నా భార్య సగం భారతీయురాలు: మస్క్
భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరును నా కొడుకు కు పెట్టానన్న ప్రపంచ కుబేరుడు
By : The Federal
Update: 2025-12-01 08:47 GMT
తన భాగస్వామి శివోన్ జిలిస్ ‘‘సగం భారతీయురాలు’’ అని టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పారు. తన కొడుకు ఒకరి పేరుని ‘శేఖర్’ అని పెట్టినట్లు కూడా వెల్లడించారు. నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ మీదున్నా అభిమానంతో ‘శేఖర్’ అని పెట్టినట్లు తెలిపారు.
‘‘శివోన్ తో నా కొడుకులలో ఒకరి పేరు శేఖర్, అతని పేరు చంద్రశేఖర్ పేరు మీద పెట్టాము’’ అని పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్ షోలో జెరోధా వ్యవస్థాపకుడు, పెట్టుబడిదారు నిఖిల్ కామత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు.
ఎస్. చంద్రశేఖర్ ప్రఖ్యాత భారతీయ- అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన భౌతిక శాస్త్రంలో చేసిన సేవలకు గాను 1983 లో నోబెల్ బహుమతి లభించింది. ‘‘నక్షత్రాల నిర్మాణం, పరిణామానికి సంబంధించిన భౌతిక ప్రక్రియలపై’’ ఆయన పరిశోధలు చేశారు.
జిలిస్ చిన్నప్పుడు ఎప్పుడైన భారత్ లో గడిపారా అనే విషయం గురించి మస్క్ ను అడగగా, ఆ విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అయితే తన చిన్నతనంలో మాత్రంలో కెనడాలో పెరిగినట్లు వెల్లడించారు. తనను మరో కుటుంబానికి దత్తత ఇచ్చినట్లు తెలిపారు.
‘‘ఆమె తండ్రి ఓ విశ్వవిద్యాలయంలో పనిచేసేవాడు. ఆయన శివోన్ ను దత్తత తీసుకున్నాడు. నాకు కూడా కచ్చితమైన వివరాలు తెలియదు. కానీ దత్తత తీసుకున్నట్లు మాత్రం తెలుసు’’ అని మస్క్ తెలిపారు.
ఎవరూ శివోన్?
జిలిస్ మస్క్ కు చెందిన ఏఐ కంపెనీ న్యూరాలింక్ ఆపరేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా ఉన్నారు. 2017 లో కంపెనీలో చేరిన ఆమె, యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్, ఫిలాసఫీలో ఉత్తీర్ణత పొందారు.
అలాగే యూనివర్శిటీ తరఫున నిర్వహించే ఐస్ హకీ జట్టులో గోల్ కీపర్ కూడా. జిలిన్ కెనడాలో ఒంటరిగా పెరిగారు. ఇంతకుముందు ఐబీఎంలో బ్లూమ్ బర్గ్ లో పనిచేశారు. తరువాత 2016 లో ఓపెన్ ఏఐలో చేరి, కృత్రిమ మేధ అంశాలపై తన అభిరుచిని పెంచుకున్నారు.
ఒక సందర్భంలో శివోన్ మాట్లాడుతూ.. న్యూరాలింక్ నా జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన కానీ మనోహరమైన విషయంగా అభివర్ణించారు. జిలిస్- మస్క్ జంటకు మొత్తం నలుగురు పిల్లలు. ఇందులో ఇద్దరు కవలలు. వారు స్ట్రైడర్- అజూర్(2021) లో జన్మించారు. కుమార్తె అర్కాడియా, మరో కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ ఉన్నారు.
భారతీయులు ప్రతిభావంతులు..
కామత్ లో జరిగిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై మస్క్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమెరికాలో భారతీయులు నిపుణులు అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ‘‘భారత్ నుంచి ప్రతిభకు అమెరికా లబ్ధిదారుగా ఉంది. కానీ ఇది ఇప్పుడు క్రమంగా ఈ పరిస్థితి మారుతోంది’’ అని మస్క్ అన్నారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత వీసా విధానాలను సవరించడం కారణంగా భారతీయులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.