చైనా పర్యటన వలన బంగ్లాదేశ్ కు పెద్దగా ప్రయోజనం చేకూరలేదా?

ఢాకా ఆశించిన ఆర్థిక ఒప్పందాలు కుదుర్చకోలేని చైనా;

Update: 2025-04-03 11:37 GMT
చైనా అధ్యక్షుడితో బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహదారు యూనస్

ప్రణయ్ శర్మ

బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్ ఈ మధ్య నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటించారు. అయితే ఆయన పర్యటన వలన ఢాకాకు పెద్దగా ఒరిగిందేమి లేదనే ప్రచారం మాత్రం జరుగుతోంది.

ప్రస్తుతం పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య బంధం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యూనస్ బీజింగ్ పర్యటన జరుగింది. రెండు దేశాలు కూడా తమ దౌత్యపరమైన ప్రయోజనాల కోసం చైనాను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అధికారం నుంచి తొలగించబడిన తరువాత అక్కడ ఇస్లామిక్ శక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. బంగ్లాదేశ్ తో సంబంధాలు దెబ్బతిన్న తరువాత మూడు దేశాలు ఏకం కావడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
చైనా ఏం చేస్తుందో..
బీజింగ్ లో యూనస్ కు సాదర స్వాగతం లభించింది. అక్కడ ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్, ఇతర నాయకులు వ్యాపార అధిపతులను కలిశారు. కానీ ఈ సమయంలో చైనా ఎటువంటి తీవ్రమైన ఆర్థిక హమీలు ఇవ్వలేదు. ఇరుదేశాల మధ్య ఎనిమిది అవగాహాన ఒప్పందాలు చేసుకున్నాయి. 
చైనా పెట్టుబడులు..
చైనా 2.1 బిలియన్ డాలర్ల పెట్టుబడి, క్రెడిట్, గ్రాంట్లకు కట్టుబడి ఉంది. అదనంగా దాదాపు 100 చైనా కంపెనీలు బంగ్లాదేశ్ ప్రత్యేక ఆర్థిక, పారిశ్రామిక మండలంలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నాయి.
చైనా కంపెనీలు ఎప్పుడూ పెట్టుబడి పెడతాయో తేదీలు పేర్కొనలేదు. బంగాళాఖాతంలో ప్రతిపాదిత చైనీస్ ఆర్థిక, పారిశ్రామిక జోన్ వచ్చిన తరువాత ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఇదంతా సానుకూలంగా ఉంది కానీ మాకు ఎక్కువ గ్రాంట్లు  వస్తాయని నేను భావిస్తున్నాను’’ అని ఢాకాలోని బంగ్లాదేశ్ ఎంటర్ ప్రైజెస్ ఇన్ స్టిట్యూట్ అధ్యక్షుడు కూడా అయినా మాజీ దౌత్యవేత్త ఎం హూమాయున్ కబీర్ బెంగాలీ దినపత్రిక ఫ్రొథోమ్ అలోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు.
బంగ్లాదేశ్, చైనా నుంచి కనీసం పది బిలియన్ డాలర్ల మేర నిధులు ఆశించింది. కానీ వాటిని సాధించలేకపోయింది. ప్రస్తుతం ఢాకా ఆర్థిక వ్యవస్థ 450 బిలియన్ డాలర్లు. కొద్ది రోజులుగా దాని జీడీపీ గ్రోత్ రేట్ మందగిస్తోంది.
ప్రస్తుతం వృద్దిరేటు 4 శాతం వద్ద ఉంది. ఇక గోరు చుట్టు రోకలి పోటులా దాని వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం 25 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉన్నాయి. అధిక ద్రవ్యోల్భణం, ఆహర ధరల పెరుగుదలతో దేశం సతమతమవుతోంది. సగటు బంగ్లాదేశీకి రోజువారీ జీవితం దుర్భరమవుతోంది.
బంగ్లాదేశ్ కు సాయం చేసే విషయంలో చైనా వీటిని పరిగణలోకి తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు సందర్భాలలో కూడా చైనా ఇలాగే చాలా నిదానంగా తన పెట్టుబడులను తీసుకొచ్చింది. వాటిలో కొన్ని ఇంకా అమలు చేయలేదు కూడ.
బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్..
2016 లో జిన్ పింగ్ ఢాకా పర్యటన సందర్భంగా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద బంగ్లాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు.
అందులో 26 బిలియన్లు మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్ట్ లకు, 16 బిలియన్ డాలర్లు జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ల కోసం ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకూ వాటిలో 35 ప్రాజెక్ట్ లకు గాను కేవలం 4.45 బిలియన్ డాలర్లు మాత్రమే విదిల్చింది.
పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయమని ప్రస్తుతం జిన్ పింగ్ ను యూనస్ కోరినట్లు సమాచారం. అయితే వీటి కోసం ఆయన ఎలాంటి గడువును కోరలేదు.
తీవ్ర ఒత్తిడిలో యూనస్..
గత ఏడాది ఆగష్టులో హసీనా వెళ్లిపోయినప్పటి నుంచి ఢిల్లీ- ఢాకా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల నెలల్లో బంగ్లాదేశ్ కు విదేశీ ఆర్థిక సహాయాలు గణనీయంగా నిలిచిపోయాయి.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గద్దెనెక్కాక ఢాకాకు ఇవ్వాల్సిన నిధులను పూర్తిగా నిలిపివేశారు. దీనితో ఆయనపై ఒత్తిడి పెరిగింది.
ప్రస్తుతం ఆయన భారత్ లేకుండా తమ దేశం మనుగడ సాగించగలదని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చైనాలో పర్యటించారు.
కానీ ఆయన అక్కడ అనుకున్నదానిలో కనీసం సగం కూడా సాధించలేదు. దేశంలో ఇటీవల తినడానికి బియ్యం లేనటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు.
కానీ విఫలం కావడంతో ఇండియానే దిక్కయింది. ఢిల్లీ చాలా చౌక ధరకు ఢాకాకు బియ్యం సప్లై చేసింది.
రాజకీయ కారణాలతో భారత్ నుంచి వస్తువులను దిగుమతి, ముఖ్యంగా బియ్యం సప్లై వద్దనుకుంటే వియత్నాం వంటి దేశాలతో పొందవలసి ఉంటుంది. కానీ ఇది ఖర్చుతో కూడుకుని ఉన్నది.
ఈ నెల చివర్లో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా అయిన ఇషాక్ దార్ ద్వైపాక్షిక చర్చల కోసం, వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని పునరుద్దరించడానికి ఢాకాను సందర్శిస్తారని ఇప్పటికే షెడ్యుల్ ఖరారు అయింది.
షేక్ హసీనా కాలంలో పాకిస్తాన్ తో అన్ని సంబంధాలను తెంచుకున్నారు. ఇంతకుముందు యూనస్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీప్ ను రెండుసార్లు కలిశారు. కానీ ఇప్పటి వరకూ భారత ప్రధానమంత్రితో మాత్రం చర్చలు జరపలేదు.
బంగ్లాదేశ్ లోని ప్రభుత్వం భారత్ తో చర్చలు జరపడానికి సిద్దంగా ఉందని, అయితే న్యూఢిల్లీ మాత్రం అందుకు సిద్దంగా లేదని ఢాకా అధికారులు చెబుతున్నమాట.
అయితే బంగ్లాదేశ్ లో ప్రభుత్వ అధినేత ఎవరూ? అనే ప్రశ్నలను కొంతమంది భారత విశ్లేషకులు లేవనెత్తుతున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం యూనస్ కేవలం సలహదారు మాత్రమే అని, ఆయనతో చర్చలు ఎలా జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. అధికార హోదాలో ఆయన క్రమం చాలా చిన్నదని చెబుతున్నారు.
దీనికి తోడు యూనస్, అతని కింది స్థాయి అధికారులు భారత వ్యతిరేక ప్రకటనలు గుప్పించడం, షేక్ హసీనాను పదవి నుంచి తప్పించడం వంటివి న్యూఢిల్లీ ఆగ్రహం ఉందనే అంశాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ప్రస్తుతం బిమ్ స్టెక్ సమావేశాలు బ్యాంకాక్ లో నిర్వహించడానికి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో మరోసారి బంగ్లాదేశ్, మోదీతో సమావేశం జరపడానికి ప్రయత్నాలు జరపవచ్చు.
ఉత్సాహంగా ఉన్న పాకిస్తాన్..
బంగ్లాదేశ్ తో సంబంధాల విషయంలో పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది. హసీనా పరిపాలన చేసిన 16 సంవత్సరాలలో ఇస్లామాబాద్ తో ఎలాంటి సంబంధాలు లేవు.
ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో సంబంధాలను ఉపయోగించుకుని భారత తూర్పు తీరంలో అలజడి సృష్టించడానికి సిద్దంగా ఉందని న్యూఢిల్లీ అనుమానిస్తోంది. ఈ మధ్య పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ అధికారులు చికెన్ నెక్ సరిహద్దులను సందర్శించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సంవత్సరం చివరలో ఎన్నికలు జరిపించి కొత్త ప్రభుత్వం కొలువుదీర్చడానికి యూనస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రభుత్వం భారత్ తో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందనేది చాలా కీలకం.
ప్రస్తుతం చైనా అక్కడ ఉన్న అన్ని ఇస్లామిక్ పార్టీలతో చాలా సన్నిహిత సంబంధాలను నెరుపుతోంది. దాని స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
అయితే యూనస్, చైనాతో అతిగా దగ్గరవడం కూడా ట్రంప్ తో నేరుగా సవాల్ విసిరినట్లు అవుతుంది. భవిష్యత్ లో యూనస్ స్థానంలో వచ్చే నాయకులు సైతం చైనా, భారత్, అమెరికాతో రెండింటితో చక్కని దౌత్యసంబంధాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది బంగ్లాదేశ్ కు మాత్రం పెద్ద సవాలే అని చెప్పాలి.
Tags:    

Similar News