తెలంగాణ సర్కారుకు సినీ నటి సమంత రిక్వెస్టేమిటి?

కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోన్న హేమ కమిటీని అభినందించిన సినీ నటి సమంత తెలంగాణ ప్రభుత్వానికి చేసిన రిక్వెస్ట్ ఏమిటి? అసలు హేమ కమిటి దేనికి సంబంధించినది?

Update: 2024-08-31 11:24 GMT

హేమ కమిటీ నివేదిక కేరళలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమపై గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల ఆధారంగా ప్రస్తుతం కొందరు సినీ ప్రముఖులపై, ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

హేమ కమిటీ నివేదికను ప్రశంసించిన ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు.. కేరళ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా కమిటీ వేస్తే టాలీవుడ్‌కు ఎంతో మేలు జరుగుతుందని సమంత అభిప్రాయపడ్డారు. తెలుగు నటీనటులు మంచు లక్ష్మి ప్రసన్న, సుమ కనకాల, ప్రగతి మహావాది, చిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్ నందిని రెడ్డి కూడా ఇదే సూచనను ఇంతకుముందు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

"తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలమైన మేం.. హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం. కేరళలోని డబ్ల్యుసీసీ (విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం" అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన చిత్రం 'కుషి'. 'బంగారం' అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు ఈ ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా సమంత ప్రకటించింది.'సిటాడెల్: హనీ బన్నీ'లోనూ నటిస్తుంది. ఈ సిరీస్‌ నవంబర్‌లో విడుదల కానుంది.

2017లో హేమ కమిటీ ఏర్పాటు..

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపుల ఉదంతాలను బహిర్గతం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2017లో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది.2019లో తన నివేదికను సమర్పించింది. అయితే నివేదికను విడుదల చేయడంలో న్యాయపర సవాళ్లు ఎదురవుతున్నందున ఇప్పటి వరకు ఆ నివేదికను బహిరంగపరచలేదు. ఇటీవల హేమా కమిటీ 235 పేజీల తన నివేదికను ప్రచురించింది. మలయాళ చిత్ర పరిశ్రమను 10-15 మంది పురుష నిర్మాతలు, దర్శకులు, నటుల నియంత్రణలో ఉందని పేర్కొంది.

పలువురిపై కేసులు..

మలయాళ చిత్ర పరిశ్రమలోని నటులు, దర్శకులు, సిబ్బంది లైంగిక వేధింపులను నివేదికలో వివరంగా పొందుపర్చారు. నటుడు-రాజకీయ నాయకుడు ముఖేష్, సిద్ధిక్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవేల బాబు, దర్శకుడు రంజిత్‌లపై పలువురు మహిళా నటులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దాంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News