ఎన్నికల వేళ ...ఈ సినిమా టైటిల్ మార్చి మరీ ఓటిటి రిలీజ్ యాధృచ్చికమేనా?

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘నాయట్టు’ సినిమా ఎట్టకేలకు తెలుగులో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమా ఇప్పుడెందుకు రిలీజ్ అయిందని తెగ చర్చలు జరుగుతున్నాయి.

Update: 2024-04-28 11:26 GMT

2021లో ‘నాయట్టు’ (Nayattu)రిలీజైనప్పుడు ఓ పెద్ద సెన్సేషన్. వ్య‌వ‌స్థ‌లో లోపాల‌ను క‌ళ్ల‌ ముందు కదిలాడేలా చూపిస్తూ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ సాగే ఈ సినిమా.. చూసిన‌ ప్రేక్ష‌కుల‌ను చాన్నాళ్లు వెంటాడింది. దాని గురించి సోషల్ మీడియాలో తెగ మాట్లాడారు. దాంతో ఈ సినిమా చాలా కాలం పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే నెట్ ప్లిక్స్ వాళ్లు, తెలుగు ఆడియోలో రిలీజ్ చేయలేదు. అందుకు కారణం అప్పటికే తెలుగు డబ్బింగ్, రీమేక్ రైట్స్ గీతా ఆర్ట్స్‌కు ఇచ్చేయడమే. దాంతో టెక్నికల్‌గా తెలుగు వెర్షన్ ఆపేశారు. తెలుగులో చూద్దామనుకున్న వాళ్లు నిరాశపడ్డారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ‘నాయట్టు’ రీమేక్ వార్తలు మొదలయ్యాయి. హమ్మయ్య.. ఏదో రకంగా చూడచ్చు అనుకున్నారు.

రావు ర‌మేష్‌ను జోజు జార్జ్ పాత్ర‌కు అనుకుని .. క‌రుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి గీతా ఆర్ట్స్ సంస్థ స‌న్నాహాలు చేశారన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకొద్ది రోజుల్లో షూటింగ్ కూడా మొద‌ల‌వుతుంద‌ని అన్నారు. బ్రాకెట్ అనే టైటిల్ పెట్టారు. కానీ ఇంత‌లో ఏమైందో ఏమో.. ఆ సినిమా ఆగిపోయింది. నాయ‌ట్టు లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డం స‌రైన ఆలోచ‌న కాద‌ని చాలా మంది అన్నారు. దాంతో అందుకోసమే, ఆ సినిమా ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాద‌ని ఆపేశారేమో అనుకున్నారు. కానీ కొంచెం గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఆ సినిమా రీమేక్ తెర‌పైకి వ‌చ్చింది.

ఆ తర్వాత 'కోటబొమ్మాళి పీఎస్' #KotabommaliPSReview అనే టైటిల్ తో ఈ చిత్రం రీమేక్‌ని బన్నీ వాసు (BunnyVasu), విద్యా కొప్పినీడి నిర్మించారు. తేజ మార్ని (TejaMarni) దర్శకుడు. ఈ సినిమా కాస్టింగ్ విష‌యంలో కీల‌క మార్పులు జ‌రిగింది. జోజు జార్జ్ పాత్ర‌కు రావు ర‌మేష్‌ను కాకుండా సీనియ‌ర్ న‌టుడు శ్రీకాంత్‌ను ఎంచుకున్నారు. నిమిషా పాత్ర‌కు శివాత్మిక రాజ‌శేఖ‌ర్, కుంచుకో బోబ‌న్ క్యారెక్ట‌ర్‌కు రాహుల్ విజ‌య్‌ల‌ను తీసుకున్నారు. సినిమాలో కీల‌క‌మైన లేడీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ను వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌తో చేయించారు. తేజ మార్ని (TejaMarni) దర్శకుడు. ఈ సినిమాలో 'లింగిడి లింగిడి' పాట చాలా వైరల్ అయింది. అయితే అనుకున్న స్దాయిలో ఈ సినిమా వెళ్లలేదు.

మలయాళంలో 'నాయట్టు' సినిమా ఎంతో నాచురల్‌గా ఉండి, ప్రతి పాత్ర ఎమోషనల్‌గా హృదయానికి హత్తుకుంటుంది. ముఖ్యంగా జోజు జార్జి పాత్రకి అయితే చాలా సింపతీ వస్తుంది. తెలుగుకు వచ్చేసరికి 'కోటబొమ్మాళి పీఎస్' లో అవేమీ కనబడవు. రాజ్యాంగం, విధేయత, సిస్టమ్ వీటి మీద డైలాగులు, సీన్స్ ఉన్నా కానీ అవి సరిగా ప్రేక్షకులకు చేరలేకపోయాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని ఉద్దేశించి సెటైరికల్‌గా కొన్ని డైలాగులు పెట్టారు. అవీ వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా మలయాళం 'నాయట్టు' చూసిన వాళ్ళకి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు, కానీ చూడని వాళ్ళు ఒకసారి ఈ సినిమాని చూసి పర్వాలేదన్నారు.

అలా డీలాగా రీమేక్ ఘట్టం ముగిసింది. దాంతో ఇప్పుడు డబ్బింగ్‌కు వచ్చారు. టైటిల్ మార్పుతో శ్రీకారం చుట్టారు. ఈ మధ్యన పాపులర్ మలయాళం, తమిళం, ఇంగ్లీష్ సినిమాలు డబ్ చేసినప్పుడు అవే పేర్లు ఉంచేస్తున్నారు. ఎందుకంటే ఆ టైటిల్స్‌కి ఆల్రెడీ పబ్లిసిటీ వచ్చేసి ఉంటుంది. అది ఈ డబ్బింగ్‌కు ప్రమోషన్‌కు ఉపయోగపడుతుందనే ఆలోచన. కానీ రీమేక్ టైటిల్ ‘కోటబొమ్మాళి పీఎస్‌’ని అనుకరిస్తూ.. ‘చుండూరు పోలీస్‌స్టేషన్‌’ (Chunduru Police Station)అని టైటిల్ పెట్టి నాయట్టు డబ్బింగ్‌ని వదిలారు. దాంతో చాలా మందికి ఇది నాయట్టు డబ్బింగ్ అని అర్దం కాని పరిస్థితి ఏర్పడింది.

'నాయట్టు' అంటే ‘వేట’ అని అర్థం. సమాజంలో నేరస్థులను వేటాడే పోలీసులను సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వేటాడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం కథేమిటంటే.. కేరళలో ఎలక్షన్స్ టైమ్‌లో ప్రవీణ్‌ మైఖేల్‌ (బోబన్‌) పోలీసు స్టేషన్‌లో జాబ్‌లో చేరతాడు. ఏఎస్‌ఐ మణియన్‌ (జోజు జార్జ్‌), కానిస్టేబుల్‌ సునీత అక్కడే పనిచేస్తుంటారు. బైఎలక్షన్స్ దగ్గర పడటంతో ఆ ప్రాంతమంతా అదే హడావిడిగా ఉంటుంది. అక్కడ లోకల్ లీడర్ కమ్ రౌడీ బిజూ.. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, తన హవా కొనసాగిస్తూ ఉంటాడు. బిజూ వెనక అతని సామాజిక వర్గం ఉండటంతో, ఓట్ల కోసం రాజకీయ నాయకులు అతని ఆగడాలను వెనకేసుకు వస్తుంటారు. ఆ లీడర్‌తో ప్రవీణ్, మణియన్‌లు వాగ్వాదానికి దిగుతారు. బిజూ నిర్లక్ష్య ధోరణి పట్ల మణి-ప్రవీణ్ మండిపడతారు. అతనిని సెల్లో వేస్తారు.

అయితే అతని వెనక ముఖ్యమంత్రి ఉండటం వలన, బిజూ వెంటనే బయటికి వస్తాడు. ఓ రోజు ఫంక్షన్‌కి ముగ్గురు వెళ్లొస్తుంటారు. ఆ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యాక్సిడెంట్‌ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతాడు. అతడు ఎవరో కాదు.. పోలీసు స్టేషన్‌లో గొడవకు దిగిన వ్యక్తికి దగ్గరి చుట్టం. దాంతో యాజ్ యూజవల్‌గానే ఆ వ్యక్తి సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆందోళనకు దిగడంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది.

దాంతో ఏ సంబంధమూ లేని వీరి ముగ్గురిని ఇరికించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుసుకున్న మణియన్‌ మిగతా ఇద్దరితో కలిసి పోలీసు స్టేషన్‌ నుంచి పరారవుతాడు. దీంతో వేట మొదలవుతుంది. సొంత డిపార్ట్‌మెంట్‌ వారే వీరిని వెంటాడుతూ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఓట్ల కోసం అధికారంలో ఉన్నవారు ముగ్గురు పోలీసులను బాధ్యులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ పోలీసులను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దింపుతారు. మరి వీరు ముగ్గురు ఆ కేసులోంచి బయటపడ్డారా? పోలీసులకు చిక్కారా లేదా? వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నది మిగతా కథ.

సినిమా చివర వచ్చే ఓ సీన్‌లో ఓ అంధ వృద్ధురాలిని ఎన్నికల కేంద్రానికి తీసుకొచ్చి తనకు నచ్చిన పార్టీకి ఓటేయించుకోవటం చూపెడతారు. మనమంతా రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలమే అని దర్శకుడు సింబాలిక్‌గా అలా చెప్పాడన్నమాట. ఏపీలో ఎలక్షన్స్ వేళ ఈ సినిమా రిలీజ్ యాధృచ్చికమేనా? అదీ అల్లు అరవింద్‌కు చెందిన ఆహాలో ...?

చూడచ్చా

మీరు నాయట్టు చూడకపోతే తెలుగులో చూసినట్లు ఉంటుంది. చూడచ్చు

ఎక్కడ చూడచ్చు

ఆహాలో తెలుగు వెర్షన్ ఉంది

Tags:    

Similar News