‘నన్ను బయటకు పంపిన వారే ఇప్పుడు హసీనాను దించేశారు’ : తస్లీమా నస్రీన్
దేశం నుంచి నన్ను బలవంతంగా బయటకు పంపించిన ఇస్లామిక్ శక్తులే ఇప్పుడు హసీనాను గద్దె దించాయని వివాదస్పద రచయిత తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు.
By : The Federal
Update: 2024-08-06 11:52 GMT
బంగ్లాదేశ్ లో కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడాల్సి వచ్చింది. దీనిపై బంగ్లాదేశ్ రచయిత తస్లీమా నస్రీన్ స్పందించారు.
తనను దేశం నుంచి బహిష్కరించిన అదే ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు ప్రధాని షేక్ హసీనాను పదవీ నుంచి దింపేశారని ఆరోపించారు. దేశంలోని ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. నస్రీన్ రాసని లజ్జా పుస్తకంపై ఇస్లామిస్టులు తీవ్రంగా స్పందించారు.
ఈ పుస్తకం 1990 దశకంలో ప్రచురణ అయింది. అయితే మతఛాందసవాదుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో 1999లో ప్రధాని షేక్ హసీనా, తనను దేశం నుంచి వెళ్లగొట్టిందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఒకసారి తన తల్లి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు తస్లీమా ఢాకా వెళ్లింది. ఆ తరువాత బంగ్లాదేశ్‌లోకి తిరిగి ప్రవేశించడానికి ఆమెను ఎప్పుడూ అనుమతించలేదు.
'దాడి చేస్తున్న ఇస్లాంవాదులు'
ఇలా తనను దేశం నుంచి వెళ్లగొట్టించిన ఇస్లాంవాదులు ఇప్పుడు హసీనా ను కూడా బలవంతంగా పదవీ నుంచి దించేశారని, వారే ఈ విద్యార్థి ఉద్యమంలోనే ప్రవేశించారని అని ఆరోపించారు.
1971 విముక్తి యుద్ధంలో పోరాడిన అనుభవజ్ఞుల కుటుంబాలకు 30 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు ఉద్యమం చేశారు. దాంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరకు సైన్యం రంగప్రవేశం చేసి హసీనాను 45 నిమిషాల్లో రాజీనామా చేయాలని ఆదేశించడంతో ఆమె తలొగ్గి దేశం విడిచిపెట్టి కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది.
నిరసనల్లో 400 మందికి పైగా..
అయితే బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మాత్రం హసీనా నే అని తస్లీమా నస్రీన్ నిందించారు. "ఆమె పరిస్థితికి ఆమె బాధ్యత వహించాలి. హసీనా ఇస్లాంవాదులను ఎదగడానికి చేసింది. ఆమె తన ప్రజలను అవినీతిలో పాలుపంచుకోవడానికి అనుమతించింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారకూడదు. సైన్యం పాలించకూడదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని తీసుకురావాలి’ అని తస్లీమా అన్నారు.
ఆమె సంచలనాత్మక నవల లజ్జా (1993) మరియు ఆమె ఆత్మకథ అమర్ మెయెబెలా (1998)తో సహా ఆమె కొన్ని పుస్తకాలు బంగ్లాదేశ్‌లో నిషేధించబడ్డాయి. బంగ్లాదేశ్‌లో మతతత్వం, స్త్రీల సమానత్వంపై ఆమె రాసినందుకు ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి విమర్శలను ఎదుర్కొన్న తస్లీమా 1994 నుంచి ప్రవాస జీవితం గడిపారు.