Tollywood Boxoffice: 2025 ఫిబ్రవరి లో ఓ పెద్ద హిట్, కొన్ని డిజాస్టర్స్

సంక్రాంతి సీజన్ తెలుగు పరిశ్రమకు అనుకున్నట్లుగానే డబ్బులు తెచ్చిపెట్టింది.;

Update: 2025-03-01 11:38 GMT

సంక్రాంతి సీజన్ తెలుగు పరిశ్రమకు అనుకున్నట్లుగానే డబ్బులు తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాని తెచ్చింది. అయితే ఆ తర్వాతే భాక్సాఫీస్ నెమ్మిదించటం మొదలెట్టింది. సంక్రాంతికి జనం సినిమాలపై ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టేయటంతో అద్బుతమైన సినిమా ఉంటేనే థియేటర్ కు వెళ్ళే పరిస్దితి. ఇది ప్రతీ సంవత్సరం ఉంటుంది. అందుకే సంక్రాంతి వెళ్లాక పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కు రావు. ఎన్నాళ్లుగానో ఆగిపోయిన సినిమాలు రిలీజ్ అవుతాయి.

అయితే ఫిబ్రవరిది ఓ చిత్రమైన పరిస్థితి. మార్చి నుంచి పిల్లలకు పరీక్షలు మొదలైపోతాయి. ఆ ప్రిపరేషన్ లో తల్లిదండ్రులు, పిల్లలు బిజీగా ఉంటారు. ఎప్పుడో రిలాక్సేషన్ కోసం మాత్రమే థియేటర్ కు వెళ్తారు. అదీ బాగా టెమ్ట్ చేస్తేనే, లేకపోతే ఓటీటీలతో సరిపెట్టుకుంటారు. అయితే మన వాళ్లు ఈ పరిస్దితి తెలిసినా సరే ఫిబ్రవరిలో కూడా కొత్త సినిమాలను థియేటర్ లో వదులుతున్నారు. ఈ సంవత్సరం డజనుకు పైగా సినిమాలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే వాళ్ళే థియేటర్ కు వస్తారులే అనే నమ్మకం వాళ్లది. ఆ క్రమంలో ఈ 2025 ఫిబ్రవరికి వచ్చిన సినిమాలు వాటి రిజల్ట్ లు చూద్దాం.

పట్టుదల

అజిత్‌ (Ajith Kumar) హీరోగా మాగిజ్‌ తిరుమనేని తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘విదాముయార్చి’ (Vidaamuyarchi). తెలుగులో ‘పట్టుదల’ (Pattudala Movie) పేరుతో ఈ నెల 6న బాక్సాఫీసు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డబ్బింగ్ సినిమా పట్టుదల డిజాస్టర్ అయ్యింది. అసలు అజిత్ సినిమా ఒకటి వచ్చి వెళ్ళిందనే సంగతి కూడా చాలా మందికి తెలీదు. త్రిష హీరోయిన్‌గా అలరించిన ఈ మూవీలో అర్జున్‌, రెజీనా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తండేల్

నాగచైతన్య.. దర్శకుడు చందూ మొండేటి కలయికలో రూపొందిన చిత్రం ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. సాయిపల్లవి హీరోయిన్. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు రూ.100కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇది చైతన్య కెరీర్‌లో రూ.100కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రమని.. మొదటి రోజే ఈ సినిమా పైరసీ బారిన పడినా ఆ అవాంతరాలన్నీ దాటుకొని ఈ ఘనత సాధించిందని.. ఇప్పటికే ఓవర్సీస్‌లోనూ 1మిలియన్‌ మార్క్‌ దాటిందని చిత్ర టీమ్ తెలిపింది. అయితే ఈ కలెక్షన్స్ పై చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అది వేరే సంగతి.

‘బ్రహ్మా ఆనందం’

బ్రహ్మానందం.. ఆయన కుమారుడు రాజా గౌతమ్‌.. తాత - మనవళ్లుగా సినీప్రియుల్ని అలరించచటానికి వచ్చారు. వీళ్లిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రమే ‘బ్రహ్మా ఆనందం’. ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. ఐశ్వర్య, ప్రియా వడ్లమాని, దివిజ, వెన్నెల కిశోర్, సంపత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా బాగా నిరాశపరిచింది. మినిమం కూడా కలెక్ట్ చేయలేదు.

‘లైలా’

విశ్వక్‌ సేన్ వేసిన లేడీ గెట‌ప్‌తోనూ.. విడుద‌ల‌కు ముందు చోటు చేసుకున్న వివాదాల‌తోనూ ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆక‌ర్షించిన చిత్రం.. ‘లైలా’. చాలా రోజుల త‌ర్వాత ఓ హీరో పూర్తిస్థాయి లేడీ గెట‌ప్‌లో క‌నిపిస్తూ న‌టించిన చిత్రమిది. ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. విశ్వక్ అభిమానుల కి సైతం ఈ సినిమా నచ్చలేదు. దీంతో అందరికీ ఓపెన్ గా సారీ చెప్పి ఓ లెటర్ రిలీజ్ చేశాడు విశ్వక్.

‘రామం రాఘ‌వం’

తన కొడుకు ప్రయోజకుడై మంచి పేరు తెచ్చుకోవాలని ఆశించిన ఓ తండ్రి.. నాన్న తనని అర్థం చేసుకోవడం లేదని బాధపడే ఓ తనయుడి సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘రామం రాఘవం’ (Ramam Raghavam). హాస్యనటుడు ధనరాజ్‌ కీలక పాత్ర పోషిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రమిది. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 21న ఇది విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు మినిమం వసూళ్లు కూడా దక్కలేదు.

డ్రాగన్, జాబిలమ్మ నీకు అంత కోపమా

ఇక ఫిబ్రవరి మూడో వారంలో డ్రాగన్, జాబిలమ్మ నీకు అంత కోపమా డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. రెండు యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ అయినా ఇందులో ఒకటే బాగుందనిపించుకుంది. డ్రాగన్ సినిమా బాక్సాఫీసు ఫరవాలేదనిపించుకుంది. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా తెలుగు వెర్షన్ అసలు వర్కవుట్ కాలేదు.

‘బాపు’

‘బలగం’ ఛాయలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘బాపు’. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ‘బలగం’ సుధాకర్‌రెడ్డి టైటిల్ పాత్రలో నటించారు. అయితే బాపు సినిమా ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రప్పించడంలో విఫలమైంది.

మజాకా

ఫిబ్రవరి చివరి వారంలో సందీప్ కిషన్ మజాకా తో వచ్చాడు. ధమాకా తర్వాత త్రినాధ్ నక్కిన తీసిన సినిమా కావడంతో దీనిపై ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే ఈ కథని తొలుత చిరంజీవి- సిద్దు జొన్నల గడ్డకి అనుకున్నారు. అయితే మజాకా చూసిన తర్వాత ఈ కథ చిరుకి సరిపడదనే ఫీలింగ్ కలిగింది. సినిమాని శివరాత్రి రోజున వదిలారు. నిర్మాతలు అనుకున్నంతగా వర్కవుట్ రాలేదు. వీకెండ్ లో పుంజుకుంటుదనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. చూడాలి మరి

శబ్దం

ఈ నెలాఖరులో నెలలో చివరి సినిమాగా ఆది పినిశెట్టి శబ్ధంతో వచ్చాడు. వైశాలి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. అయితే ఈ సినిమా ఓ వర్గానికే పరిమితం అయ్యింది. అన్ సీజన్ అనుకున్న ఫిబ్రవరిలో ఇన్ని కొత్త సినిమాలు వరుస కట్టడం వరకు ఆనందమే కానీ అందులో తండేల్ ఒకటే వంద కోట్ల సినిమా ఉండటం జరిగింది.

Tags:    

Similar News