రాబట్టుకుంటూ అగ్రగామిగా వున్న టాలీవుడ్ లో కొంత మంది బుద్ధి లేని సెలెబ్రిటీలు పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని కెరీర్ ని కోల్పోతున్నారు.

తాజాగా ఈ ఉచ్చులో జానీ అలియాస్ జానీ బాషా అనే కొరియోగ్రాఫర్ చిక్కుకున్నాడు. దీనికి ముందు నటి హేమ ఇరుక్కున్దీ.ఈమెకి ముందు డ్రగ్స్ కేసుల్లో చాలామంది నటులు బుక్కయ్యరు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయ్యాడు. కొన్నేళ్ళ పాటు అసిస్టెంట్ తో అతను లైంగిక వేధింపులకి పాల్పడుతున్నట్టు బాధితురాలే హైదరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతను పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి గోవాలో అతడ్ని అరెస్టు చేశారు. హైదరా తీసుకొచ్చి కోర్టులో హాజరు పర్చారు. అతడి మీద కఠినమైన పోక్సో కేసు పెట్టారు.

జానీ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా వున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత తెలుగు సినిమా, టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. తాజా అప్‌డేట్ ప్రకారం, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్, తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో వున్నం

దున ఈ విషయంలో ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా టాలీవుడ్ ప్రముఖులను కోరింది.

హేమ హ్యాండ్సప్!

జానీ కేసుకి ముందు ఇటీవలే అంటే జూన్ లో, బెంగళూరు రేవ్ పార్టీ కేసుని విచారిస్తున్న బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, నటి కోళ్ళ కృష్ణవేణి అలియాస్ హేమని అరెస్టు చేసింది. మే 19న బెంగుళూరు లోని ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ రెవ్ పార్టీలో విచ్చల విడిగా డ్రగ్స్ వినియోగించారు. ఈ సమాచారంతో సీసీబీ టీం ఘటనా స్థలంపై దాడి చేసి పార్టీకి హాజరైన వారి రక్త నమూనాలను సేకరించింది. రిజల్టు పాజిటివ్ గా రావడంతో హేమతో సహా 86 మంది కేసు పరిధిలోకి వచ్చేశారు. రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొన్నారు. పాల్గొన్నవారిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు వున్నారు. ఈ దాడిలో 1.5 కోట్ల రూపాయల విలువైన ఎం డీఎంఏ (ఎక్స్ టసీ) మాత్రలు, ఎం డీఎంఏ క్రిస్టల్స్, హైడ్రో గంజాయి, కొకైన్, అత్యాధునిక కార్లు, సౌండ్ సిస్టమ్, లైటింగ్‌ సహా డీజే పరికరాలని పోలీసులు జప్తు చేశారు. అయితే అరెస్టయిన హేమకి తర్వాత బెయిలు లభించింది. కానీ ఆమె చాలా బ్యాడ్ అయిపోయింది. తెలుగు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ హేమపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది.

డ్రగ్స్ తో సేఫ్ అయిపోయారు!

ఇలా వుండగా, గత ఫిబ్రవరిలో హైదరాబాద్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖకి పెద్ద ఎదురుదెబ్బ తగిలి, 2017 డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ సెలబ్రిటీలపై నమోదైన ఎనిమిది కేసుల్లో ఆరింటిని సిటీ కోర్టు కొట్టివేసింది. ఈ కేసుల్లో నిందితులైన సెలెబ్రిటీలు హమ్మయ్యా అని బయట పడ్డారు. రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్‌ సహా పూరీ జగన్నాధ్, నవదీప్, సుబ్బరాజు తదితర టాలీవుడ్ ప్రముఖులు వున్న ఈ ఎనిమిది కేసులపై సిట్ దర్యాప్తు చేపట్టారు. టాలీవుడ్‌లోని నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు సిట్ సమన్లు పంపింది. అయితే ఫోరెన్సిక్ ప్రాసెసింగ్ కోసం జుట్టు, గోళ్ల నమూనాలను సమర్పించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ కోర్టు కేసుని కొట్టివేసింది.

జులై 2, 2017న సంగీతకారుడు కాల్విన్ మస్కరెన్హాస్‌ ని కస్టమ్స్ అరెస్టు చేయడంతో పాటు రూ. 30 లక్షల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడంతో కేసు వెలుగు చూసింది. విచారణలో నటీనటులకి, సెలబ్రిటీలకి, కొన్ని కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకూ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. 30 మందిని అరెస్టు చేశారు, వీరిలో 12 మంది టాలీవుడ్ ప్రముఖులే వున్నారు.నటులు రవితేజ, ఛార్మీకౌర్, ముమైత్ ఖాన్, తరుణ్, సుబ్బరాజు, తనీష్, నందు, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌లని విచారించారు.

మొత్తానికి సెలబ్రిటీలు కేసులోంచి బయటపడ్డారు. అయినా ఇలాటి క్రిమినల్ కేసులకి పాల్పడడం మానుకోవడం లేదు. మీడియా మాత్రమే కాదు, తమ విరోధుల దృష్టిలో కూడా తాము వుంటారని తెలుసుకోవడం లేదు. అవకాశం చూసుకుని ఇరికించడమే విరోధుల పని. దీంతో కెరీర్లు కూడా మంటగలిసిపోయే పరిస్థితి. ఇలాటి ఘటనల వెనుక కొన్ని బడా శక్తుల రాజకీయాలు వున్నట్టు కూడా విన్పించవచ్చుగానీ ఆధారాల్లేవు. పదేపదే టాలీవుడ్ ఇలాటి మురికి అంటించుకుంటే దాని పానిండియా, పాన్ గ్లోబల్ పరపతికే హాని చేసుకున్నట్టు. ఎవరి వెనుక ఏం కథ వుందో అనుమానాలు బలపడితే బయటి నుంచి పానిండియా నిర్మాతలు కూడా రిస్కు తీసుకోలేరు. తెలుగు సినిమా అదే మునుపటి తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో సరిపెట్టుకోవాలిక!

Tags:    

Similar News