పిల్లల్లో ఆటిజానికి కారణం చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
భారతదేశంలో క్రోసిన్, కాల్పోల్, డోలో-650 పేర్లతో ప్రసిద్ధికెక్కిన పారసెటమాల్..
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మాటలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తమ దేశంలో ఆటిజం(Autusm) బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోందన్నారు. గర్భధారణ సమయంలో టైలెనాల్ (పారసెటమాల్) ఔషధాన్ని తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వస్తుందని, "అత్యవసరమైతే తప్ప" గర్భిణులు ఈ ఔషధాన్ని వాడకూడదని ట్రంప్ కోరారు. భారతదేశంలో క్రోసిన్, కాల్పోల్, డోలో-650 పేర్లతో ఈ మందు ప్రసిద్ధికెక్కింది. ట్రంప్ ప్రకటన వైద్యులు, శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది.
పారాసెటమాల్(Paracetamol) ఉపయోగమేంటి?
ఒళ్లునొప్పులు, జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ తగిన మోతాదులో తీసుకుంటే ప్రమాదం ఉండదంటున్నారు భారత వైద్యులు. అధిక మోతాదులో చాలాకాలంగా వాడితే గర్భిణీలు, గర్భిణీలు కాని వారిలో కాలేయం దెబ్బతింటుందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రెగ్జెన్సీకి ముందు ఎక్కువ రోజులు పారాసెటమాల్ వాడకం వల్ల పుట్టే పిల్లల్లో ADHD(Attention-deficit hyperactivity disorder) వస్తుందని, అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ నివేదికలపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. గర్భిణులు ఏ మందు కొన్నా.. ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు వైద్యులు.