బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు?
సైన్యం అత్యవసర సమావేశం, ఢాకాలోకి దశలవారీగా బలగాల ప్రవేశం సైనిక తిరుగుబాటుపై అనుమానాలను రేకెత్తిస్తోంది.;
బంగ్లాదేశ్(Bangladesh)లో శాంతిభద్రతలు క్షీణించాయి. విద్యార్థి సంఘాల నేతలకు, సైన్యానికి మధ్య విభేదాల తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో సవార్ కేంద్రంగా పనిచేస్తున్న సైన్యంలోని దళాలు(Troops) దశలవారీగా రాజధాని ఢాకా(Dhaka)లో ప్రవేశించడం ప్రారంభించాయి.
మారిన పరిస్థితులపై ఆర్మీ చీఫ్ ఆందోళన..
షేక్ హసీనా(Sheikh Hasina) నిష్క్రమణ తర్వాత దేశంలో మారిన పరిస్థితులపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉ-జమాన్ (Waker-u-Zaman) చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అవామీ లీగ్(Awami League) పార్టీని పూర్తిగా నిషేధించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సైన్యం అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అవామీ లీగ్‌కు సైన్యం తిరిగి ప్రాణం పోయాలని చూస్తే.. మరో ఆందోళన తప్పదని విద్యార్థి సంఘం కార్యకర్త హస్నత్ అబ్దుల్లా హెచ్చరించాడు. జనరల్ జమాన్ యూనస్‌ను ప్రధాన సలహాదారుగా నియమించడానికి విముఖత చూపుతున్నారని తాత్కాలిక ప్రభుత్వంలోని సలహాదారులలో ఒకరైన ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భూయాన్ పేర్కొన్నారు.
సైన్యం అత్యవసర సమావేశం..
ఈ పరిణామాల నేపథ్యంలో సైన్యం సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించిందని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. జనరల్ జమాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అత్యున్నత సైనిక అధికారులు పాల్గొన్నారు. దేశంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని సైన్యం యూనస్‌ను ఒత్తిడి చేయవచ్చని లేదంటే తిరుగుబాటుకు పాల్పడే అవకాశం ఉందని ఇండియా టుడే నివేదించింది.
పుకార్లను తోసిపుచ్చిన ఆర్మీ చీఫ్.
జనరల్ జమాన్ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చారు. సోమవారం (మార్చి 24) ఢాకాలో జరిగిన మరో కార్యక్రమంలో సీనియర్ ఆర్మీ అధికారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే చర్యలకు లొంగకూడదని సూచించారు.
చైనా పర్యటనకు యూనస్..
షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వీడినప్పటి నుంచి దాదాపు ఏడు నెలలుగా సైన్యం తాత్కాలిక ప్రభుత్వ పాలనకు సహకరిస్తోంది. మార్చి 26 నుంచి యూనస్ మూడు రోజుల చైనా పర్యటనకు బయలుదేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢాకాలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.