నేపాల్‌లో తప్పించుకున్న 15వేల మంది ఖైదీలు..
ప్రధానిగా కుల్మాన్ ఘిసింగ్? పలు జిల్లాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ..;
నేపాల్(Nepal)లో గురువారం (సెప్టెంబర్ 11) హింసాత్మక ఘటనలు తగ్గాయి. సాధారణ పరిస్థితులు కనిపించాయి. ఖాట్మండు లోయలోని మూడు జిల్లాల్లో సైన్యం కర్ఫ్యూను పొడిగించింది. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రజలను బయట తిరిగేందుకు అనుమతిస్తున్నారు. హింసాత్మక నిరసనలలో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగిందని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో 1,061 మంది గాయపడ్డారని తెలిపింది. వీరిలో 719 మంది డిశ్చార్జ్ అయ్యారని, 274 మంది ఆసుపత్రిల్లో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.
ఓలి స్థానంలో ఎవరు?
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని కేసీ శర్మ ఓలి(KP Sharma Oli) మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్త పీఎం ఎంపికపై చర్చలు జరుగుతున్న తరుణంలో.. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనరల్ జెడ్ గ్రూపులు..కుల్మాన్ ఘిసింగ్ పేరును ప్రతిపాదించాయి. ఈయన నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (ఎన్‌ఇఎ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, ఖాట్మండు మేయర్ బాలేంద్ర షా ఘిసింగ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
కాల్పులో ముగ్గురు ఖైదీలు మృతి..
నిరసనకారులు జైళ్ల పరిపాలనా భవనాలకు నిప్పుపెట్టి, జైలు గేట్లను ధ్వంసం చేయడంతో వేల సంఖ్యలో ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పారిపోతున్న సమయంలో సిబ్బంది వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీలు మరణించారు. గాయపడిన వారిని రామెచాప్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సుమారు 25 జైళ్ల నుంచి దాదాపు15వేల మంది ఖైదీలు తప్పించుకున్నట్లు జైలర్ రాజేంద్ర శర్మ చెప్పారు. కొంతమంది ఖైదీలు స్వచ్ఛందంగా తిరిగి వచ్చారని తెలిపారు. గండకి ప్రావిన్స్‌లోని కాస్కి జిల్లా జైలులో 773 మంది తప్పించుకున్నారు. వీరిలో 13 మంది భారతీయులు, మరో నలుగురు విదేశీయులు ఉన్నారని ఆయన చెప్పారు.
‘ప్రజలు శాంతికి మద్దతివ్వాలి’
ఇటు నేపాల్‌కు వెళ్లిన పర్యాటకులు సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లిన కొంతమంది పర్యాటకులు ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ప్రధాని మోదీ నేపాల్‌లో పరిస్థితిపై బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడి ప్రజలు శాంతికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అసలు నిరసనలు ఎందుకు?
నిబంధనలు పాటించని సామాజిక మాధ్యమాల ప్రసారాలపై నేపాల్ ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో యువత పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. నిరసనలకు దిగారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి నిన్న (సెప్టెంబర్ 9న) రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు మంత్రులు కూడా రిజైన్ చేశారు.