ఈ సంవత్సరం ప్రపంచ జనాభా ఎంత పెరిగిందో తెలుసా?
ప్రపంచ జనాభా జనవరి 1,2024 నాటికి 800 కోట్లకు చేరుతుందని యూఎస్ అంచనా వేసింది.
గత సంవత్సరం ప్రపంచ జనాభా దాదాపు 75 మిలియన్లకు పెరిగిందని, కొత్త సంవత్సరం అంటే జనవరి 1, 2024 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందని యూఎస్ జనాభా గణాంక విభాగం వెల్లడించింది. ఈ మేరకు గురువారం వారు కొన్ని గణాంకాలు విడుదల చేశారు.
గత సంవత్సరంలో ప్రపంచ జనాభా వృద్ధి రేటు కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకన్ కు 4.3 జననాలు నమోదు కాగా రెండు మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గత సంవత్సరంలో అమెరికాలో జనాభా వృద్ధిరేటు కేవలం 0.53 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభాలో యూఎస్ వాటా 1.7 మిలియన్లు కాగా, కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా 335.8 మిలియన్లకు చేరుతుందని ఒక అంచనా.
ప్రస్తుత జనాభా వృద్ధిరేటు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్ధంలోనే అతి తక్కువ జనాభా వృద్ధిరేటు కలిగిన దశాబ్ధంగా 2020-30 నిలిచిపోతుందని అమెరికా జనాభా విభాగం వెల్లడించింది. అమెరికాలో 1930 మాంద్యం తరువాత వృద్దిరేటు 7.3 శాతంగా ఉండేది. తరువాత నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. కరోనా తరువాత వృద్ధిరేటు కాస్త పెరిగింది. అయినా అప్పటి వృద్దిరేట్ ను చేరుకోవడం చాలా కష్టం అని విలియం ఫ్రే అనే జనాభా శాస్త్రవేత్త చెబుతున్న మాట.
2024 ప్రారంభంలో యూఎస్ లో ప్రతి తొమ్మిది సెకన్లకు ఒక జననం నమోదు అవుతోంది, ప్రతి 9.5 సెకన్లకు ఒక మరణం సంభవిస్తోంది. అయితే వలసలు అమెరికా జనాభా తగ్గకుండా చేస్తోంది. ప్రతి 28.3 సెకన్లకు ఒక వ్యక్తి వలసల రూపంలో యూఎస్ జనాభాకు జత చేరుతున్నారని వివరాలు ఉన్నాయి.