క్రైమ్ థ్రిల్లర్ : ‘విరాటపాలెం’ వెబ్ సిరీస్ రివ్యూ
ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది రివ్యూ చూద్దాం.;
ఇన్నాళ్లూ వెబ్ సిరీస్‌లకు రిలీజ్ ముందు పబ్లిసిటీ అంటే టీజర్, ట్రైలర్, పోస్టర్లు… కానీ ‘విరాటపాలెం’కి మాత్రం ఫ్రీగా లాయర్స్ అందించారు! కారణం ఇది ఒక కాపీ కేస్‌తో కలసి వచ్చిన థ్రిల్లర్! ఒకవైపు జీ5 ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే పనిలో ఉంటే … మరోవైపు ఈటీవీ విన్, “మా కానిస్టేబుల్ కనకనంను కాపీ కొట్టారు” అంటూ కోర్టుకెళ్లిపోయింది. దాంతో జనాలు అసలు కాపీ కొట్టేటంత ‘కథ ఏముంది’ అనే క్యూరియాసిటీతో ఈ సీరిస్ కోసం వెయిట్ చేసారు. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది? ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది రివ్యూ చూద్దాం.
స్టోరీ లైన్
పెళ్లంటే శుభం కాదు… శాపం అంటోంది విరాటపాలెం అనే ఆ ఊరు! ఆ ఊళ్లో పెళ్లి అంటే పసుపు కుంకుమ కాదు ...పీటల మీద రక్తం కారుతోంది. పెళ్లికూతుళ్లు రక్తం కక్కుకుని చనిపోతున్నారు. దాంతో వేదమంత్రాలతో మెదలైన పెళ్లి కాస్తా … విలాపాలతో ముగుస్తోంది. ఇదంతా చూసిన ఆ ఊరి జనాలు ఒక్కటే ఫిక్స్ అయ్యారు– “ఇది అమ్మవారి శాపం!” . దాంతో ఆ ఊళ్లో ఎవరూ పెళ్లి చేసుకోరు.కొందరు ఆస్దులు అమ్ముకుని ప్రక్క ఊరుకి వదిలిపోతారు. ఇంకొందరు అదే భయంతో జీవిస్తూంటారు.
ఆ సమయంలోనే ఓ కొత్త పోలీస్ కానిస్టేబుల్‌గా మీనా (అభిజ్ఞ వూతలూరు) అడుగు పెడుతుంది. ఆమెది కాస్త లాజిక్ లు వెతికే బుర్ర. దాంతో
"శాపం కాదు – కుట్ర" అని తేల్చే ప్రయత్నంలో పడుతుంది. నిజాన్ని తెలుసుకోవాలన్న తపనతో, మూఢనమ్మకాలను కళ్లజూడాలన్న ధైర్యంతో,
ఆ గ్రామ పెద్ద కొడుకుతో వివాహానికి సిద్ధమయ్యి మీనా...తానే ప్రమాదంలో పడుతుంది.
ఆ ప్రమాదం నుంచి మీనా ఎలా బయిటపడింది. చివరకు ఏమైంది. ఇంతకీ ఆ ఊరుకు ఉన్నది నిజంగా శాపమేనా, ఇంట్రస్టింగ్ గా మొదలైన ఈ సీరిస్ థ్రిల్లింగ్ గా దూసుకెళ్లిందా.. ఈ వెబ్ సిరీస్ చూడదగినదేనా! తెలియాలంటే ఈ సీరిస్ చూడాల్సిందే.
విశ్లేషణ
మూడేళ్ల క్రితం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమా వచ్చింది. అది బాగా వర్కవుట్ అయ్యింది. అందులో కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లపై అత్యాచారాలు, వరుస హత్యలు తో కలకలం రేపుతాయి. ఆ తర్వాత పోలీస్ ఇన్విస్టిగేషన్ తో నడుస్తుంది. ఈ సీరిస్ చూస్తుంటే అదే గుర్తు వస్తుంది. ఆ సినిమా ఓటిటిలో డైరక్ట్ గా రిలీజై వర్కవుట్ అయ్యింది కాబట్టి అలాంటిదే మరొకిటి కావాలని రాయించి, చేయించారా అనిపిస్తుంది. అయితే మ్యాజిక్ ఒకసారే జరుగుతుంది. ప్రతీసారి జరిగితే అది మ్యాజిక్కే కాదు.
నిజానికి ‘విరాటపాలెం’ ఊరిలో శాపం ఉం దాలేదా అనేది ప్రక్కన పెడితే ..ఈ కథకు మాత్రం రైటింగ్ శాపంగా నిలిచింది. "ఒక ఊరిలో పెళ్లికూతుళ్లు పెళ్లి జరిగిన వెంటనే చనిపోతున్నారు" అనే దాకానే క్యూరియస్ కాన్సెప్ట్. మిగతాదంతా రొటీన్ ఇన్విస్టిగేషన్ డ్రామానే. ఈ సిరీస్ మిస్టరీ థ్రిల్లర్ బేసిక్స్నే మిస్ అయింది. స్ట్రాంగ్ సెటప్ లేదు, ఎమోషనల్ హుక్ లేదు. అలాగే ఇది "ఫోక్ హారర్"గా కూడా కాదు, "క్రైమ్ థ్రిల్లర్"గా కూడా సెటిల్ కాలేదు.
కథలో ప్రధాన పాత్ర అయిన మీనా ( పోలీస్) మూడో ఎపిసోడ్ వచ్చేసరికి పెళ్లికి రెడీ చేస్తారు. దాంతో ఆ పాత్రకు కావాల్సిన ఎమోషనల్ ట్రయల్స్, రీసర్చ్ ఇన్స్టింక్ట్ లేకుండా పోయాయి. దానికి తోడు సినిమాలో 20 నిమిషాల్లో చెప్పే విషయాన్ని ఇక్కడ మూడు ఎపిసోడ్లలో లాగారు. అలాగే The protagonist must actively investigate, not passively participate.” అనేది ఈ సీరిస్ లో కనపడదు.
ఇది చాలదన్నట్లు థ్రిల్లర్ కి కావాల్సిన గట్టి క్లూలు, ఫేక్ ట్రెయిల్స్, ఎమోషనల్ బౌన్సులు, క్లైమాక్స్‌కు బిల్డ్ అప్ – ఇవి ఏమీ ఉండవు. Every thriller must have a ticking clock అనే విషయం మర్చిపోయినట్లున్నారు. విరాటపాలెం స్క్రిప్టులో చావులు జరుగుతాయన్న భయం ఉన్నా... వాటికి టైమ్ బౌండరీ లేదు, ఎమోషనల్ బౌండరీ లేదు.
ఫైనల్ గా థ్రిల్లర్ లో క్లైమాక్స్ twist అనేది... ఓ షాక్ కావాలి. అదే కథకు ప్రాణం. అది రానప్పుడు, అప్పటివరకూ చేసిన ట్రావెల్ చేసిన అన్నీ వృథా. అదే ఈ సీరిస్ కు జరిగింది. కథలో మిస్టరీ ఉంది కానీ, స్క్రీన్‌ప్లేలో లేదు. పాత్రలు ఉన్నాయి కానీ, ప్రాసెస్ లేదు. ప్లాట్ ఉంది కానీ, టెన్షన్ లేదు.సస్పెన్స్ రివీల్ అయ్యే టైంలో ఆశ్చర్యానికి బదులు.. ఇదే కదా? మేం కూడా ఊహించింది అనే టైపులో ఉంటుంది.
టెక్నికల్ విషయాలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఫైనల్ థాట్
ఈ సీరిస్ ... టీవీ సీరియల్ కు ఎక్కువ, వెబ్ సీరిస్ కు తక్కువ అనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ సీరిస్ లు తీయాలంటే ఓ మిస్టరీ పాయింట్ ని మాత్రమే కాదు, ఓ మూడ్‌ని, ఓ సైక్లాజికల్ గేమ్ ని, గమ్యాన్ని కూడా పట్టుకోవాలి. ప్రతి ఎపిసోడ్లో వచ్చే సస్పెన్స్ కంటే, మొత్తం కథలో నడిచే ఉద్వేగమే అసలైన హుక్ . దాన్ని మర్చిపోతే ఎవరు పూర్తిగా చూడలేరు అనేదే బేసిక్ లాక్.
చూడచ్చా
జస్ట్ ఓకే అనిపించే ఈ సీరిస్ ని పనిగట్టుకుని మరీ చూడమని చెప్పలేం కానీ, ఖాళీ సమయాన్ని కిల్ చేయటానికి ట్రై చేయచ్చు.
ఎక్కడుంది.
జీ5 లో తెలుగులో ఉంది.