అతన్ని ‘మానవీయంగా’ చంపేశాం! నైట్రోజన్తో మరణశిక్షపై అమెరికా వాదన!!

చంపడమే ఓ నేరమే. అందులో మంచి, చెడు ఏమిటీ? మరణశిక్షను అమలు చేయడంపై అమెరికా పరిశోధన చేసి కొత్త పద్ధతి కనిపెట్టింది. ఎలా మరణశిక్ష వేసిందంటే..

Update: 2024-01-27 05:44 GMT
అమెరికాలోని అలబామా స్టేట్ కోర్టు ముందు ఉరిశిక్ష రద్దు చేయాలని ప్రదర్శన

మెరికా, అలబామా (అట్మోర్‌).. గురువారం రాత్రి 8.20 గంటలు దాటింది. అత్యాధునిక బెడ్ పైన ఓ వ్యక్తిని పడుకోబెట్టారు. కాళ్లూ చేతులూ కదిలించకుండా గట్టిగా పట్టిలతో బిగించారు. మూతికి మాస్క్ పెట్టారు. ఆ మాస్క్ నుంచి ఆక్సిజన్ కాకుండా నైట్రోజన్ ఊపిరితిత్తుల్లోకి పంపారు. ఆ తర్వాత ఓ నిమిషానికి ఆ వ్యక్తి గిలగిల్లాడారు. కాళ్లూ చేతులూ గింజుకున్నాడు. మూతికి మాస్క్ ఉన్నందున మాట్లాడలేడు. అలా రెండు మూడు నిమిషాలు విలవిల్లాడి తలవేలాడేశాడు. ఈ మొత్తం దృశ్యానికి ఓ ఐదుగురు సాక్షులున్నారు. కానీ వాళ్లెవ్వరూ నోరు విప్పలేరు, మహా అయితే గుడ్లనీరు కళ్లలోనే కుక్కుకోవడం తప్ప.


అమెరికాలోనే కాదు బహుశా ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఓ ఖైదీకి నైట్రోజన్ (నత్రజని) ఇచ్చి మరణశిక్షను అమలు చేసిన దృశ్యమది.

మరణించిన ఖైదీ పేరు కెన్నెత్‌ యూజీన్‌ స్మిత్‌, వయసు 58

చేసిన నేరం కిరాయి హత్య

తీసుకున్న సుపారీ వేయి డాలర్లు

హత్య చేసి ఇప్పటికి 30 ఏళ్లు దాటింది

నేరం రుజువై 20 ఏళ్లయినా చట్టాన్ని ఉపయోగించుకుని గత పాతికేళ్లుగా బతికిబట్టకట్టారు. ఇప్పుడు అలబామా కోర్టు తీర్పుతో మరణశిక్ష అనుభవించారు.

ఇప్పుడీ నైట్రోజన్ వాడి మనిషిని చంపడం ప్రపంచ వ్యాప్తంగా చర్చ అయింది. మరణశిక్షపై చర్చలో అమెరికా పేరు మరోసారి ముందుకు వచ్చింది. USతో సహా అనేక దేశాల్లో మరణశిక్షకు వ్యతిరేకంగా వాదించిన మానవ హక్కుల న్యాయవాది క్లైవ్ స్టాఫోర్డ్ స్మిత్ వాదన ప్రకారం "ఉరిశిక్షలు సాధారణంగా అర్ధరాత్రి మాత్రమే జరుగుతాయి. కానీ అమెరికా రాత్రి 8 గంటలకే పని కానిచ్చింది. ఈ పనికి మేము ప్రాథమికంగా సిగ్గుపడుతున్నాం" అన్నారు. ఈ స్టాఫోర్డ్ స్మిత్ అమెరికాలో తన ఆరుగురు క్లయింట్ల మరణ శిక్షలను చూశారు. " అవి చూసొచ్చిన ప్రతిసారీ నక్షత్రాల వైపు చూస్తూ ఈ ఉరిశిక్ష నిజంగా ప్రపంచాన్ని అత్యంత నాగరిక ప్రదేశంగా మారుస్తుందని మనం చెప్పగలమా?" అనుకుంటారట.

అది అనాయాస మరణం కాదు..

నైట్రోజన్‌ గ్యాస్‌ ను ప్రయోగించి మరణ శిక్షకు గురైన కెన్నెత్‌ యూజీన్‌ స్మిత్‌ తీవ్రస్థాయిలోనే మరణ యాతన అనుభవించాడని అతని కుటుంబీకులు చెప్పారు. నైట్రోజన్‌ ప్రయోగంతో స్మిత్ ఉక్కిరిబిక్కిరి అయ్యారని సంబంధీకులు ఆరోపిస్తే అధికారులు ఖండించారు. ప్రపంచంలోనే ఇంతకు మించిన సుఖ మరణం లేదన్నారు. నైట్రోజన్ ను వాడడానికి ముందు అంటే 1982లో విషాన్ని ఇంజెక్షన్‌ గా ఇచ్చి మరణశిక్ష విధించేవాళ్లు. నైట్రోజన్ వాడకాన్ని ఐరోపా సంఘం (ఈయూ), ఐరాస మానవహక్కుల కార్యాలయం తప్పుబట్టాయి. అయితే మానవీయ పద్ధతిలోనే శిక్షను అమలు చేశామని అమెరికా అధికారులు స్పష్టంచేశారు.

మరణశిక్షను ఎలా అమలు చేశారంటే...

అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో అట్మోర్‌లోని హోల్మన్‌ కరెక్షనల్‌ ఫెసిలిటీలోని మరణశిక్ష గదిలోకి స్మిత్‌ను అధికారులు తీసుకొచ్చారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడటానికి హతురాలి కుటుంబ సభ్యులతో పాటు స్మిత్‌ సంబంధీకులు, అతని మతగురువు, లాయర్‌ వచ్చారు. ఐదుగురు మీడియా ప్రతినిధులనూ పిలిచారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..

స్మిత్‌ను తొలుత ప్రత్యేక బెడ్‌పై పడుకోబెట్టారు. కాళ్లు, చేతులు కట్టేశారు.


రాత్రి 7:53 గంటలకు మరణశిక్ష ప్రక్రియ మొదలైంది. అంతకుముందు స్మిత్‌ మాట్లాడుతూ ‘‘మానవత్వం వెనకడుగు వేసేలా నేడు అలబామా వ్యవహరించింది. ప్రేమ, శాంతి, కాంతితో నేను నిష్క్రమిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ఐ లవ్‌ యూ ఆల్‌’’ అని వ్యాఖ్యానించాడు.

ఆ తర్వాత స్మిత్‌కు అధికారులు మాస్కును బిగించారు. దాని నుంచి నైట్రోజన్‌ గ్యాస్‌ను పంపించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులను చూస్తూ చిరునవ్వు చిందించాడు. తలాడిస్తూ చేతులతో ‘ఐ లవ్‌ యూ’ చిహ్నాన్ని ప్రదర్శించాడు.

క్రమంగా స్మిత్‌కు ఆక్సిజన్‌ అందని పరిస్థితి తలెత్తింది. నైట్రోజన్‌ ఇవ్వడం మొదలుపెట్టాక కొద్దిసేపు అతడు స్పృహలోనే ఉన్నట్లు కనిపించింది. మూర్ఛ వచ్చినట్లు రెండు నిమిషాల పాటు కాళ్లు, చేతులు ఆడించాడు. తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డాడు. క్రమంగా శరీరంలో కదలికలు తగ్గిపోయాయి.

నైట్రోజన్‌ గ్యాస్‌ను దాదాపు 15 నిమిషాల పాటు మాస్క్‌లోకి పంప్‌ చేశారు. స్మిత్‌ చనిపోయినట్లు 22 నిమిషాల తర్వాత ప్రకటించారు.

మరి వివాదం ఏమిటంటే...

నైట్రోజన్‌ గ్యాస్‌ ప్రయోగం ద్వారా అమెరికాలో మరణశిక్షకు గురైన కెన్నెత్‌ యూజీన్‌ స్మిత్‌ తీవ్రస్థాయిలో మరణయాతన అనుభవించాడని అతడి సంబంధీకులు ఆరోపించారు. ‘‘మరణశిక్ష అమలు ప్రక్రియ మొదలయ్యాక కొద్ది సెకన్లలోనే స్మిత్‌ స్పృహ కోల్పోతాడని, ఆ తర్వాత నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని అటార్నీ జనరల్‌.. కోర్టుకు విన్నవించారు. వాస్తవ పరిస్థితి అలా లేదు. అతడు చాలాసేపు మరణయాతనకు గురికావడం చూశా. ఊపిరి అందక అవస్థపడటాన్ని చూసి నాకు కన్నీరు ఆగలేదు’’ అని స్మిత్‌ ఆధ్యాత్మిక సలహాదారు రెవరెండ్‌ జెఫ్‌ హుడ్‌ వ్యాఖ్యానించారు.

ఈ వాదనతో అంగీకరించని అధికారులు

మరణ శయ్యపై స్మిత్‌ తీవ్రస్థాయిలో కాళ్లు, చేతులు ఆడించడం అసంకల్పిత చర్యలేనని అలబామా కరెక్షన్స్‌ కమిషనర్‌ జాన్‌ క్యూ హామ్‌ అన్నారు. ‘‘ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల శ్వాసకు ఇబ్బంది పడ్డాడు. ఇదంతా తాము ఊహించినవే. మరణశిక్షకు ముందు స్మిత్‌.. శ్వాసను బిగబట్టి ఉండొచ్చన్న అనుమానం కూడా ఉంది’’ అన్నారు ఆ అధికారి.

చివరివరకూ న్యాయపోరాటం...

శిక్ష అమలు కావడానికి ముందు వరకూ స్మిత్‌ లాయర్లు న్యాయపోరాటం జరిపారు. ఒక ప్రయోగాత్మక మరణశిక్ష విధానానికి సాధనంగా తమ కక్షిదారును ప్రభుత్వం ఎంచుకుందన్నారు. క్రూరమైన, అసాధారణ శిక్షలపై రాజ్యాంగం విధించిన నిషేధాన్ని ఇది ఉల్లంఘించినట్లవుతుందని వారు వాదించారు. ఈ శిక్షను ఆపాలని కోరారు. నైట్రోజన్‌ హైపాక్సియా అనే ఈ విధానంపై పెద్దగా పరిశోధన జరగలేదని, దీనిపై న్యాయపరంగా మరింత పరిశీలన జరగాలని వైద్య సంఘాలు కూడా కోరాయి. స్మిత్‌ విజ్ఞప్తిని గురువారం రాత్రి అమెరికా సుప్రీంకోర్టు మెజార్టీ తీర్పు తోసిపుచ్చింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం ఈ విధానాన్ని వ్యతిరేకించారు.

వాంతి వస్తే ఏం చేస్తారు?

నైట్రోజన్‌ గ్యాస్‌ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు స్మిత్‌కు వాంతి వస్తుందని, అది గొంతుకు అడ్డుపడి ఇబ్బంది తలెత్తుతుందని అతడి తరఫు న్యాయవాదులు అనడంతో అధికారులు కొన్ని మార్పులు చేశారు. శిక్ష అమలుకు 8 గంటల ముందు అతడికి ఎలాంటి ఆహారం ఇవ్వలేదు. నైట్రోజన్‌ గ్యాస్‌ ప్రయోగం సమర్థ, మానవీయ విధానమేనని ఇప్పుడు రుజువైందని అటార్నీ జనరల్‌ స్టీవ్‌ మార్షల్‌ వ్యాఖ్యానించారు.

20 ఏళ్ల కిందటే చనిపోయి ఉండాల్సింది...


స్మిత్‌కు మరణశిక్ష విధించడం సబబేనని అలబామా గవర్నర్‌ కే ఐవీ పేర్కొన్నారు. ‘‘వ్యవస్థలో లోపాలను వాడుకుని దాదాపు 30 ఏళ్లపాటు తప్పించుకొన్నాడు. చివరికి తన దారుణ నేరాలకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు’’ అని వ్యాఖ్యానించారు. స్మిత్‌కు 2002లో కూడా ఒకసారి మరణశిక్ష అమలు చేయడానికి అధికారులు ప్రయత్నించారు. అప్పట్లో అతడికి ప్రాణాంతక ఇంజెక్షన్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే సకాలంలో అతడి చేతిలో రక్తనాళం వారికి దొరకలేదు. ఈలోగా ‘డెత్‌ వారెంట్‌’లో నిర్దేశించిన సమయం ముగిసిపోయింది. దీంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నైట్రోజన్‌ హైపాక్సియా అనే కొత్త విధానాన్ని అతడిపై ప్రయోగించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. విషతుల్య ఇంజెక్షన్‌కు బదులు దీన్ని అలబామాతోపాటు మిసిసిప్పీ, ఓక్లహామా రాష్ట్రాలు ఎంచుకున్నాయి. ఈ ఇంజెక్షన్లలో వాడే రసాయనాల లభ్యత తగ్గిపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చాయి. తొలిసారిగా స్మిత్‌పై దీన్ని ప్రయోగించారు.

అసలేమిటీ కేసు..

అలబామాలోని కొల్బెర్ట్‌ కౌంటీలో చార్లెస్‌ సెనెట్‌ అనే పాస్టర్‌ భారీగా అప్పులు చేశాడు. భార్య ఎలిజబెత్‌ చనిపోతే ఆమె పేరిట ఉన్న బీమా సొమ్మును దక్కించుకోవచ్చని భావించాడు. ఆమెను చంపేందుకు గ్రే విలియమ్స్‌ అనే వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చాడు. 1,000 డాలర్ల చొప్పున సుపారీ ఇచ్చి.. కెన్నెత్‌ స్మిత్‌, జాన్‌ ఫ్రాస్ట్‌ పార్కర్‌ను పురమాయించాడు. వారు 1988 మార్చిలో ఎలిజబెత్‌ను హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు చార్లెస్‌ను అనుమానించి విచారించారు. విచారణ అనంతరం నేరుగా చర్చికి వెళ్లి అక్కడే తన కుటుంబాన్ని కలుసుకొన్నాడు. నేరం చేసినట్లు వారికి చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎలిజబెత్‌ మరణించిన ఎనిమిది రోజులకు ఈ ఘటన చోటు చేసుకొంది. దంపతుల మృతదేహాలను ఒకే చోట సమాధి చేశారు.

కాంట్రాక్ట్ కిల్లర్ కి జీవిత ఖైదు...

గ్రే విలియమ్స్‌కు జీవితఖైదు విధించగా.. జైల్లోనే మరణించాడు. కిరాయి హంతకుల్లో ఒకడైన జాన్‌ ప్రాస్ట్‌కు 2010లో మరణశిక్షను అమలు చేశారు. మరో నిందితుడు స్మిత్‌ మాత్రం ఎలిజబెత్‌ హత్య సమయంలో అక్కడే ఉన్నానని.. తాను దాడిలో పాల్గొనలేదని వాదిస్తూ న్యాయ పోరాటం చేశాడు. కానీ, చివరకు దోషిగా తేలాడు. స్మిత్ చరిత్రలో నైట్రోజన్ వాయువుతో ఉరితీయబడిన మొదటి ఖైదీ అయ్యాడు.

మిగతా 165 మందికి ఇదే పద్ధతేనా?

అలబామా స్టేట్ కరెక్షన్ హోంలో ఇంకా 165 మంది మరణశిక్ష విధించిన ఖైదీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఇదే పద్ధతిన నైట్రోజన్ హైపోక్సియా అని పిలిచే ఈ పద్ధతిన చంపుతారా? అనే చర్చ బయలుదేరింది. హక్కుల సంఘాలు, కొంతమంది వైద్యులు, కేసుకు సంబంధించిన జ్యూరీ మరణశిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్‌లో స్మిత్ ఉరిశిక్ష అమలు కొనసాగింది. ఎమోరీ యూనివర్శిటీలో అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుడు జోయెల్ జివోట్ ప్రకారం, "నత్రజని హైపోక్సియా" అనేది ఓ పద్ధతిగా కనిపించవచ్చుగాని అసలు వైద్య చర్య కాదు.

విమర్శలు ఏమిటంటే...

సరైన సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా “ప్రయోగం” చేయడం అనైతికమని మానవ హక్కుల లాయర్లు వాపోతున్నారు. ప్రయోగాలు చేస్తున్నపుడు సంబంధిత వ్యక్తుల సమ్మతి ఉండాలంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నురేమ్‌బెర్గ్ ట్రయల్స్ లో కూడా ఇలాంటి చేయలేదన్నది అమెరికన్ హ్యూమన్ రైట్స్ సంఘాలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితీ, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలైతే అసలు మరణశిక్షనే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.

Tags:    

Similar News