పాకిస్తాన్ తో వాణిజ్యం పూర్తిగా నిలిపివేసిన భారత్
నౌకల ఎంట్రీని సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-03 11:32 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్ దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు నదీ జలాలు నిలిపివేసిన న్యూఢిల్లీ తరువాత పాక్ కమర్షియల్ విమానాలకు ఎయిర్ స్పేస్ ను మూసివేసింది. తాజాగా ఆ దేశంతో వాణిజ్యాన్ని సైతం నిలిపివేసింది. అలాగే భారత్ పోర్ట్ లలలోకి ఇస్లామాబాద్ నౌకల ఎంట్రీని సైతం నిలిపివేసింది.
ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చే వస్తువుల అన్ని ఇన్ బౌండ్ షిప్ మెంట్ లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ కు భారత్ ఎగుమతులు 447. 45 యూఎస్ మిలియన్లు కాగా, దిగుమతులు కేవలం 0.42 మిలియన్లుగా ఉంది.
డీజీఎఫ్టీ నోటిఫికేషన్
‘‘తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాకిస్తాన్ లో తయారయ్యే లేదా ఎగుమతి చేసే అన్ని వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతిలపై నిషేధం కొనసాగుతోంది’’ అని కేంద్రం పేర్కొంది. వాణిజ్య విధానం 2023కి ఈ నిబంధన జోడించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) మే 2న జారీ చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.
జాతీయ భద్రత, ప్రజా విధానం దృష్ట్యా ఈ పరిమితి విధించినట్లు పేర్కొంది. ఈ నిషేధానికి ఏదైన మినహయింపుకు భారత్ ప్రభుత్వ ఆమోదం అవసరమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
‘‘పాకిస్తాన్ నుంచి దిగుమతి నిషేధం’’ అనే శీర్షిక కింద నిబంధనను ఎఫ్టీలో చేర్చారు. ‘‘పాకిస్తాన్ లో తయారయ్యే లేదా ఎగుమతి చేయబడిన అన్ని వస్తువుల ప్రత్యక్ష లేదా పరోక్ష దిగుమతి లేదా రవాణా, స్వేచ్ఛగా దిగుమతి చేసుకోదగినది కాదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిషేధం అమలవుతుంది’’ అని పేర్కొంది.
నిలిచిన వాణిజ్యం..
గత ఆర్ధిక సంవత్సరంలో పొరుగుదేశం నుంచి ప్రధాన దిగుమతుల్లో పండ్లు, డ్రైప్రూట్స్, కొన్ని నూనె గింజలు, ఔషధ మొక్కలు, సేంద్రీయ రసాయనాలు ఉన్నాయి. ఏప్రిల్ 22 న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక హిందువులను మతం అడిగి మరీ ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాద దాడి తరువాత కొన్ని రకాల వస్తువుల తరలింపుకు ఉపయోగించే అట్టారి ల్యాండ్ ట్రాన్సిట్ పోస్ట్ ను వెంటనే మూసివేయడం వంటి అనేక చర్యలు భారత్ తీసుకుంది. భారత్, పాకిస్తాన్ తో ఇప్పటికే పుల్వామా ఉగ్రవాద దాడి తరువాత వాణిజ్యాన్ని నిలిపివేసింది.
భారత్ గడచిన రెండు ఆర్ధిక సంవత్సరంలో వరుసగా 627.1 మిలియన్లు, 513.82 మిలియన్ల డాలర్ల విలువ అయిన వస్తువులను ఎగుమతి చేసింది. పాక్ నుంచి 20.11 మిలియన్లు, 2.54 మిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నారు.
పాక్ కు జరిగిన మొత్తం ఎగుమతుల్లో సేంద్రీయ రసాయనాలు, ఔషధ ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 60 శాతం ఉన్నాయి. ఈ విలువ ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు 129.55, 110.06 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఇతర వస్తువులలో చక్కెర, చక్కెర మిఠాయి 85.16 మిలియన్లు, కొన్ని కూరగాయలు 3.77 మిలియన్లు, కాఫీ, టీ సుగంధ ద్రవ్యాలు, తృణ ధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తులు(11.63)మిలియన్లు, ఆటో కాంపొనెంట్స్ 28.57 మిలియన్లు ఉన్నాయి.
క్షీణిస్తున్న సంబంధాలు..
పుల్వామ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాకిస్తాన్ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచింది. వాటిలో తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ఖనిజాలు ఉన్నాయి.
2017-18 పాకిస్తాన్ భారత్ కు ఎగుమతి చేసిన విలువ 488.5 మిలియన్ డాలర్లుగా ఉంది. ఉగ్రవాద దాడులు నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ కు అత్యంత అనుకూల హోదాను కూడా ఉపసంహరించుకుంది. 1996 లో భారత్, పాకిస్తాన్ కు ఈ హోదాను మంజూరు చేసింది.
2017-18 లో భారత్- పాకిస్తాన్ మధ్య వాణిజ్యం విలువ 2.41 బిలియన్ డాలర్లు కాగా, 2016-17 లో ఇది 2.27 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 2017-18 లో 488.5 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోగా, 1.92 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.