ఓటిటిలో కొత్త తరహా కాన్సెప్టులు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో కామెడీలు తక్కువ. మలయాళం నుంచి మాత్రమే ఎక్కువగా కామెడీలు వస్తూంటాయి. అయితే తాజాగా తమిళంలో రూపొంది హిట్టైన ‘పెరుసు’ (Perusu) సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్ తో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది. అసలు కాన్సెప్టు ఏమిటి, కామెడీ బాగానే పండిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
ఓ గ్రామానికి పెద్ద పరందామయ్య. ఆయనకు ఇద్దరు కొడుకులు. వాళ్లు సామి (సునీల్ రెడ్డి) ఓ ఎలిమెంటిరీ స్కూల్ టీచర్. అతని తమ్ముడు దురై (వైభవ్). ఆ పెద్దాయన ఓ రోజు అనుకోకుండా టీవీ చూస్తూనే చనిపోతాడు. ఆయన చావు ఆ అన్నదమ్ములు ఇద్దరికి పెద్ద సమస్య తెచ్చిపెడుతుంది. ఎందుకంటే చనిపోయిన తండ్రి అంగం స్థంభించి ఉంటుంది.
ఓ ప్రక్కన ఇంటి పెద్ద పోయాడనే బాధ .. మరో ఆయన చనిపోయిన ఫోజ్ కో ఓ సమస్య. ఈ విషయం గురించి ఊరి వాళ్లకు తెలిస్తే తమ పరువు పోతుందనే భయం మరో పక్క. దాంతో స్పై లాగ తిరిగే పక్కింటి వారికీ సైతం ఈ విషయం పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటారు స్వామి, దురై.
అయితే అది అంత తేలికగా అయ్యేపనేనా. ఆ ప్రయత్నంలో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తాము అనుకున్నట్టే తండ్రికి తుది వీడ్కోలు పలికారా? అసలు పరందామయ్య మరణానికి కారణమేంటి? వంటి విషయాలు చుట్టూ తిరిగే కథనం ఈ సినిమా.
ఎలా ఉంది
పెరుసు అంటే పెద్ద. పైన స్టోరీ లైన్ చదవగనే ఏదో అడల్ట్ కామెడీలా అనిపిస్తుంది కానీ డైరక్టర్ డీసెంట్ గానే డీల్ చేసాడు. కానీ ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూడటం కష్టమే. ఇళంగో రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు 2023లో వచ్చిన శ్రీలంకన్ మూవీ 'టెంటిగో' ఆధారం. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఓ నిర్మాత కావటం విశేషం. దీనిని తెలుగులో ‘పెద్ద’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయటానికి రెడీ అవుతున్నారు.
ఇలాంటి స్క్రిప్టుని డీల్ చేయడం డైరక్టర్ కి కత్తిమీద సామే. ఎందుకంటే ఏ మాత్రం బాలెన్స్ తప్పినా అడల్ట్ కామెడీ అయ్యిపోతుంది. అటు వైపుకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా కామెడీ చేసుకుంటూ వచ్చారు. అయితే, ఇంట్లో శవాన్ని పెట్టుకుని కామెడీ చేస్తున్నారేంటి అనే ఆలోచన వస్తే మాత్రం అక్కడే ఆగిపోతారు. ఇక ప్రీ క్లైమాక్స్ దాకా కామెడీ చేసి, చివర్లో తండ్రీకొడుకుల అనుబంధంతో హృదయాన్ని హత్తుకునే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది.
ఎవరెలా చేసారు
నిజ జీవితంలో అన్నదమ్ములైన వైభవ్, సునీల్ రెడ్డి ఇందులోనూ బ్రదర్స్‌గా నటించడం విశేషం. వాళ్లిద్దరూ బాగానే చేసారు. ఇక ఆటోశంకర్ గా నటించిన రెడిన్ కింగ్స్ లే, డాక్టర్ గా నటించిన విటి గణేశ్, సామి, దురై మేనమామ పాత్రలో కనిపించిన మునీశ్ కాంత్, ఫ్రీజ్ బాక్స్ ఓనర్ గా నటించిన కరుణాకరన్ అందరూ తమదైన స్టైల్ లో కామెడీ బాగానే పండించారు. టెక్నికల్ గా ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఎడిటింగ్ క్రిప్స్ గా ఉంది. కొత్త తరహా కామెడీకి తగినట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి.
చూడచ్చా
ఈ కొత్త కాన్సెప్టు బాగుందిగానీ. సెన్సిటివ్ అంశానికి ముడిపడింది కావడంతో ఫ్యామిలీతో కలిసి చూడడం ఇబ్బందే. ఒంటిరిగా చూసి ఎంజాయ్ చేయాల్సిందే.