బంగ్లాదేశ్: ‘ఇండియా అవుట్’ ప్రచారం వెనక ఎవరున్నారు?

మొన్నటి వరకూ మాల్డీవులలో వినిపించిన ‘ఇండియా అవుట్’ ప్రచారం ఇప్పుడు బంగ్లాదేశ్ లోను కనిపిస్తోంది. అక్కడి ప్రతిపక్ష బీఎన్పీ పార్టీ దీనిని ముందుండి నడుపుతోంది

Update: 2024-04-02 12:48 GMT

ఈ ఏడాది ప్రారంభంలో మన దేశానికి పొరుగున ఉన్న మాల్దీవులలో మొదట ‘ఇండియా అవుట్ ’ అనే ప్రచారాన్ని చేపట్టి మాల్దీవులలో మహ్మద్ మొయిజ్దూ అధికారాన్ని చేపట్టారు. తరువాత ఇది సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారాన్ని పొందింది.

ఇప్పుడు మన సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్ లో కూడా ఇదే నినాదాన్ని అక్కడి ప్రతిపక్ష పార్టీలు ప్రారంభించాయి. ఇక్కడ కూడా జనవరిలోనే ఎన్నికలు జరిగి షేక్ హసీనా వరుసగా నాలుగో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. ఇక్కడ ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్పీ నాయకులు ఈ ప్రచారంలో ముందున్నారు. పార్టీ మాత్రం అది మా స్టాండ్ కాదని చెబుతోంది. ఈ రెండు దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలు కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

ప్రచారానికి ఆజ్యం పోసింది ?
బంగ్లాదేశ్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన BNP తమ దేశంలో జనవరి 7న జరగనున్న ఎన్నికలను బహిష్కరించింది, అవామీ లీగ్ ప్రభుత్వంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవని ఆ పార్టీ ఆరోపించింది. షేక్ హసీనాతో మోదీ ప్రభుత్వం అంటకాగుతోందని అక్కడి విపక్షం ఆరోపిస్తోంది. కేవలం తన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బీజేపీతో కలిసి పని చేస్తోందని నెరెటివ్ ను అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీఎన్పీ చేస్తోంది. ప్రజాస్వామ్యం పతనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా కూడా అవామీ లీగ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.
బంగ్లాదేశ్ ఎన్నికలలో భారత్ ప్రభావం విపరీతంగా ఉందని అమెరికా కూడా విశ్వసిస్తోందని దీనిని తగ్గించాలని వాషింగ్టన్ కూడా న్యూఢిల్లీపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. బంగ్లాదేశ్ వ్యవహారాల్లో న్యూఢిల్లీ జోక్యం చేసుకుంటోందని బిఎన్‌పి తరచుగా ఆరోపిస్తోంది.
ముఖ్యంగా హసీనా ప్రభుత్వానికి ఏదైన ఇబ్బంది ఎదురుకాగానే అదికూడా అమెరికా లాంటి దేశాల నుంచి రాగానే భారత్ అండగా నిలబడుతోందని బీఎన్పీ ఆరోపణలు గుప్పిస్తోంది. అందుకే ఈ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాలకు నేతృత్వం వహిస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. తమ దేశంపై ఇండియా పెత్తనం చేస్తోందని, ప్రజాస్వామ్య విలువలకు అణచివేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోందని ఓ వర్గం భావిస్తోంది.
BNP సీనియర్ జాయింట్ సెక్రటరీ జనరల్ రూహుల్ కబీర్ రిజ్వీ ఢాకాలోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు కాశ్మీరీ శాలువాకు నిప్పంటించి ప్రచారంలో చేరిన తర్వాత ఈ ప్రచారం ఊపందుకుంది. భారతదేశం షేక్ హసీనా ఎన్నికకు మద్దతిచ్చిందని, అవామీ లీగ్ ఎన్నికలలో అవకతవకలను పాల్పడిన కళ్లు మూసుకుందని వారు భావిస్తున్నారు.  ఎందుకంటే భారత్ స్వంత ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడానికి యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుకుంది.
బంగ్లాదేశ్‌లోని రాజకీయ భూభాగాన్ని భారతదేశం నియంత్రిస్తుంది అనే సాధారణ అభిప్రాయం బంగ్లాదేశ్‌లో ఉంది. బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ కార్యదర్శి తౌహిద్ హుస్సేన్  రాసిన పుస్తకం "1971-2021: బంగ్లాదేశ్-భారత్ షోంపోర్కర్ పొంచాష్ బోచోర్" ఇందులో "బంగ్లాదేశ్‌లోని కీలక పదవుల నియామకాలకు భారతదేశం సమ్మతి తప్పనిసరి" అని వివరించారు. భారత రాయబార కార్యాలయం బంగ్లాదేశ్ పౌర, సైనిక బ్యూరోక్రసీలలో కీలక నిర్ణయం తీసుకునే ప్రక్రియలను ప్రభావితం చేస్తుందని ఆరోపించారు.
'ఇండియా అవుట్' ప్రచారం ఎలా ..?
జనవరిలో జరిగిన ఈ “ఇండియా ఔట్” ప్రచారంలో పాల్గొన్న బంగ్లాదేశ్ వైద్యుడు పారిస్‌లో నివసిస్తున్న సోషల్ మీడియా కార్యకర్త పినాకి భట్టాచార్య, బంగ్లాదేశ్, విదేశాలలో భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని తన మిలియన్ల కొద్ది ఉన్న అనుచరులను కోరారు “భారతదేశం కనికరంలేనిది. బంగ్లాదేశ్ దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం”.
వస్తువుల బహిష్కరణ ప్రచారం వెనుక ?
'ఇండియా అవుట్' ఉద్యమంలో లక్షలాది మంది బీఎన్పీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఆన్‌లైన్ కార్యకర్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు. 'భారతదేశం బంగ్లాదేశ్‌కు స్నేహితుడు కాదు' దేశాన్ని నాశనం చేస్తోంది' వంటి నినాదాలు ఇస్తున్నారు.
మీడియా నివేదికల ప్రకారం, 'ఇండియా అవుట్' ఉద్యమం బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్, వివిధ కేసుల్లో ఉగ్రవాదిగా నిరూపించబడి ప్రస్తుతం లండన్ లో ప్రవాసం చేస్తున్న తారిఖ్ రెహమాన్ ఉన్నారు. మాల్డీవులలో ఇదే నినాదం అక్కడ ప్రభుత్వం చేంజ్ కావడానికి ఉపయోగపడింది.
అందుకే ఇక్కడ కూడా దీనిని అమలు చేయాలని తన అనుచరులకు సూచించారు. BNP సైబర్ విభాగం సోషల్ మీడియా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ప్రారంభించింది. "భారత ఉత్పత్తులను బహిష్కరించు" ప్రచారం వెనుక ఇతర దేశాలలో ఉన్న బంగ్లాదేశ్ డయాస్పోరా చాలా మంది కూడా ఉన్నారని నమ్ముతారు.
షేక్ హసీనా స్పందన ఏమిటి?
షేక్ హసీనా ఇండియా అవుట్ ప్రచారం పై నిప్పులు చెరిగింది. ఇది ప్రారంభించిన బీఎన్పీ నాయకులు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇండియా పర్యటనకు వెళ్లి, చీరలను భారీ స్థాయిలో కొనుగోలు చేసేవారంది. వాటిని బంగ్లాదేశ్ లో అధిక ధరలకు విక్రయించేవారని, వాటిని బయటకు తీసి కాల్చివేయాలని డిమాండ్ చేసింది. అలాగే బీఎన్పీ నాయకులు ఇళ్లలో వంట చేసుకోవడానికి మసాలా దినసులు కూడా ఇండియా నుంచే వస్తున్నాయని, వాటిని ఉపయోగించడం మానుకోవాలంది. "గరం మసాలా, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం - భారతదేశం నుంచి వచ్చే అన్ని సుగంధ ద్రవ్యాలు BNP నాయకుల ఇళ్లలో చూడకూడదు" అని ఆమె చెప్పింది.
బహిష్కరణ ప్రభావం?
భారతదేశం, బంగ్లాదేశ్‌తో 4,100 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. 2021-22లో దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $15 బిలియన్లు డాలర్లుగా ఉంది. బంగ్లాదేశ్‌కు భారతదేశం అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముడి పదార్థాలు, యంత్రాలు, వ్యవసాయ వస్తువులతో సహా అవసరమైన దిగుమతుల కోసం బంగ్లాదేశ్ భారతదేశంపై ఆధారపడటం వలన రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో, బంగ్లాదేశ్ తన వస్త్రాలు, ఔషధాల ఎగుమతుల నుంచి భారతదేశం లాభపడుతుంది.
రెండు ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు 20 శాతం పత్తి భారతదేశం నుంచి వెళ్తుంది. ఆహారం, ఇంధనం, ఎరువులు, పారిశ్రామిక ముడి పదార్థాల వంటి అవసరమైన వస్తువుల కోసం బంగ్లాదేశ్ ఎక్కువగా భారతదేశంపై ఆధారపడుతుంది. దేశీయంగా బంగ్లాదేశ్ ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం లేదు. అయితే, ఈ భారతీయ వస్తువుల బహిష్కరణ ట్రాక్షన్ పొందినట్లయితే, బంగ్లాదేశ్ వస్తువులను దిగుమతి చేసుకోవడానికి చైనా వైపు మొగ్గు చూపుతుంది.
'ఇండియా అవుట్' ప్రచారం బంగ్లాదేశ్ కార్పొరేట్ రంగానికి, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, సేవా-ఆధారిత వ్యాపారాలలో భారతీయ నైపుణ్యం కలిగిన కార్మికులు నిపుణుల నియామకంలో ఎక్కువ ప్రభావాలను కలిగి ఉంది.
మిలియన్ల కొద్దీ BNP మద్దతుదారులచే నడిచే 'ఇండియా అవుట్' ఉద్యమం తీవ్రమైన భద్రతా ముప్పును కలిగిస్తుందని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక నివేదిక ప్రకారం, భారతదేశ వ్యతిరేక సిద్ధాంతాలతో బీఎన్పీ పుట్టుక ఉంది. న్యూఢిల్లీ తక్షణమే దీనిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.చారిత్రక శత్రుత్వం, సైద్ధాంతిక మూలాధారాలతో నడిచే ఈ ఉద్యమం, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచి, దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుంది, బంగ్లాదేశ్‌ను చైనాకు దగ్గర చేస్తుంది.
భారతదేశానికి, బంగ్లాదేశ్ ఎంత ముఖ్యమైనది?
బంగ్లాదేశ్, భారతదేశం భూపరివేష్టిత ఈశాన్య ప్రాంతాన్ని సముద్రానికి యాక్సెస్ చేయడానికి మధ్యలో ఉంది. సరుకు రవాణా కోసం అస్సాం త్రిపురల అభివృద్ధికి బంగ్లాదేశ్ కు చెందిన మోంగ్లా, చటోగ్రామ్ పోర్టులను ఉపయోగించుకునే అవకాశాన్ని హసీనా భారతదేశానికి అందించింది. ఇంకా, భారతదేశం యాక్ట్ ఈస్ట్, నైబర్‌హుడ్ ఫస్ట్ విధానాలకు బంగ్లాదేశ్ కీలకం. ఇంకా, గత ఆదివారం, మనదేశం ఈద్‌కు ముందు బంగ్లాలో పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో సహాయపడటానికి ఉల్లిపాయల ఎగుమతి చేసింది. ఈ మొత్తం 1,650 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఉల్లిపాయలను రవాణా చేయడానికి ఉల్లిపాయలపై ఎగుమతి నిషేధాన్ని సడలించింది. రానున్న రోజుల్లో భారత్ 50,000 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయనుంది.
భారతదేశం స్పందన
'ఇండియా ఔట్' ప్రచారాలపై భారత్ ఆందోళన చెందదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. “మనం గుర్తించవలసిన రెండు వాస్తవాలు ఉన్నాయి. చైనా కూడా పొరుగు దేశం, పోటీ రాజకీయాల్లో భాగంగా ఈ దేశాలను (మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్) అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది, ”అని జనవరిలో జరిగిన ముంబై ఈవెంట్‌లో ఆయన అన్నారు. పొరుగువారికి ఒకరికొకరు అవసరమని కూడా చెప్పారు.
 ఇండియా ఔట్ ప్రచారం ఎంత ప్రభావంగా ఉంది?
చాలా మంది నిపుణులు ఈ భారత వ్యతిరేక ప్రచారాన్ని 'చిన్న' సంఘటన అని మాత్రమే అంటున్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ మాట్లాడుతూ, "బంగ్లాదేశ్‌లో దాదాపు ప్రతిరోజూ అనేక నిరసనలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఇది "స్వేచ్ఛా సమాజం" . ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది. ఇండియా ఔట్ ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన, ద్వైపాక్షిక సంబంధాలలో ముఖ్యమైన అంశం భారత్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న వాణిజ్యం అని ఎత్తి చూపారు.
Tags:    

Similar News