యుద్దాన్ని త్వరగా ముగించండి: పుతిన్ ను కోరిన మోదీ
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్దాన్ని త్వరగా ముగించాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడిని కోరారు. ఇతర దేశాల సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడాలని కోరారు.
By : The Federal
Update: 2024-07-09 12:01 GMT
ఉక్రెయిన్ తో రెండేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను మోదీ కోరారు. ఐదు సంవత్సరాల తరువాత తొలిసారిగా మాస్కో పర్యటనకు వెళ్లిన సందర్భంలో మోదీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
యుద్ధభూమిలో ఎలాంటి పరిష్కారం దొరకదని చెబుతూ, అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పుతిన్ సోమవారం ఇచ్చిన విందు సందర్భంగా మోదీ అన్నారు. రష్యా చేసిన క్షిపణి దాడుల్లో సోమవారం ఉక్రెయిన్‌లో కనీసం 38 మంది మరణించగా, 190 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో మోదీ ఈ విజ్ఞప్తి చేశారు.
UN చార్టర్‌ను గౌరవించండి
"ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారంతో సహా UN చార్టర్‌ను గౌరవించాలని భారత్ ఎల్లప్పుడూ పిలుపునిస్తుంది. యుద్ధభూమిలో ఎటువంటి పరిష్కారం దొరకదు" అని న్యూఢిల్లీ వివరించింది. చర్చలు, దౌత్యం ముందుకు వెళ్లడానికి మార్గంగా ఉండాలని పుతిన్ తో అన్నారు. ట్రావెల్ ఏజెంట్ల మోసం ద్వారా భారతీయ యువత రష్యన్ సైన్యంలో చేరుతున్నారని మోదీ, పుతిన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.
యుద్ధంలో భారతీయులు
దాదాపు రెండు డజన్ల సంఖ్యలో ఉన్న బాధిత వ్యక్తులందరినీ స్వదేశానికి రప్పించేందుకు రష్యా కట్టుబడి ఉందని కొన్ని సోర్స్ లు వెల్లడించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక వైరల్ వీడియోలో పంజాబ్, హర్యానాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆర్మీ యూనిఫారంలో ఉక్రెయిన్‌లో యుద్ధం రంగంలో రష్యా తరఫున పోరాడుతున్నారు. వారు స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్, రష్యాను స్పష్టంగా ఖండించలేదు. మాస్కోను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాలకు కూడా న్యూఢిల్లీ దూరంగా ఉంది.
మోదీని అభినందించిన పుతిన్
మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి పుతిన్ అభినందనలు తెలిపారు. "ఫలితాలు తమకు తాముగా మాట్లాడుకుంటాయి. ఆర్థిక వ్యవస్థల పరంగా భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉంది" అని రష్యా అధిపతి అన్నారు.
గత దశాబ్ద కాలంలో మోదీ, పుతిన్‌ల మధ్య ఇది 16వ సమావేశం. రష్యా పర్యటన తరువాత నుంచి మోదీ నేరుగా ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత వియన్నాను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం గమనార్హం.