248 ఏళ్ల స్వతంత్ర అమెరికాలో నల్లజాతీయులు ఎందుకు ఎదగలేదు?

ఈవేళ జూలై 4. మనమాదిరే ఇంగ్లీషోడి దాష్టీకం మీద అమెరికా తిరగబడ్డ రోజు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ప్రకటించుకున్న రోజు. ఇది జరిగి ఇప్పటికి 248 ఏళ్లు.

By :  A.Amaraiah
Update: 2024-07-04 02:30 GMT

అమెరికా .. మరో మెగా ఈవెంట్ కి సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులపై జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. 'ఇది మా అమెరికా' అనుకునే వాళ్లు- జాతీయ జెండాలెగరేస్తున్నారు. ఇరుకు గదుల్లో ఉండే వాళ్లు, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ సైతం తామేమీ తక్కువ కాదన్నట్టుగా దేశభక్తిని చాటుతున్నారు. జెండాలు చిన్నవైనా హృదయాలు పెద్దవేనంటున్నారు. జాతీయ జెండాలను కర్రలకు కట్టి, కలర్ బల్బులు పెట్టి ఇళ్లను డెకరేట్ చేస్తున్నారు. మార్కెట్లు కళకళలాడుతున్నాయి. డిస్కౌంట్ల మోత మోగుతోంది. వెసులుబాటున్నోళ్లు లాంగ్ వీకెండ్ కి ముందే ప్లాన్ చేసుకున్నారు. 18ఏళ్లు దాటిందే తడవుగా సొంత బతుక్కోసం పట్టణాలకెళ్లిన పిల్లలు అమ్మానాన్నల దగ్గరికొస్తున్నారు. క్యాంపింగ్ లు, కయాక్ ల హడావిడి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మనం దీపావళికి పెట్టినట్టే ప్రతి పల్లె, పట్టణం, నగరాల్లో టపాకాయల కొట్లు వెలిశాయి. చీకటైతే కను విందు చేస్తున్నాయి. యాడ చూసినా ఓ పండగ లెక్కనే ఉంది. ఎండకాలం.. రాత్రి 9 గంటల వరకు పొద్దుగూకదు. పగటి పూట చూస్తే ఇళ్లున్నాయో లేదో తెలియక తికమకమడే కొండకోనలు సైతం రాత్రయితే జీగేల్ జిగేల్ మంటున్నాయి. అబ్రహాం లింకన్ పుట్టిన ఇల్లినాయిస్ స్టేట్ లోని చికాకూ, స్పింగ్ ఫీల్డ్ మొదలు మూడు రాష్ట్రాల మీదుగా 1300 కిలోమీటర్ల దూరంలోని డల్లాస్ చేరేంత వరకు కన్పించిన సీన్లివి....


ఈవేళ జూలై 4. మనమాదిరే ఇంగ్లీషోడి దాష్టీకం మీద అమెరికా తిరగబడ్డ రోజు. చేసింది చాల్లే ఇక తట్టాబుట్టా సర్దుకోమని కింగ్ జార్జ్ IIIకి చెప్పిన రోజు. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ప్రకటించుకున్న రోజు. ఇది జరిగి ఇప్పటికి 248 ఏళ్లు. మరో రెండేళ్లలో 250వ సొతంత్ర దినోత్సవాన్ని ఓ రేంజ్ లో జరిపేందుకు ఇప్పటి నుంచే అమెరికా పాలకులు కసరత్తు చేస్తున్నారు. అమెరికన్లు జూలై నాలుగో తేదీని నిజమైన దేశభక్తితో జరుపుకుంటారు. ఇళ్లల్లో అమెరికన్ జెండాలను ఎగురవేస్తారు. పెద్ద నగరాల్లో కవాతులు చేస్తారు. చరిత్ర, వారసత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతారు. ఇండియాలో లాగానే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీవాళ్లు రాజధాని నగరంలో జెండా ఎగరేసినా అమెరికన్లు మాత్రం నిండుమనసుతో ఈ పండగలాగేనే జరుపుకుంటారు.

1775 నాటికి మొత్తం అమెరికన్ కాలనీలు 13. బ్రిటన్ రాజు- కింగ్ జార్జ్- III కింద ఉండేవి. 'మా కాలనీలు మేము పాలించుకుంటాం, మీరెళ్లిపోండని' అమెరికన్లు అడుగుతూ వచ్చారు. కింగ్ జార్జ్- III వినకపోగా యుద్ధం ప్రకటించారు. 32 వేల మంది సైనికుల్ని, 400లకు పైగా యుద్ధ నౌకల్ని ఇచ్చి అడ్మిరల్ విలియం హోవ్స్ బ్రదర్ ను యుద్ధానికి పంపారు. జార్జి వాషింగ్టన్ అమెరికా సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయనకు మరో ఆఫ్రికన్ అమెరికన్ బిల్లీ లీ తోడనున్నాడు. ఎక్కడెక్కడి నుంచో వలసొచ్చి స్థిరపడి స్వయం పాలన కోరుతున్న అమెరికన్లకు నోరెత్తితే పీక మీద కాలేసి తొక్కే బ్రిటీష్ విధానాలకు మధ్య నడిచిన పోరాటం ఇది. ఆ రోజు జూన్ 28. కింగ్ జార్జ్- III ఆదేశాలతో వంద నౌకలు ఏకకాలంలో మాన్ హాట్టన్ ఐలాండ్, లాంగ్ ఐలాండ్, శాటన్ ఐలాండ్, జెర్సీ కోస్ట్ వంటి కీలక అమెరికా నౌకాస్థావరాలపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నాయి. న్యూయార్క్ స్వాధీనమైతే అమెరికా కాలనీలు తమ ఆధీనంలో ఉన్నట్టే అనుకున్న బ్రిటన్ కు జార్జ్ వాషింగ్టన్ సేనలు గట్టి పోటీని ఇస్తాయి. సరిపడా ఆయుధాలు లేకపోయినా ఆయనేసిన ఎత్తుగడలు ఫలించాయి. యుద్ధం మొదలై ఐదు రోజులైంది. ఇంతలో అమెరికన్ కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలో భేటీ అయింది. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఆ మీటింగే చారిత్రాత్మక ప్రకటనకు వేదికైంది. జూలై 2, 1776న యుద్ధం ముగిసింది. అమెరికన్ కాలనీలు విముక్తం అయ్యాయి. ఆ తర్వాత రెండు రోజులకు అంటే జూలై 4, 1776న తుది స్వతంత్ర్య ప్రకటన బయటకు వచ్చింది. ఆ ప్రకటన పూర్తి పాఠం జూలై 9, 1776న బయటకు వచ్చింది.

అందులో ఏముందంటే...

అమెరికన్ కాలనీలకు 1776 జూలై 4న స్వాతంత్ర్యం వచ్చింది. 13 కాలనీలలో 12 అధికారికంగా గ్రేట్ బ్రిటన్‌తో తమ రాజకీయ సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. థామస్ జెఫెర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ కాలనీలను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించారు. థామస్ జఫర్సన్ రాసిన ప్రకటననే అమెరికన్ రెండో కాంటినెంటల్ కాంగ్రెస్ యధాతథంగా ఆమోదించింది. "ఈ సత్యాలను మేము (అమెరికన్ కాంగ్రెస్) స్పష్టంగా గుర్తించాం. మనుషులందరూ సమానంగానే పుడతారు. వారికి - సృష్టికర్త కొన్ని విడదీయరాని హక్కులను ప్రసాదించారు. వాటిలో జీవితం, స్వేచ్ఛ, సుఖమయ జీవితం కోసం కృషి వంటివి ఉన్నాయి" అన్నది ఆ ప్రకటన సారాంశం. అప్పటి నుంచి అమెరికా జూన్ 4ని మన ఆగస్టు 15లాగా జరుపుకుంటున్నారు.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతీయ సెలవు దినంగా పాటిస్తారు. సీమటపాకాయలు, చిచ్చుబుడ్లు, ఆకాశంలో మిరుమిట్లు గొలిపే రంగురంగుల బాంబులు, టపాసులు, ర్యాలీలు, ఆటపాటలతో హోరెత్తిస్తారు. ప్రతి ఈవెంట్ ను మార్కెటింగ్ చేయడంలో ముందుండే బిగ్ బిగ్ కంపెనీలు ఈ ఉత్సవాన్నీ మార్కెటింగ్ చేస్తోంది. ఎక్కడెక్కడ ఏమేమి రాయితీలతో దొరుకుతాయో ఇప్పటికే ఊదరగొడుతోంది. అమెరికన్లు తమ చరిత్రను గౌరవిస్తూ జెండాలు ఎగురవేయడం, టపాకాయలు కాల్చడం, కుటుంబ సభ్యులందరూ ఓ చోటుకు చేరడం ఈ పండగ ప్రత్యేకత అంటున్నారు నార్త్ టెక్సాస్ లో ఉండే నేటివ్ అమెరికన్ థామస్. "స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం విలువలకు అద్దం పట్టడమే అమెరికా. ఈ రోజు దేశభక్తిని ప్రదర్శించడం మా అలవాటు. ఈ గడ్డమీద ఉండే ప్రజలందరూ ఐక్యతా భావంతో సంతోషంతో నిండి ఉండాలి. మా పూర్వీకుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ గుర్తుచేయడమే జూలై 4" అన్నారు థామస్. మాజీ సైనికుడైన థామస్ తన ఇంటిని చాలా అందంగా అలంకరించారు. చుట్టూ జెండాలు పెట్టారు. కుటుంబ సభ్యులతో టపాకాయలు కాల్చడానికి సిద్ధమవుతున్నవారు.

జూలై 4న అమెరికన్లు సాంప్రదాయకంగా ఎరుపు, తెలుపు, నీలం రంగుల బట్టలు వేసుకుంటుంటారు. రకరకాల సంస్కృతికి చాటుతారు. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50 రాష్ట్రాలు, ఫెడరల్ జిల్లా అంటే కేంద్ర ప్రభుత్వం ఉండే అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, మరో ఐదు ప్రధాన భూభాగాలు- ప్యూర్టో రికో, గ్వామ్, అమెరికా వర్జిన్ ఐలాండ్స్, అమెరికన్ సమోవా, ఉత్తర మరియానా దీవులు, మరికొన్ని చిన్న దీవులు ఉన్నాయి.

248 ఏళ్ల చరిత్రలో ఒకే ఒక నల్లజాతీయ అధ్యక్షుడు ఒబామా..

యునైటెడ్ స్టేట్స్‌కు అధికారిక భాష లేదు. అత్యధికులు మాత్రం ఇంగ్లీషు మాట్లాడతారు. 350 కంటే ఎక్కువ భాషల్లో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ కాకుండా చాలా ఎక్కువగా మాట్లాడే భాషల్లో స్పానిష్, చైనీస్, తగలోగ్, వియత్నామీస్, అరబిక్ ఉన్నాయి. అమెరికన్ మూల వాసులు నవాజో, యుపిక్, డకోటా, అపాచీ, కెరెస్, చెరోకీ వంటి స్థానిక అమెరికన్ భాషలను కూడా మాట్లాడతారు. అనేక సంస్కృతుల సమ్మేళనమే అమెరికా. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అమెరికాకి వలస వస్తుంటారు. ఎవరి సంప్రదాయాలు, భాషలు, ఆహారం వారిదే. బహుశా ఈ వైవిధ్యమే అమెరికాను బలమైన, ఆసక్తికరమైన ప్రదేశంగా మార్చిందేమో. ఒక్క 2022లోనే దాదాపు 950,000 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం తెల్లజాతి అమెరికన్ల తర్వాత నల్లజాతి అమెరికన్లే రెండో అతిపెద్ద జాతి. అమెరికాలో హిస్పానిక్ (మెక్సికన్ల) జనాభా 2020లో 62.1 మిలియన్లకు చేరుకుంది. మొత్తం అమెరికన్లలో 19% మంది వాళ్లున్నారు. భారతీయులు కోటి మందికి పైగా ఉన్నట్టు అంచనా.

అమెరికా 248 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకు 46 మంది అధ్యక్షులుగా ఉంటే వారిలో నల్లజాతీయుడు ఒకే ఒక్కడు కావడం గమనార్హం. 1789లో తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్. ప్రస్తుత అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్. 46వ అధ్యక్షుడు. 2024 నవంబర్ 4న 47వ అధ్యక్షుడి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇన్నేళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఒక్క నల్లజాతీయుడు- బారక్ ఒబమా మాత్రమే అధ్యక్షుడు కాగలిగారు. రెండు సార్లు వరుసగా అధ్యక్షుడైన నల్లజాతీయుడు కూడా ఆయనే. 1827లో పుట్టిన జాన్ హాన్సన్ అనే నల్లజాతీయుడు పోటీ పడ్డారని చరిత్ర చెబుతున్నా ఇదే పేరున్న మరో తెల్లజాతీయుడని తర్వాత తేలింది. నల్లజాతీయుడైన జాన్ హాన్సన్ మేరీల్యాండ్‌కు చెందిన మాజీ బానిస. అప్పటి పశ్చిమ ఆఫ్రికా కాలనీ అయిన లైబీరియాలో కొన్నేళ్లు ఉండి బానిసత్వం నుంచి బయటపడి 1850లలో లైబీరియాకు సెనేటర్ అయ్యాడు.

వైస్ ప్రెసిడెంట్లు ఎంతమంది అయ్యారంటే..

అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో అనేక మంది ఆఫ్రికన్ అమెరికన్లు పాల్గొన్నారు. వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. బ్రిటన్ తో విడిపోయే నాటికి బానిసత్వం రద్దు కాలేదు. కనీసం ఈ స్వాతంత్ర్యంతోనైనా బానిసత్వ విముక్తి చట్టం వస్తుందనుకుని అనేక మంది బ్రిటన్ సైన్యాలతో పోరాడారు. అంత చేసినా వేళ్లమీద లెక్కించదగిన వాళ్లు మాత్రమే సెనేటర్లు కాగలిగారు. బానిసత్వం నుంచి బయటపడిన ఫ్రెడరిక్ డగ్లస్ 1848 ప్రాంతంలో ఉపాధ్యక్షుడయ్యారు. 19వ శతాబ్దంలో ఆఫ్రికన్-అమెరికన్ పౌర హక్కుల ఉద్యమానికి వెన్నుముక లాంటి వారు. గొప్ప వక్త, మేధావి. తానూ బానిసని చెప్పడానికే ఆయన ఆత్మకథ రాశారు. 'ఓ బానిస ఆత్మకథ' పేరిట తెలుగులోనూ ఈ పుస్తకం ఉంది. ఆ తర్వాత ఒకరిద్దరు వైస్ ప్రెసిడెంట్లు మాత్రమే కాగలిగారు. వారిలో ఇండియన్ అమెరికన్ కమలా హారిస్ ఒకరు.

కారణాలు ఏమై ఉండొచ్చు...

ప్రెసిడెన్సీ, వైస్ ప్రెసిడెన్సీతో సహా రాజకీయ అధికార పోస్టుల్లో నల్లజాతీయులు, ఇతర అట్టడుగు వర్గాలకు అతి తక్కువ ప్రాతినిధ్యమే ఉందన్నది చారిత్రక సత్యం. సమాన అవకాశాలు, ప్రాతినిధ్యాన్ని నిరోధించే వివిధ వ్యవస్థాగత అడ్డంకులు ఇప్పటికీ ఈ పురాతన ప్రజాస్వామ్య దేశంలో చాలా ఉన్నాయనే అనిపిస్తోంది. ఓటింగ్ హక్కును కొందరికే పరిమితం చేయడం, రాజకీయ ప్రాతినిధ్యం, జెర్రీమాండరింగ్ ( అధికార పార్టీలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ తరహా), ఎన్నికల ప్రచార ఖర్చు, నిధుల సేకరణలో అసమానతలు, మీడియా ప్రాతినిధ్యం, పక్షపాతం, చారిత్రకంగా కొనసాగుతున్న జాత్యహంకారం, వివక్ష వంటివనేకం ఈ సొసైటీని ఇప్పటికీ పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యల్ని పరిష్కరించినపుడే రాజకీయ నాయకత్వ స్థానాల్లోకి నల్లజాతి ప్రజలు, ఇతర అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందేమో. స్వేచ్ఛ, సమానత్వం, స్వపరిపాలన ఆలోచనలు, ఉన్నత జీవనం కోసం ప్రాణాలొడ్డిన అమెరికన్లకు జోహార్లు. 1801లో వైట్ హౌస్ లో ప్రారంభమైన ఈ వేడుకలు 225 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఆ పరంపరే ఈ ఏడాదీ కొనసాగుతోంది.

Tags:    

Similar News