పుతిన్ రాక: అమెరికాకు ఇచ్చిన సందేశం ఏమిటీ?
ఢిల్లీ పలికిన స్వాగతం, ఇచ్చిన ఆతిథ్యం- అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది.
By : The Federal
Update: 2025-12-06 10:53 GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ రెండు రోజుల పర్యటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఘనంగా ముగిసింది. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న పుతిన్ - శుక్రవారం ఉదయం రాష్టప్రతి భవన్‌లో సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎక్కడైతే స్వాగతం దక్కించుకున్నారో అక్కడే పుతిన్ తన పర్యటనను ముగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వరుస సమావేశాల అనంతరం మళ్లీ అదే ప్రదేశంలో విందుతో తన అధికారిక కార్యక్రమాలను ముగించారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు పుతిన్‌ను రాజకీయంగా ఒంటరి చేయాలనుకున్న దశలో భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పలికిన స్వాగతం, ఇచ్చిన ఆతిథ్యం- అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది.
పుతిన్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం, వ్యాపార వేత్తలతో కార్యక్రమం, రష్యా ప్రభుత్వ ఛానల్ ‘రష్యా టుడే’ భారత్ లో ప్రసారాలు ప్రారంభించనున్నట్టు ప్రకటించడం వంటి అంశాలు చోటుచేసుకున్నాయి. కార్యక్రమాల పరంగా రోజు రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కీలక రంగాలలో చెప్పుకోదగిన ఒప్పందాలు జరిగిన సమాచారం బయటకు రాలేదు.
రష్యా–భారత్ సంబంధాలను “ప్రత్యేక, ప్రాధాన్యమైన వ్యూహాత్మక భాగస్వామ్యం”గా రెండు దేశాలు మరోసారి పునరుద్ఘాటించినప్పటికీ, రక్షణ రంగంలో ఊహించిన కొత్త ఒప్పందాలు ప్రకటించలేదు. Su-57 ఫైటర్ జెట్‌లు, ఆధునిక రక్షణ వ్యవస్థలు వంటి అంశాలపై ఈ పర్యటనలో ఒప్పందాలు కుదరవచ్చునని వచ్చిన ఊహాగానాలు కార్యరూపం దాల్చలేదు. అమెరికా–రష్యా సంబంధాల మధ్య భారత్ పాటిస్తున్న సమతుల్యతకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు.
చమురు సరఫరాల విషయంలోనూ ఇదే జాగ్రత్త కనిపించింది. భారత్ గత రెండేళ్లుగా డిస్కౌంట్ ధరలకు రష్యా నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా ఈ కొనుగోళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇటీవల భారత వస్తువులపై సుంకాలు పెంచుతూ ఒత్తిడి పెంచుతోంది.
ఈ పరిస్థితుల్లో పుతిన్ మాట్లాడుతూ, “ఇండియాకి నిరంతర చమురు సరఫరాలకు రష్యా సిద్ధంగా ఉంది” అని చెప్పడం ఇండియాకి ఇచ్చిన ప్రత్యేక సంకేతంగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
అయినప్పటికీ భారత్ ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించింది. ఏ వైపు మొగ్గుచూపకుండా మౌనంగా వ్యవహరించింది. తుది నిర్ణయం ఇప్పుడు పూర్తిగా భారత్ చేతుల్లోనే ఉన్నట్లు అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో, పుతిన్ పర్యటన అమెరికాకు ఒక మౌన సంకేతమని కూడా చెప్పవచ్చు. ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాల ఒత్తిడులు పెరుగుతున్న తరుణంలో పుతిన్ ఇండియా వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఆహ్వానించారు. ద్వైపాక్షిక చర్యలకు అసాధారణ ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో “భారత్ అమెరికా మిత్రదేశమే అయినా, అది అమెరికా నిబంధనలు అనుసరించే దేశం కాదు” అనే దౌత్య సందేశాన్ని కూడా పంపిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
పుతిన్ పర్యటనలో ఈసారి ఎక్కువగా వినిపించిన మాట వాణిజ్యం. పాశ్చాత్య ఆంక్షలతో రష్యా, అమెరికా సుంకాలతో భారత్- రెండు దేశాలు కొత్త మార్కెట్ల కోసం ఎదురు చూస్తున్న సందర్భమిది.
ప్రస్తుతం $68 బిలియన్‌కు చేరిన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి రష్యా, ఇండియా రెండు దేశాలు ఆసక్తి చూపాయి. షిప్‌బిల్డింగ్, నావికుల శిక్షణ, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ, ముఖ్య ఖనిజాలు, వీసా–ఫ్రీ ట్రావెల్ వంటి పలు రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. యూరేషియన్ ఎకనామిక్ యూనియన్‌తో భారతం జరుపుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై చర్చల్లో పురోగతి సాధించాయని మోదీ పేర్కొన్నారు.
రోజంతా ప్రజలకు కనిపించిన కార్యక్రమాల కంటే, పుతిన్–మోదీ మధ్య జరిగిన “అధికారిక డిన్నర్”లోనే సున్నితమైన అంశాలు చర్చకు వచ్చినట్లు రష్యా అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఒత్తిడి, ఇంధన భద్రత, రక్షణ సరఫరాలు వంటివన్నీ అక్కడే చర్చించినట్టు సమాచారం.
మొత్తం మీద, పుతిన్ పర్యటన భారత్, రష్యా సంబంధాల పటిష్టత, బలం ప్రపంచానికి మరోసారి తెలియజేశాయి. ఈ పర్యటన ప్రాధాన్యతను అమెరికా గమనించేలా చేశాయి.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌కు పాశ్చాత్య దేశాలు డిప్లొమాటిక్‌గా దూరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఇచ్చిన ఘన స్వాగతం పాశ్చాత్య దేశాలకు స్పష్టమైన సంకేతం పంపిందని విశ్లేషకులు చెబుతున్నారు.
కానీ అసలు ప్రశ్న ఏమిటంటే- ఈ పర్యటనతో భారత్, రష్యా రెండింటికీ ఏమి దక్కింది?
పుతిన్ కి ఘన స్వాగతం దక్కింది. రష్యా మీడియాలో భారీ కవరేజీ వచ్చింది. రష్యా మీడియాలో పుతిన్‌కు ఇచ్చిన స్వాగతంపై విపరీతమైన కవర్‌జ్ వచ్చింది. “340 గదులున్న భారత రాజభవనంలో పుతిన్‌ను ఎలా స్వాగతించారు!” అని పుతిన్ అనుకూల పత్రికలు రాశాయి. అంటే పాశ్చాత్య దేశాలు పుతిన్‌ను “ఐసోలేట్” చేయాలనుకున్నా భారత్ ఇచ్చిన స్వాగతం వేరే సందేశాన్ని ఇచ్చింది. కానీ ఒప్పందాల విషయానికి వస్తే… పెద్ద పెద్ద ఒప్పందాలు మాత్రం లేవు. అయితే భారత–రష్యా ఆర్థిక సహకార ప్రోగ్రాం, ప్రధాన ఖనిజాలు, సరఫరాపై సహకార ఒప్పందం, రష్యాలోని కలుగా ప్రాంతంలో భారత–రష్యా ఫార్మా ప్లాంట్ ఏర్పాటు వంటి వాటిపై ఒప్పందాలు కుదిరాయి.