నిశ్శబ్ద వివక్ష విస్ఫోటనం : 'పరియేరుం పెరుమాళ్' అనుభవం

నన్ను వెంటాడిన సినిమాలు-6(ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్);

By :  RamC
Update: 2025-04-04 05:25 GMT
నిశ్శబ్ద వివక్ష విస్ఫోటనం : పరియేరుం పెరుమాళ్ అనుభవం
పరియేరుం పెరుమాళ్ల చిత్రం నుంచి ఒక దృశ్యం

ఈ దశాబ్దంలో నేను చదివిన సునీత గిడ్ల "Ants Among Elephants" పుస్తకం, మారి సెల్వరాజ్ "పరియేరుం పెరుమాళ్" సినిమా చాలా ప్రత్యేకం; నన్ను ఆవహించిన కథాంశాలు. సమాజంలో కొన్ని విషయాలు, సంగతులు వింటుంటాం, చదివివుంటాం, కానీ చాలా వరకు ఎలా ఉంటాయో తెలియకుండా పెరిగిన నాకు ఈ సినిమా మరియు పుస్తకం దొరికిన కళ్ళజోడు లా అనిపించాయి.

ఈ సినిమా ఒక దళిత యువకుడు న్యాయవాదిగా ఎదగాలనే ఆకాంక్షతో ఎదురైన పోరాటాలను ఆవిష్కరిస్తుంది. గ్రామీణ తమిళనాడులో నడిచే ఈ కథలో, కుల వివక్ష ఎలాంటి వ్యక్తిగత, భావోద్వేగ సంఘర్షణలకు దారితీస్తుందో మనం చూస్తాం. కళాశాలలో తన స్థానం కోసం పోరాడుతూ, సమాజంలో ఓ అగ్ర కుల అమ్మాయితో ఏర్పడే స్నేహం ద్వారా అతడు ఎదుర్కొనే కుల వ్యవస్థ సంఘటనలు చాలా పదును గల నిశ్శబ్దంతో తెరక్కెక్కించబడ్డాయి. ఇది గౌరవం, నిరసన, నిశ్శబ్ద తిరుగుబాటు గురించి జరిగే ఒక గాఢమైన చిత్రీకరణ.

పరియేరుం పెరుమాళ్ అట్టడుగు స్థాయిలో నిశ్శబ్దంగా ముసురుకునే కుల హింసను చూపిస్తుంది. కానీ, ఆ హింస అదృశ్య వస్తువుగానే ఉండటం దీని ప్రత్యేకత. అతని జీవితాన హింస ఎన్ని రూపాలుగానో సర్వవ్యాప్తమై ఉంటూ, మనకు ముందు తీవ్రమైన అసహనం, క్రమేణా అసహ్యం రేకెత్తిస్తుంది. మారి సెల్వరాజ్ ప్రతిభ ఆయన చూపించే సంయమనంలోనే ఉంది. అతను ఎక్కడ మెలోడ్రామాకు పోకుండా, చూపులతోను, మౌనాలతోను, చిన్నచిన్న విముఖతల ద్వారా సంపూర్ణ దౌర్జన్యాన్ని తెలియజేస్తాడు. ప్రతీకారం పూర్తిగా పక్కన పెట్టేస్తాడు.

బడుగు కులాల యువతను హత్యలు చేసే వృద్ధుని పాత్ర , ఒక క్రూరుడు మాత్రమే కాదు, కులాన్ని నింపుకున్న యంత్రంలా పని చేసే ఓ కిరాయి వ్యవస్థకు చిరునామా. పెరియన్ కుక్క 'కరుప్పి' మరణం కేవలం ఓ కుక్క చనిపోవడం కాదు, దళితులలో అమాయకులైనవారిని ఎలా అణగదొక్కుతారో తెలిపే గాఢమైన చిహ్నం. ఆ పాట 'ఏ కరుప్పి' విచారం నిండిన కవిత్వమవుతుంది, నిరసనగా మారుతుంది. ఇది సెల్వరాజ్‌ను దర్శకుడిని మాత్రమే కాకుండా, దార్శనికుడిని చేస్తుంది.

ఓ పెళ్లి సన్నివేశంలో పరియన్‌పై హింస జరగడం, మూత్ర విసర్జన చేయడం కేవలం దాడి కాదు, అది ఓ తరాన్ని మానసికంగా నాశనం చేయాలనే సంకేతం. మనం కేవలం చూస్తూ ఉండం, ఆ మానవ నిర్మిత నరకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కంపు కొడుతుంది. నిర్లక్ష్యమైన క్రూరత ఒక వ్యవస్థలో ఎంత సహజంగా మారిందో స్పష్టంగా చూపిస్తుంది.

కానీ, ఆ చివరి టీ గ్లాసులు సన్నివేశం గురించి ఏమి చెప్పగలం? నిజంగా, ఇది కేవలం భారతీయ సినిమాకే కాదు, ప్రపంచ సినిమా చరిత్రలో కూడా ఇంత మౌనంగా, ఇంత శబ్దంగా మిగిలే సన్నివేశం తక్కువగా ఉంటుంది. రెండు టీ గ్లాసులు మౌనంలో నింపే క్షమాపణ కాదు. మార్పు కాదు , ఇది గుర్తింపు. మాటలేకుండా, శతాబ్దాల బాధ, నిరసన, మార్పుపై ఆశ, ఇవన్నీ ఆ టీ గ్లాసుల్లో నిండి ఉన్నాయి.

ఇది నాకు ఒక పచ్చని జ్ఞాపకం.అదే గొప్ప సినిమా చేసే పని . అది కేవలం ప్రపంచాన్ని చూపించదు, దాన్ని తిరిగి ఊహించడానికి ప్రేరేపిస్తుంది. 'పరియేరుం పెరుమాళ్' అది అత్యంత స్పష్టతతో చేస్తుంది, మీ వెన్నులో చలి పుట్టిస్తుంది. ఈ దేశంలో కొందరికి కులం ఓ అసలైన అంతస్తుగా మారిందో, అదే కొందరికి ఎంత బరువు గా మిగిలిపోతోందో చూపిస్తుంది. పుట్టిన కులమే జీవిత ప్రమాణంగా మారడం ఎంత విపరీతమో కదా!

ఈ సినిమా తో ఓ నిస్సహాయతను, మౌన రోదనను అనుభవించాను. ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, నిరక్షరాస్యత, పేదరికం,మోసం కుట్రలు ఇతరత్రా సమస్యలు చాల పెద్దవని భావించి జీవించే క్రమంలో, అసలు పుట్టుకతో ఆపాదించబడ్డ కులం మూలాన వచ్చే వ్యధలను జీవితాంతం భరించడం, మనిషి మనిషిపై చేసే దురాగతం. దుర్మార్గం.

Tags:    

Similar News