నా సినిమా “ఈ సారైనా”! చూసి రివ్యూ రాయండి మేడమ్ అంటూ విప్లవ్ నాకు ఫోన్ చేశారు.
లింకు పంపారు. కానీ వారం దాకా చూడడం కాలేదు. మొత్తానికి సినిమా చూశాను కానీ వెంటనే రాయలేకపోయాను. విప్లవ్ రెండుసార్లు మెస్సేజ్ చేసిన పిమ్మట ఈ రోజు కూర్చొన్నాను. సినిమా చూస్తున్నంత సేపూ ఈ అబ్బాయి ఏ ధైర్యంతో ఈ సినిమా తీశాడని ఆశ్చర్యపోయాను. కానీ సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ పొరలు పొరలుగా విప్లవ్ దృష్టి,దృక్పథం అర్థమవుతూ వచ్చి సినిమా నచ్చటం మొదలైంది.
కాన్సెప్ట్ పాతదే.
యువత కెరీర్ స్ట్రగుల్ ,రొటీన్ సక్సెస్ ఫార్ములాతో సక్సెస్ స్టోరీ, ప్రేమికుల ప్రేమ కథ,వొప్పుకొని కథానాయిక తండ్రి. రాజు అనే గ్రామీణ నిరుద్యోగి కెరీర్ లో విజయం సాధించడం అంటే సినిమా పూర్తయ్యేలోపల,వ్యాపారం చేస్తూ కోట్ల డబ్బు సాధించడమో,మిద్దెలు కట్టి ,కార్లు,బంగారం కొనడమో,విమానాల్లో విదేశీ ప్రయాణాలు,స్టార్ హోటల్లో ఖరీదైన భోజనాలు చేయడం కాదు.పెద్ద ఐ ఏ ఎస్ ఆఫీసర్ అవడమూ, మల్టీనేషనల్ కార్పొరేట్ కొంపనీల్లో సాఫ్ట్ వేర్ జాబ్స్ చేయడం, రియల్ ఎస్టేట్ లాంటి భూవ్యాపారాలు చేయడమూ కాదు. మరి ఏం చూపించాడు ఈ సినిమాలో దర్శకుడు?
కార్పొరేట్ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా చదువుతో సంబంధం లేకుండా,జ్ఞానంతో,అనుభవంతో సంబంధంలో ఉండే వృత్తులలో స్థిరపడడం ఎలాగో చూపించదలుచుకున్నాడు. అదే సమయంలో చిన్నదో, పెద్దదో అయిన ప్రభుత్వ పోలీస్ జాబ్, లేదా కాంపౌండర్ జాబ్ సంపాదించడం. దాని కోసం నిజాయితీగా,బద్దకం లేకుండా పరీక్షలకు తయారవ్వడం. ఆ చిన్న ఉద్యోగాలకి ప్రయత్నించడానికి,సాధించడానికి ఏమాత్రమూ సిగ్గు పడకపోవడం. డిగ్రీలు,పీజీ లు చేసి పట్ట భద్రు లైనప్పటికి, ఊర్లో బర్రెలను పెంచుకుని పాల వ్యాపారం చేసుకుంటూ కావాలిసినంత డబ్బు సంపాదించడం,ఉన్న మూడు ఎకరాల్లో ఏడాదికి మూడు పంటలు వేసి రైతులుగా ఆత్మ గౌరవం తో ఊర్లోనే హుందాగా బతకడం తప్పు కాదని చెప్పదలుచుకున్నాడు.
సినిమా అంతా...
హీరో రాజు తన ఊర్లో వ్యవసాయం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పరీక్షలు రాస్తూ,ఫెయిల్ అవుతూ ఉండడం, తను ప్రేమించిన చిన్ననాటి స్నేహితురాలు,ప్రభుత్వ టీచర్ శిరీష వాళ్ల నాన్న హేళనలని, ఊర్లో పెద్ద మనుషుల ఇంకా ఎప్పుడు ,ఈసారైనా నోటిఫికేషన్ వస్తే జాబ్ కొడతావా అని పదే పదే వేసే ప్రశ్నలని ఎదుర్కొంటూ చిన్నబోతు,తను ఎంచుకున్న నిర్ణయాల పట్ల ఘర్షణ పడుతూ ఉంటాడు.
ఊర్లో ప్రతీ మనిషీ రాజు కనిపిస్తే చాలు “ఏరా రాజూ “ఈ సారైనా” నోటిఫికేషన్ వస్తే పరీక్ష పాసవుతవా.. సర్కార్ నౌఖరి కొడతావా” అని అదుగుతూనె ఉంటారు. అది రాజులో తీవ్రమైన వొత్తిడి పెన్చుతూ పోతుంది. ప్రతీ ఏడాది నోటిఫికేషన్ పడ్డప్పుడల్లా అప్లై చేస్తూ రాస్తూనే ఉంటాడు.ఫెయిల్ కుడా అవుతుంటాడు తప్పు ఎక్కడో అతనికి అర్థమే కాదు. ఈ సారి శిరీష సహాయం తో పరీక్షకి తయారవుతాడు . సినిమా అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. “ఈ సినిమా చూసాక చాలా ఆశ్చర్యం అనిపించింది ఎడిటర్ గా డైరెక్ట్రర్ గా ,స్క్రిప్ట్ రైటర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా నిర్మాతగా ఎన్నో రకాలుగా తను ఒక్కడే శక్తికి మించిన బాధ్యత తీసుకొని అతి చిన్న వయసులోణే గొప్ప నైపుణ్యంతో,సృజనాత్మకతతో తీసిన సినిమా ఇది. తొలి సినిమా అంటే నమ్మకం కానట్టుగా ఉంది అక్కడక్కడ దర్సకత్వంలో అపరిపక్వత కనిపించిన బాగా తీసాడు.
సినిమా అంతా కూడా తెలంగాణ పల్లె నేపథ్యం లో పల్లె సౌందర్యంతో నిండి పోయి ఉంది. పచ్చటి పంట పొలాలు ,పాతఇళ్ళు ఊర్లో పశువులు, పంట పొలాలు, సర్కారు బడి పిల్లలు వాగులు, వంకలు, మోట బావులలో పిల్లల ఈతల కేరింతలు, రచ్చబండల మీద కూర్చొన్న వృద్దుల ముచ్చట్లు ఇవన్నీ చాలా అద్భుతంగా తీశాడు విప్లవ్.
కథ దగ్గరకొస్తే
సినిమా అంతా కూడా హీరో రాజు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే లక్ష్య సాధన చుట్టూ తిరుగుతుంది ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మామ పెట్టిన కండిషన్ సర్కారీ నౌకరి సంపాదించడం. ఈ సర్కారీ నౌకరి సంపాదించడానికి హీరో రాజుకి బాల్య స్నేహితురాలు,ప్రేమికురాలు అయిన హీరోయిన్ శిరీష, బాల్య స్నేహితుడు భాష బాగా సహకరిస్తారు. తెలంగాణ నిరుద్యోగ యువకుడి పాత్రలో రాజు సరిగ్గా సరిపోయాడు . ఉద్యోగం రాకుండా నిరాశ ని స్పృహలో విఫలమవుతుండడాన్ని బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగాడు ఈ రకంగా తెలంగాణ నిరుద్యోగ యువత రాజులో తమను తాము చుసుకోగలుగు తారు.తాను ప్రేమించిన రాజుకి తండ్రి ఇచ్చిన ఛాలెంజ్ని లేదా పందాన్ని తను తీసుకొని హీరోని లక్ష్యసాధన వైపు నడిపించే పాత్రలో హీరోయిన్ అశ్విని చాలా హుందాగా నటించింది హీరోయిన్ తండ్రి ప్రదీప్ నటన చాలా సహజంగా ఉంది అలాగే హీరో స్నేహితుడు భాషా తెలంగాణ భాషనీ,హృదయాన్ని పట్టుకుని వూరి కుర్రాడుగా బాగా చేశాడు సహజంగా. కథలో నాటకీయతా, మలుపులు లేవు అందుకే స్లోగా అనిపించినప్పటికీ చివరి దాకా సినిమా చూసేలాగా ఉంటుంది. తెలంగాణా భాష, నేపథ్యం పాత్రలు ఈ సినిమాకి బలం అయితే ఈ సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ ఉండడం వల్ల కొద్దిగా క్వాలిటీ లోపించినట్టు అనిపించింది కోట్ల రూపాయలు పెట్టలేదు కానీ సినిమా రిచ్ గా లేదు సహజంగా ఉంది. చాలా పెద్ద హీరో హీరోయిన్లు, పెద్ద కమెడియన్లు లేరు. అసభ్యమైన జోక్స్ లేవు భయంకరమైన స్టంట్స్ లేవు భారీ సెట్స్ లేవు హీరోయిన్లతోటి ఐటమ్ సాంగ్స్ లేవు అలాగే బాహుబలి లో లాగా,ట్రిపుల్ ఆర్ లో లాగా విసువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించుకోలేదు అందుకే సినిమా చాలా సహజంగా వచ్చింది అంతా కూడా మన ముందు ఒక ఊరు కూర్చున్నట్టుగా, ఊరు మాట్లాడుతున్నట్టుగా ,ఊర్లోని మనుషులందరూ సహజ పాత్రలుగా మారిపోయినట్టుగా ఊరు మన ముందు కదలబారుతున్నట్టుగా కనిపిస్తుంది, అనిపిస్తుంది ,వినిపిస్తుంది.
విప్లవ్ పాత్ర..
ఒక గ్రామీణ యువకుడిగా రాజు పాత్రలో నటిస్తాడు. చాలా మామూలు తెలంగాణ గ్రామం తీసుకున్నాడు మహబూబ్నగర్ పెద్ద ఆదిరాల గ్రామం అతని సొంత గ్రామం. అందుకే గ్రామీణ నేపథ్యాన్ని అందులో ఉండే మానవ సంబంధాల్ని వ్యవసాయక సంబంధాలను చక్కగా చూపించగలిగాడు నటీనటులందరూ కూడా ఊర్లో ఉండే సామాన్యమైన మనుషుల్లాగనే వాళ్ళ మధ్య జరిగే సంభాషణ కూడా రోజు పొద్దున్న లేస్తే తెలంగాణ గ్రామాల్లో వినిపించే మామూలు సంభాషణే. ఆ మామూలు సంభాషణలతోటే నవ్విస్తాడు ,ఏడిపిస్తాడు ఆలోచింపజేస్తాడు విప్లవ్. రాజుకి,శిరీషకి మధ్య చిన్న చిన్న సంభాషణలోనే రొమాన్స్ ని చూపిస్తాడు. చాలా డీసెంట్ గా లవర్స్ మధ్య దృశ్యాల్ని సృష్టిస్తాడు.ప్రేమికులు కలుసుకున్నప్పుడు కూడా ప్రేమ, పెళ్లి, ముద్దులు ,పాటలు, కాకుండా రాజు కెరీర్ మీద రాజు సర్కారు నౌఖరి సాధించడం మీద మాత్రమే చర్చలు జరుగుతాయి. ఏం చదివాడు ఎంత చదివాడు? పోలీసు ఉద్యోగానికి, ఎస్ఐ ఉద్యోగానికి కావలసిన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతవరకు చేశాడు, ఏ చాప్టర్ చదివాడు, అందులో ఏది గుర్తు పెట్టుకున్నాడు అసలు చదువుతున్నాడా లేదా చదవకపోతే చదివించే శిరీష , మందలింపులు, రాజు అలకలు,చదువుతా అన్నా వాదాలు,ఇదే సంభాషణలు సాగుతూ ఉంటాయి ఇద్దరి మధ్య. అంతేకానీ పెళ్ళికి వొప్పుకొని శిరీష తండ్రిని తిట్టటం ,ఇతరత్రా ఉండవు.
మధ్య మధ్యలో...
చాలా సున్నితంగా రాజు శిరీష ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమని వ్యక్తపరచుకుంటూ ఉంటారు చూపుల ద్వారా మాటల ద్వారా గొప్ప రోమాన్స్ గా చూపించిన అంశం దీంట్లో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటూ ఫ్లైయింగ్ కిస్ గురించి కూడా చాలా మామూలుగా మాట్లాడుకుంటారు .ఈ హుందాతనమే సినిమాని ఉన్నతంగా నడిపించింది. డైరెక్టర్ విప్లవ్ యువతకి సంబంధించిన చాలా చిన్నవిషయాన్ని తీసుకొని ఎక్కడ కూడా దాన్ని దారి తప్పనివ్వకుండా చివరిదాకా అదే ఫ్లో లో తీసుకొని వెళ్ళాదు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా, ఏ పద్ధతుల్లో సాధించాలి, ఎన్ని ప్రయత్నాలు చేసి సాధించాలి, మామ చాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి. ఈ పాయింట్స్ మీద మాత్రమే కథని నడుపుతాడు.
పల్లెటూరి ప్రేమ కథ
అంటే మనం ఏవేవో ఊహించుకుంటూ ఉంటాం. రొటీన్ గా చూపించే కులము మతము డబ్బు హత్యలు, వల్గర్ రొమాన్స్,కిడ్నాప్లు ప్రేమ విఫలం చెందడం ఒంటరిగా మిగిలిపోవడం,విరహ గీతాలు, మళ్లీ కలవడం లాంటి అంశాలే చూపిస్తారు.కానీ ఈ ఫార్ములా కంటే భిన్నంగాఈ సినిమాలో ప్రేమికులు ఒక్క ప్రేమ గురించి మాత్రమే కాకుండా ఆ ప్రేమని సాధించడానికి, పెళ్లి చేసుకున్న తర్వాత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి పునాదిరాయిగా మంచి సర్కారు ఉద్యోగం ఉండాలి అన్న పాయింట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు.ఇద్దరి హృదయాల్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువగా లక్ష్యసాధనవైపు ప్రేమికులు దృష్టి పెడతారు. శిరీష టీచర్ పాత్రను ఆర్ధిక స్వాతంత్య్ర ఉన్న అమ్మాయిగా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా అన్నిటికి మించి తనహక్కుల్ని సాధించుకునే స్వయం నిర్ణయాధికారం ఉన్న యువతిగా ఎంతో హుందాగా తీర్చిదిద్దాడు విప్లవ్. అమ్మాయిలంటే శిరీషలా ఉండాలి అన్న ఒక సంకేతాన్ని ఇచ్చాడు ఆ పాత్ర ద్వారా. ఆమె ఆ ఊరి పంతులమ్మగా ఆమె ఆహార్యాన్ని ఎంతో హుందాగా చక్కటి చీర కట్టులో చూపించాడు.బడికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళే నీళ్ళ సీసా ,చేతికి పర్సు ,గొడుగూ,ఆమె కళ్లద్దాల కళ్ళ గాంభీర్యం వీటన్నిటితో ఆమె నిదానంగా స్కూల్ కి వెళ్లడం రావడం చాలా బాగా చూపించారు.ఆమె పోతున్నప్పుడో వస్తున్నప్పుడో రాజు ఆమె వెనకాలే నడుస్థూ ఆమె చేతికో చామంతి పువ్వునివ్వడం ,ఆమె చిరునవ్వుతో స్వీకరించి తలలో పెట్టుకోవడం ఎంత సున్నితంగా చూపిస్తాడో విప్లవ్.
ఈ అందమైన దృశ్యాల్లోనే...
ఆ ప్రేమికుల ప్రేమని అత్యంత సహజంగా చూపిస్తాడు.అలాంటి దృశ్యమే ఒకటి ఇక్కడ చెప్పుకోవాలి. ఒకసారి అతను చెప్పిన టైంకి శిరీష దగ్గరికి రాడు. పొలంలో పడుకొని పుస్తకం చదవకుండా నిద్రపోతాడు. తర్వాత టైం చూసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడు శిరీష మందలిస్తుంది. కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను భావ కవిత రాశాను అంటాడు. ఆమె మీద రాసిన కవితని ఆమెకి వినిపిస్తాడు కుడా. అప్పుడు శిరీష మురిసిపోకుండా,అనవసరంగా సిగ్గుపడి పోకుండా “భావ కవిత అంటే ఏంటి ఎప్పుడు మొదలైంది”? అని ఒక టీచర్ లాగా ప్రశ్నిస్తుంది. భావ కవిత్వం మొదలైన చరిత్రని ఆమె అడుగుతుంది. రాజు ఏదో చాప్టర్లో ఉంది అని చెప్తాడు కానీ సరిగ్గా జవాబు ఇవ్వలేక పోతాడు నిజానికి అది ప్రేయసి ప్రియులు కలిసి కూర్చొని ఏకాంతంలో మాట్లాడుకునే మాటలు కావు కానీ శిరీష అక్కడ కూడా అతన్ని లక్ష్యం వైపు తిప్పే మాటలే మాట్లాడుతుంది అతడు సరిగ్గా చెప్పలేకపోతే కోప్పడుతుంది. సర్కారు ఉద్యోగం సంపాదించుకోవాలంటే అమ్మాయిల మీద భావ కవిత్వం రాయడం కాదు సీరియస్ గా చదవాలి అని మందలిస్తుంది రాజు మొఖం చిన్నబోతుంటే.
హీరోయిన్ ని ఎక్కడా బలహీన పర్చలేదు...
శిరీష పాత్ర చాలా ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిగా మలిచినప్పటికీ ఆమె పైకి గంభీరంగా ఉన్నా లో లోపల మాత్రం ఆమె రాజు మీద ప్రేమలో మునిగిపోయి ఉంటుంది, లోలోపల అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటుంది. అంతేకాదు శిరీష బలమైన వ్యక్తిత్వాన్నిసినిమా ఆద్యంతం చాలా గొప్పగా చూపిస్తాడు. మా ఇద్దరిలో ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తే సరిపోదా నాన్నా? అంటూ, వ్యవసాయం ఒక వృత్తిగా చేస్తున్నప్పుడు పురుషుడు ఉద్యోగం చెయకపొయినా ఫరవాలేదు అన్న సూచన ఇస్తుంది. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నువ్వు కాదు నేను తీసుకుంటాను అని చాలా కచ్చితంగా తను రాజును పెళ్లి చేసుకోబోయే అంశాన్ని తండ్రికి చెప్పగలుగుతుంది. అలాగే రాజుకి ఉద్యోగం రాకపోయినా తను రాజునే చేసుకుంటాను అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఊరందరి ముందు ఆమె తండ్రికి చెప్పగలుగుతుంది.
అంతేనా...
రాజుకి ఉద్యోగం రాక నిరాశలో క్రుంగి పోయి ఉన్నప్పుడు,పెళ్లి చేసుకుందాం అన్న కబురుని పంపించడం సినిమాలో ఒక అద్భుత దృశ్యం. మలుపు కూడా. రాజు ఉద్యోగం తో ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఒక్క ప్రేమ కారణం చేత, అతన్ని అతని విజయాపజాయాలతో సంబంధం లేకుండా జీవన సహచరుడుగా ఎన్నుకోవడమే కాదు సాధిస్తుంది కుడా. ఇక్కడే ఆమె తాను గెలిచి ,రాజుని కుడా చీదరించిన తండ్రి ముందు,వెక్కిరించిన ఉరి ప్రజల ముందు గెలిపిస్తుంది. వోటమి ప్రేమించడానికి,పెళ్ళికి అడ్డం కాదు అని చెబుతుంది.అతని వోటమి,అతను గెలుపు వైపు వేసే అడుగుగా,ఒక ప్రయత్నంగా సింబాలిక్ గ్గా చెబుతుంది. ఇక్కడ శిరీష మీద ప్రేక్షకులకి అమాంతంగా ప్రేమ ,గౌరవం పెరిగిపోతాయి.
అంతేకాదు...
ప్రతి క్షణం రాజు ఉద్యోగం సాధించే లక్ష్యానికి ఒక గైడ్ గా, టీచర్ గా, ఒక స్నేహితురాలిగా మారిపోయి తోడునీడగా ఉంటుంది వాళ్ల దృష్టిలో నిజానికి అదే నిజమైన ప్రేమ. విప్లవ్ అదే చెప్పదలుచుకున్నాడు. ప్రేమ అంటే పార్కుల్లో పడి పాడుకోవడం కాదు. సిగ్గులు పడుతూ కలిసిపోవడం కాదు ముద్దులు పెట్టుకోవడం కాదు. ప్రేమంటే కలిసి నడవడం. ఒకరి కోసం ఒకరు నిలబడడం ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకోవడం ఇదే ఆ ప్రేమికుల తో రాజు చెప్పించదలుచుకున్నాడు. ప్రేమ కథ అంటే ప్రేమ,పెళ్లి ఒక్కటే సాధించడం కాదు పెళ్లిదాకా వెళ్లే ప్రేమని ఎంత హుందాగా కాపాడుకోవాలో చూపించదలుచుకున్నాడు విప్లవ్ .ప్రేమలో ప్రేయసి ప్రియులు ఎంత హుందాగా కూడా ఉండొచ్చో చూపిస్తాడు చివరికి రాజు తన స్నేహితుడు భాష ,శిరీషల సహాయంతో తన బద్ధకాన్ని, నిరాశను వదిలిపెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాడు. ఆ దారిలో కథ ముందుకు వెళుతూ చివరికి ఉద్యోగ సాధనలో ముగుస్తుంది.
హీరో రాజు చూపింపే గొప్ప ఆదర్శం
విప్లవ్ హీరో రాజు పాత్రని కూడా చాలా ఉన్నతంగా చూపిస్తాడు. ఊర్లో అందరికీ సహాయం చేయడం, ముసలి వాళ్లకి పెన్షన్ అందిందో లేదో చూసుకోవడం, కరెంటు సప్లై జరుగుతుందా లేదా ఊర్లో చూసుకోవడం లాంటి పన్లు చేస్తూ ఊర్లో ఎవరికి ఏమి అవసరం, కష్టం వచ్చినా రాజు ఆదుకుంటూ ఉంటాడు. అతనికి ఊరికి ఎంతో చేయాలని ఉంటుంది. అలాగే తన మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకోవడాన్ని కుడా ఇష్టపడతాడు.సినిమాలో రాజు వ్యక్తిత్వాన్ని పట్టించే మాటలు ఒకటి రెండు దగ్గర చాలా గొప్పగా చూపిస్తాడు. ఉరి పెద్ద మనిషితో ఉద్యోగం పురుష లక్షణం అనే చర్చ దగ్గర “ఉద్యోగం లేకపోతే ఏమైంది మామా ప్రయత్నం చేస్తాను రాకపోతే ఏం చేస్తాను చెప్పు?మూడు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటా”! అనడమే కాదు ఇంకో అద్భుతమైన మాట అంటాడు.” వ్యవసాయం చేసుకుంటూ అంట్లు కడగడం లాంటి ఇంటి పనులు, వంట పని, చేసుకుంటాను శిరీష ఇంటికి వచ్చేలోపల తప్పేంటి?” అని అంటాడు అంటే ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే కాదు,ఉద్యోగం కాకుండా వ్యవసాయం,ఇతర కులవృత్తులు కుడా చేసుకుంటూ గౌరవంగా ఉన్న ఊరిలొనే బతకవచ్చు అని చెప్పదలుచుకున్నాడు.
అంతే కాదు, పితృస్వామ్య వ్యవస్థలో ఇంటి పని ,వంటపని అనే చాకిరీ కుటుంబంలో ఒక్క స్త్రీలు మాత్రమే చేయాలి,ఇంటి భారం,పిల్లల పెంపకం స్త్రీలకి మాత్రమే చెందినది అనే ఫ్యూడల్ సంప్రదాయాన్నిప్రశ్నించ దలుచుకున్నాడు. పెద్ద పెద్ద సైధాంతిక చర్చలు లేకుండా చిన్న చిన్న సంభాషణలతో గొప్ప మాటలు ప్రశ్నలు సమాజం మీద సంధిస్తాడు రాజు. ఇంటి పని వంట పని రెండు కూడా ఆడ పనులు కావు అవి మగ పనులు కూడా అని చెప్పదలుచుకున్నాడు . తర్వాత సినిమాలో కొన్ని కనపడేట్లు కనిపించే లోపాలు ఉన్నాయి. విప్లవ్, రాజు వ్యక్తిత్వం గురించి, బహుసా అది విప్లవ్ వ్యక్తిత్వమే అయి ఉండొచ్చు ఊర్లో గోడల మీద నెల్సన్ మండేలా,ఎస్.ఆర్ శంకర్,మాయా ఎంజిలో,మహాత్మా పులే,ఆల్బర్ట్ ఐన్ స్టీన్ బొమ్మలు చూపిస్తాడు ఒక పాటలో. దీన్నిబట్టి రాజులో లేదా విప్లవ్ లో ప్రగతిశీల భావజాలం ఉందని సూచనప్రాయంగా విప్లవ్ చెప్పదలుచుకున్నాడు. అయితే అతను వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఈ గొప్ప మనుషుల పాత్ర ఏంటో ఎక్కడా కూడా చర్చకి పెట్టలేదు.
సినిమా అంతా కూడా కనీసం ఆ పుస్తకాలు చదువుతున్నట్టుగా చూపించలేదు.ఉదాహరణకి ఒక చేగువేరా పుస్తకమో, నెల్సన్ మండేలా పుస్తకమో చదువుతున్నట్టు చూపించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒక సీన్లో అమరుల స్థూపం ముందు,తన స్నేహితుడు భాషా తో చిన్న సంభాషణ చేస్తున్నట్లు చూపిస్తాడు. ఆ చూపించడంలో అతనికి ఒక ఉద్యేశం ఉండే ఉంటుంది. శిరీష తో చేసిన సంభాషణలో కూడా రివోలుషనరీ పోయెట్రీ అంటే విప్లవ కవిత్వం గురుంచి ప్రస్తావిస్త్హాడు. ఇది దేనికి సంకేతం? దానికి సంబంధించి,సూచన ప్రాయంగానైనా ఊర్లో ఆధిపత్య కులాల ,వర్గాల చేతిలో పీడనని ఎదుర్కొంటున్న పీడితకులాల పక్షాన నిలబడి పోరాడుతున్న లేదా కనీసం ప్రశ్నిస్తున్న ఉన్న దృశ్యాలని చిత్రీకరించాల్సింది. ఇది సినిమాలో ఎమోషన్స్ ని కొంచెం అయినా నిలిపెదేమో అనిపించింది.
కొన్ని మైనస్ పాయింట్లు
ప్రతి ఒక్క విషయము రాజు కి శిరీష స్పూన్ ఫీడింగ్ ఫీడింగ్ చేయడం బాగాలేదు. కొద్దిగా అసహజంగా అనిపించింది. రాజుకి పరీక్షలో మైనస్ మార్కులు ఉంటాయని తెలియదా? టెన్త్ క్లాస్ ఇంటర్ డిగ్రీ బి.ఎడ్ పరీక్షలు రాసిన వాడికి పరీక్ష పూర్తయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలని తెలీదా? ఈ చిన్న చిన్నవి కూడా ఆమె చెప్తే ఒక 28 ఏళ్ల యువకుడు చేస్తున్నాడు అంటే అది అంత బాగా అనిపించలేదు. కనీసం రాజు వయసు తగ్గించాల్సింది. రాజు బి.ఎడ్ చదివి ఐదేళ్ల అవుతుంది. మూఉడు సార్లు రాజు పోటీ పరీక్షలు రాస్తాడు. ఈ ఐదేళ్లలో రాజు కనీసం ఇంట్లో ట్యుషన్స్ చెప్పడం గాని, ఊర్లో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పడం కానీ చేయలేదు ఖాళీగా ఉంటాడు. అంటే చిన్న చిన్న పనులు చేస్తూ వృద్ధులకు రాని పెన్షన్లు వచ్చేలా చేయడం, వ్యవసాయ పనులు ఇవన్నీ చేసుకుంటూ అతను ఖాళీగా ఉంటాడు. ఎక్కడ కూడా ఒక 28 వయసున్న, బీ.ఎడ్ చదివిన యువకుడు సమాజం పట్ల చేయాల్సిన అధ్యయనం,సీరియస్నెస్ కనపడదు.
కనీసం పోటీ పరీక్షలకి కావలసిన పుస్తకాలు కుడా శిరీషనే తెచ్చివ్వాలి. అది ఒక లోపంగా అనిపించింది.రాజుకి ప్రభుత్వ ఉద్యోగ సాధన లక్ష్యం ఉన్నప్పటికీ, ఉద్యోగం రాకపోతే వ్యవసాయం చేసుకొని బతుకుతా అన్న ప్రత్యామ్నాయ ఆలోచన ఉంటుంది. .ఊర్లోనే ఉండి వ్యవసాయం చేస్తూ, వ్యవసాయంతో కూడా బతకచ్చు అన్నది చూపించాలనుకున్నప్పుడు కొత్త కొత్త వ్యవసాయ పద్ధతుల్లో విదేశాల నుంచి కూడా భారతదేశానికి వచ్చి వాళ్ళ భూముల్లో కొత్త వ్యవసాయ పద్ధతుల్లో బోల్డంత పంటను సృష్టిస్తున్న ఎంతోమంది ఆదర్శ రైతులు ఉన్నారు.
తెలంగాణా గ్రామాల్లో,అటవీ ప్రాంతాల్లో కుడామహిళా రైతులు వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాలు చెస్థూవిజయాలు సాధిస్తూ ఉన్నాకొంచెం వ్యవసాయ భూమి ఉంటె చాలు ఉస్తాహవంతులైన ,పట్టబద్రులైన యువకులు వాణిజ్య పంట అయిన డ్రాగన్ ఫ్రూ ట్,చక్కర వ్యాధిని తగ్గించే తిప్ప తీగ అనే హెర్బల్ మందు పంటని సాగు చెస్థూ మంచి లాభాలు సంపాదిస్తున్నారు. కనీసం రాజు అలాంటి ఒక ఎక్స్పరిమెంట్ చేసి విజయం సాధి స్తూ కేవలం సర్కారు ఉద్యోగము వల్ల మాత్రమే కాకుండా ఈ రకంగా వ్యవసాయంలో కూడా సంపాదించవచ్చు ఆత్మగౌరవంతో బతకచ్చు అన్నది చూపించి ఉంటే బావుండేది. నిరుద్యోగ యువతకి ఒక బలమైన సందేశం ఇచ్చిన ట్లు అయ్యేది.
అలాగే సినిమా చివరలో శిరీష తో పెళ్లప్పుడు పూల దండలు లేవంటాడు రాజు,దండలు కొన్నది చూస్తే నలుగురికి,వాళ్ళ నాన్నకి శిరీషా తాను పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిసిపోతుంది ఎట్లారా అంటాడు రాజు ,భాషాతో..” అరె ఊర్లో గాంధీ తాత విగ్రహానికికి దండలు వేసి రెండు వారాలు అయింది . కొందాం ఎవరికీ తెలవదు గాంధీతాతకు అనుకుంటారులే పెళ్ళికి మనం దండలు తీసుకొస్తే” అని భాషా తోటి అనిపిస్తారు కానీ ఎంతో అభ్యుదయ భావాలు ఉన్నట్టుగా చూపించిన రాజు గాంధీ తాత బదులు అంబేద్కర్ ని పెట్టి ఉంటే బాగుండేది. ఎక్కడా నాకు ఊర్లో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనపడలేదు.పూలే బొమ్మ గోడ మీద ఉంది.
అస్సలు బాగాలేని విషయం...
అలాగే ప్రజాస్వామిక కవిత్వం అంటూ ఉంటాడు రాజు. ప్రజల కవిత్వం ఉంటుంది ప్రజా కవిత్వం ఉంటుంది ప్రజా కవి ఉంటాడు. .ప్రజాస్వామిక కవిత్వం అంటూ ఉండదు. అలాగే ఎన్నో అభ్యుదయ భావాలు ఉన్నట్టుగా ఉంటాయి రాజు మాటలు , రెవల్యూషనరీ పోయెట్రీ అని మాట్లాడే రాజు పెళ్లి గుడిలో ఎందుకు చేసుకున్నాడు ?ఆర్య సమాజంలో సంతకాల పెళ్లి చేసుకుని ఉండొచ్చు. పోనీ దానికి ఒక నెల ముందు రేగిస్త్రేషణ్ చేయించుకోవాలి అనుకుందాం.సమయం లేదు అనుకుందాందండలు మార్చుకుని సింపుల్గా చేసుకొని ఉండొచ్చు. ఫోటోలు తీసుకొని ఉండొచ్చు అలాగే కన్యాదానం ఎందుకు చేసుకున్నాడు? కన్యని దానం చేయడం ఏంటి ?ఎంత ఫ్యూడల్ సంప్రదాయమది? దానం చేయడానికి అమ్మాయి ఆవు కాదు కదా? వస్తువు కాదు కదా. మామ తోటి కాళ్ళు అడిగించుకోవడం, నెత్తి మీద రాజు పాదాలు కడిగిన నీళ్ళు మామ చల్లు కోవడము అస్సలు బాగాలేదు.
రాజు{విప్లవ్} చైతన్యం ఏమైన్దిక్కడ?
పెళ్లి ఏ పద్దతుల్లో చేసుకోవాలి అన్న దాని గురుంచి శిరీషా ,రాజుల మధ్య ఒక చైతన్యవంతమైన చర్చ పెట్టాల్సింది. ఇంకోటి బ్లాక్ హోల్ గురించి వాస్తవాలు చెప్పిన ఇంకొక స్టూడెంట్ మీద అంత మంచివాడు అని అనిపించుకున్న రాజు చేతులు కట్టేసి దబాయించడం అనేది అసలు బాగాలేదు. ఇక చాలా విచిత్రంగా,బాధాకరంగా అనిపించింది ఏంటంటే రాజుకి ఊరితో ఉన్న సంబంధం. ఊరి పెద్ద మనుషులతో ఉన్న సంబంధం, స్నేహితులతో ఉన్న సంబంధం కన్నతల్లి తోటి ఎందుకు లేదు ?మొదటి సీనులో కింద జొన్న రొట్టెలు చేస్తున్న తల్లిని చూపిస్తాడు పోతున్నాము అని చెప్తాడు అంతే . ఆ తర్వాత ఒకసారి ఇంటికి వచ్చి స్నానం చేస్తుంటే తల్లి అతని మీద నీళ్లు పోస్తూ ఒంటి మీద మచ్చలు చూసి బాధపడుతున్నట్టు చూపిస్తాడు అంతే. దానికి మించి తల్లిని ఎందుకు చూపించలేదు తల్లి పాత్రని అంత కుదిన్చేసాడు ఎందుకు?
ఊరుని తల్లిలా ప్రేమించిన రాజు తల్లి ని ఎందుకు అంత దూరంగా పెట్టాడు?తల్లితో తోటి ఒక్క ఆత్మీయ సంభాషణ ఎందుకు లేదు ? తన ఉద్యోగం గురించి గానీ, తన వ్యవసాయం గురించి గానీ, తన పెళ్లి గురించి గానీ, తన పొందుతున్న అవమానాల గురించి గానీ, ఊర్లో తన గురించి మాట్లాడుకుంటున్న విషయాల గురించి గానీ ఎందుకు మాట్లాడాడు రాజు?అసలు తల్లి తోటి ఏమాత్రం స్నేహ సంబంధం లో ఎందుకు లేడు రాజు అనేది ఆలోచించాలి .అసలు రాజు కుటుంబం గురుంచి ఎక్కడా ఒక్క దృశ్యం లేకపోవడం పెద్ద వెలితి. ఇది చాలా పెద్ద లోటుగా అనిపించింది .జీర్ణం కాలేదు నాకు. అమ్మతో సంభాషణ ఒకట్రెండు దృశ్యాలు సినిమాకి బలాన్ని,అందాన్ని ఇచ్చేవేమో?తల్లి తోటి సంభాషణలు కొన్ని దృశ్యాలు పెట్టుంటే ఆ సినిమాకి ఒక నిండుదనం ఉండేది ఉంది కదా. ఇవి చిన్న చిన్న లోపాలు. వీటిని పూరించుకొని ఉంటే చాలా బాగుండేది.
హాయిగా, రిలీఫ్ గా అనిపించింది
సినిమాలో ఎక్కడ కూడా విప్లవ్ ఫోన్లు చూపించలేదు . ఫోన్ల వాడకం లేదా ఫోన్ అడిక్షన్ ని చూపించలేదు . మనుషులు మాట్లాడుకోవడాన్ని, చూపించాడు. ఆఖరికి తన ప్రియురాలు శిరీషకి ఫోన్లో మెసేజ్లు కాకుండా ఉత్తరాలు ఉత్తరాలు రాసి పంపిస్తూ ఉంటాడు. శిరీష కూడా ఫోన్ చేయదు మెసేజ్ పెట్టదు ఉత్తరాలే రాస్తుంది రాజుకి. నిజానికి మనుషులు ఒకరికి ఒకరు ఉత్తరాలు రాసుకోని ఎంతకాలమైంది కదా? ఫోన్లువచ్చాక ఫోన్లోనే ఉత్తరాలు , మెసేజ్లు ఫోన్లోనే కోపాలు తాపాలు, కవిత్వము, పాటలు . వ్యక్తీకరణ ఎంత యాంత్రికం అయిపోయింది కదా.మానవ సంసంబందాలు ఎంత యాంత్రికమై పోయాయి కదా?సినిమా చివర్లో విప్లవ తన ఉరు పెదరావిరాల తనకి సజీవమైన మానవ సంబంధాలని నేర్పించింది అని పేర్కొంటాడు. ఊరికి కృతజ్ఞత చెబుతాడు. బహుశా ఈ కారణం వల్ల కావచ్చు ఎక్కడ కూడా ఫోన్లు చూపించడు.ఇది కుడా ఫోన్ల ద్వారా సోషల్ మీడియా మాయలో పడి ఫోన్లకి బానిసలైపోయి ,మానసిక రోగులుగా మారిపోతున్న వర్తమాన రోగిష్టి సామాజానికి మానవసంబంధాల పట్ల ఒక ఎరుకని,చైతన్యాన్ని కలిగించడానికి అనుకోవచ్చా ?ఇది మంచి ప్రయోగం. నాకు చాలా హాయిగా, రిలీఫ్ గా అనిపించింది.
పాటల విషయానికొస్తే...
సంగీతం ఎందుకో నీరసంగా గా అనిపించింది. ఇంటికి వెళ్ళాక కుడా వెంటాడే పాట లేదు. కానీ గోరేటి వెంకన్న పాట “తొక్కుడు బిళ్ళ ముక్కరపుల్ల ,పిల్ల కోతి ఆటకు మల్ల, కలిసి ఆడే గిల్లి దండ, గెలిచినారంటే వెన్నెల నిండా, పని పాటలలో పల్లె కలిసింది రా, ఈ అనుబంధమే పల్లెకు సొంతం కదరా, కాలం మారుతున్న కపటం ఎరుగని పల్లె” ,అంటూ రాసిన పాట అద్భుతంగా ఉంది. పాటతో పాటు చిత్రీకరణ చాలా చాలా బాగుంది. పాటల్లో ఒక మూల రాగి ,ఇత్తడి చెంబులు మిలమిల మెరిసిపోతూ కనిపిస్తాయి.వెదురు బుట్టలో బుచ్చి పిల్ల కోడి కనిపిస్తుంది మోట భావిలోఈతలు, పొలం గట్టుమీద పెద్ద పెద్ద చెట్లు అద్భుతమైన తెలంగాణా పల్లె సౌందర్యాన్ని కన్నుల పండువగా చూపించాడు విప్లవ్.పచ్చని పొలంలో చిక్కని గాడమైన చెట్టు నీడలో,నులక మంచంలో రాజు చదువుకోవడము, చదువుకోకుండా నిద్రపోవడం దూరంగా వినిపిస్తున్న డీజే శబ్దాలు అతని చదువుకొనివ్వకుండా చేయడం ఇవన్నీ కూడా చాలా సహజంగా చూపించాడు.
మామకి అల్లుడు మీద కోపం వస్తే పేపర్ అంచులు కాలిపోతూ చూపించాడు అది కొత్తగా అనిపించింది అలాగే రాజు లోని నిత్య ఘర్షణని మైఁమ్ కళాకారులతోటి ప్లకార్డులు పట్టుకొని చూపిస్తాడు. మీద ఆమ్బిషన్, లవ్, ప్లేసర్ లాంటి ఇంగ్లీషు పదాలు ఉంటాయి. అది రాజులోని ఘర్షణను చూపించే ఒక ప్రక్రియ. కానీ ఎందుకో కొంచెం నిరుద్యోగానికి సంబంధించి ,తన జీవితానికి , ప్రేమకి సంబంధించిన ఎమోషన్స్ని, భావోద్వేగాలని ప్రదర్శించవలసినంత స్థాయిలో ప్రదర్శించినట్టుగా అనిపించలేదు.కానీ చాలా చోట్ల పరిణితి చెందినా నటనని సులువుగా ప్రదర్శించాడు విప్లవ్.
రాజు స్నేహితుడు బాషా తోటి “నేను చదువుకోకపోవడం వల్ల బర్లు కాస్తున్న అయనా గాని నేను బాగా బతుకుతున్నా” అని ఎంతో ఆత్మవిశ్వాసం తోటి చెప్పిస్తాడు విప్లవ్.బాషా ఊరందరికీ తనే పాలు సప్లై చేస్తూ పాల వ్యాపారంలో బాగా సెటిలైపోతాడు. అలాగే రాజు కూడా వ్యవసాయం చేసే సెటిలైపోవాలని బాషా కోరుకుంటాడు.శిరీషని పెళ్లి చేస్కోవాలంటే మామ పెట్టిన షరతు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం. రాజు సర్కారు ఉద్యోగానికి వ్యవసాయం చేయడానికి మధ్యలో నలుగుతూ ఉంటాడు కానీ ఎక్కడ కూడా ఊర్లో వ్యవసాయం చేసి బతకచ్చు, వృద్ధిలోకి రావచ్చు అన్న విషయాన్ని స్పష్టంగా రాజు తోటి విప్లవ్ చెప్పించడం చూడము. మూడు ఎకరాల భూమి ఉంటుంది రాజుకి లేకపోయినా కౌలుకు కూడా తీసుకోవచ్చు శిరీషకి కుడా భూమి పది ఎకరాలు ఉంటుంది. బతుకుతాను వ్యవసాయంలో మంచి భవిష్యత్తు ఉంది అని ఎక్కడా కూడా రాజుతో విప్లవ్ చెప్పించడు. “ నా సంగతి మీకు తెలియదు నేను పాస్ కాలేను నాలో ఆసక్తి లేదు” అని అంటాడు కానీ నేను వ్యవసాయంలో ఆసక్తి ఉంది వ్యవసాయం చేస్తాను వ్యవసాయంలో నేను విజయం సాధిస్తాను. లాభాలు సాధిస్తాను అని ఎక్కడా కూడా విప్లవ్ రాజు తోటి చెప్పించడు అతని లక్ష్యమంతా కూడా ఉద్యోగ సాధన అన్న ఎలిమేంట్ చుట్టూ తిప్పుతాడు.
అలాగే ఈ సినిమాలో స్నేహం ఎలా ఉండాలి అన్నది కూడా చాలా గొప్పగా చూపించాడు రాజుకు అడుగడుగునా చిన్ననాటి స్నేహితుడు భాషాతో పాటు ఇతర స్నేహితులు కూడా బాగా సపోర్ట్ ఇస్తారు అతడు లక్ష్యాన్ని సాధించే దిశగా. శిరీష తండ్రి రాజు ని అవమానించినప్పుడు తోటి ఈ స్నేహితులందరూ కూడా కొట్లాడుతారు . అయితే ఈ స్నేహితులు మధ్యాహ్నపు బద్దకపు సమయాల్లో పత్తాలాట ఆడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా సంపాదిస్తారో ఆశ్చర్యమే. అలాగే ప్రేమించిన వ్యక్తి ద్వారా ప్రేమ ఎలా ఉండాలి ప్రేమికుడిని లక్ష్యం వైపు ఎలా నడిపించాలి అనేది శిరీష ద్వారా స్వచ్ఛమైన ప్రేమకు అర్థం చెప్పిస్తాడు అయితే కథని మరింత ఆసక్తికరంగా నడిపించడానికి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని, పాత్రల్ని పెట్టలేదేమో అనిపిస్తుంది కథ ఉద్దేశాన్ని బలంగా చెప్పించే పాత్రలు సినిమాలో లేవు. అందువల్ల కొంచెం బలహీన పడింది
కథ స్క్రీన్ ప్లే నేపథ్యము బాగుంది అలాగే ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
తక్కువ బడ్జెట్ తో సాహసం
అయినా గాని తక్కువ బడ్జెట్ లో చాలా సాహసోపేతంగా అన్ని తానే అయ్యి,ఈ సినిమాని తన భుజాల మీద మోస్తూ తీశాడు విప్లవ్. ఈ సినిమాకి విప్లవ్ కోట్ల రుపాయలు ఖర్చు పెట్టలేదు. యాభై లక్షలోపే ఇంత చక్కటి సామాజిక ప్రయోజనం ఉన్న సినిమా తీసాడు. విప్లవ్ కి డబ్బు బాగా ఉండి ఉంటె ఈ సినిమా ఇంకా అందంగా వచ్చేది. ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా అందరూ హాయిగా చూడొచ్చు ఫ్యామిలీతో కూర్చుని చూడొచ్చు పిల్లలతో కూర్చొని చూడొచ్చు స్టూడెంట్ తో కూర్చుని చూడొచ్చు టీచర్లతో కూర్చుని చూడొచ్చు టీచర్లు విడిగా కూర్చొని చూడొచ్చు స్టూడెంట్స్ కలిసి చూడొచ్చు స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకుపోయి లక్ష సాధన ఎలా ఉండాలి ఎలా సాధించాలి అన్న విషయాన్ని బోధించడానికి పిల్లలని కూడా తీసుకెళ్లి చూపించొచ్చు.
వల్గర్ జోక్స్ లేకుండా...
ప్రేమని హుందాగా ఎలా చిత్రీకరించాలో చూడ్డానికి అయినా ఈ సినిమా చూడొచ్చు. ప్రేమని లేదా ప్రేమలో పడ్డవాళ్ళు ఇలా కూడా చేయొచ్చా అని తెలుసుకోవడానికి కూడా ఈ సినిమా చూడొచ్చు ప్రేమలో ఏమేం సాధించొచ్చో కూడా తెలుసుకోవడానికి చూడొచ్చు మొత్తానికి ఒక భిన్నమైన కథ అంశాన్ని ఎన్నుకొని సమాజానికి కావలసిన వస్తువును ఎన్నుకొని కష్టపడి బాధ్యత తోటి తీసిన విప్లవ్ అనే యువకుడి విజయ గాథ ఈ “ఈ సారైనా”! సినిమా. ఈ సినిమాని చూసి అతన్ని ప్రోత్సహిద్దాం. విప్లవ్ మరిన్ని మంచి సామాజిక ప్రయోజనాలు ఉన్న సినిమాలు తీసుకురావాలని కోరుకుందాం.
చేయాల్సిందింకా ఉంది...
చివరగా విప్లవ్ ఈ సినిమాలో మరి కొన్ని విషయాలపై దృష్టి పెట్టాల్సింది అనిపించింది.ప్రధాన వస్తువు పూర్తిగా భిన్నమైనది గ్రామానికి అంతగా సంబంధించింది కాదు కాబట్టి సూచన ప్రాయంగా చెప్పి వదిలేస్తాను. జడ్చర్ల మండలం,పెద ఆదిరాల గ్రామం,మేహబుబ్నగర్ జిల్లా అనే ఈ మూడు పేర్లను బహుశా గ్రామంలో ఎదో ప్రభుత్వ కార్యాలయానికి పైన పెద్ద అక్షరాలతో అలాగే చూపించాడు విప్లవ్.బహుశా తను పుట్టి పెరిగిన తన స్వంత గ్రామాన్ని అలా అపురూపంగా చూపించాలన్న కోరికతో అలా చుపింఛి ఉండచ్చు. కానీ విప్లవ్ మేహబుబ్నగర్ జిల్లా నువ్వు చూపించినంత సస్యశ్యామలంగా లేదు.
తెలంగాణ రాకముందు,ఆధిపత్య ఆంధ్రా రాయలసీమ వలసపాలకుల చేతిలో పాలమూరు నీళ్ళు,భూములు ,ప్రభుత్వ కొలువులు దారుణమైన దోపిడీకి గురి అయ్యాయి. తెలంగాణ వచ్చాక ఇప్పుడు పరిస్థితి కొంచెం మారిందని చెబుతారు. కరువు కాటేసిన పాలమూరు ప్రజలు ఏడాదికి దాదాపు ఐదు లక్షల మంది బొంబాయి, భివండి, కర్నాటక,కేరళ్, తమిళనాడు, కాశ్మీరు,దుబాయ్, కువైట్ లాంటి దూర ప్రాంతాలకిప్రత్యేకమైన వలస బస్సుల్లో ఇల్లు, పిల్లలు ,భార్యాబిడ్డల్ని,ముసలి తల్లితండ్రుల్ని,,ఆ కాసింత భూముల్ని అప్పిచ్చిన బ్యాంకు వాడి నుంచో,లేదా ఊరి వడ్డీ వ్యాపరస్తుల కబ్జాల నించో దక్కించుకోవడానికి వలస వెళ్ళిపోతారు.అక్కడ, దుర్మాగమైన అనారోగ్యపు చావులు చస్తారు.ఇక్కడి,ఇంకా వలస వెళ్ళిన ప్రాంతాల్లో ఆడవాల్లమీద కుటుంబ భారం పడి, విపరీతమైన శ్రమదోపిడీకి ,గుంపు మేస్త్రీలతో లైంగిక అత్యాచారాలకి గురవుతారు.
అలాగే Special Economic Zones {SEZ}ప్రత్యేక ఆర్ధిక మండలాలని, అభివృద్ది పేరుతో వందల మంది దళితుల భూములను జడ్చర్ల లో పోలేపల్లి అనే గ్రామంలో,మరికొన్ని గ్రామాల్లో ఫార్మా కంపెనీల కోసం ప్రభుత్వం బలవంతంగా గుంజుకుని కనీస కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు.ఆ రైతుల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరికొంతమంది,భూమి కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేక డిప్రెషన్ లో గుండెపోటుతో అకాల మరణం చెందారు.అన్నీ కోల్పోయిన వృద్ధ రైతులు సిటీల్లో క్రాస్ రోడ్స్ దగ్గర బిక్ష గాల్లు అయ్యారు. యువకులు తమ దోచుకున్న భూముల్లోన్నే కట్టిన మల్టినేశనల్ కంపెనీల ఫార్మ కంపెనీల్లో తక్కువ జీతంతో సెక్యూరిటీ గార్డులు అయ్యారు.
ఎంతో మంది ఆడపిల్లల కుదిరిన పెళ్ళిళ్ళు ఆగిపోయాయి. ఇదంతా నీ పాలమూరు ప్రాంతంలోనే జరిగిన అన్యాయం విప్లవ్. నువ్వు పాలమూరు బిడ్డవి కదా అందుకే నీకు చెబుతున్నాను. నువ్వు ఇంకో సినిమా కుడా నీ గ్రామం నేపథ్యం లో తీస్తే మటుకు దశాబ్దాలనాటి ఈ సామాజిక అన్యాయాన్ని ఎక్కడో ఒక్క దృశ్యం లో నైనా చుపిస్తావని ఆశ అంతే. ఎందుకంటే మాలాంటి రచయతలు కథలు,కవిత్వం,వ్యాసాలు రాసాము. కానీ అది ఎంత మందికి చేరుతుంది? ఎంత మంది చదువుతారు? సినిమా అంటే చాలా పెద్ద మాధ్యమం. లక్షల మందికి చేరుతుంది. మరో గొప్ప సినిమాతో మళ్ళీ వస్తావని ఆశిస్తున్నాను.