జర్నలిస్టు పెళ్లికి రష్యా అధ్యక్షుడు పుతిన్ విరాళం

సీరియస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓ విలేఖరి ప్రేమ వ్యవహారం

Update: 2025-12-20 04:47 GMT
పుతిన్ ని వివాహానికి ఆహ్వానించిన జర్నలిస్టు

రామాయణంలో పిడకల వేట అనే తెలుగు సామెత మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అటువంటిదే జరిగింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా మీట్ లో..

ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఏడాది చివర్లో ముగింపు తెస్తామంటూ గంబీరంగా పుతిన్ చెబుతున్న సమయంలో ఓ యువ విలేఖరి లేచి.. మీరు నా పెళ్లికి రావాలి, ఇప్పుడే నా ప్రియురాలికి ప్రపోజ్ చేస్తున్నాను అంటూ ప్లకార్డ్ ప్రదర్శించారు. ఈ ఆసక్తికర సంఘటనతో పుతిన్ సహా అందరూ చిరునవ్వులు చిందించినా రష్యాలో ఆర్ధిక పరిస్థితిని తెరపైకి తెచ్చింది.
అసలేమి జరిగిందంటే...
శుక్రవారం ఆయన వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు సైతం నేరుగా లైవ్‌లో సమాధానాలిచ్చారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ యుద్ధానికి ముగింపు పలికేలా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న వేళ పుతిన్‌ ఏం మాట్లాడుతారా అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సరిగ్గా ఆ దశలో పుతిన్‌ ముందే ఓ యువ జర్నలిస్టు.. తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.
కిరిల్‌ బజానోవ్‌ (Kirill Bazhanov) అనే 23 ఏళ్ల యువ జర్నలిస్టు .. ‘నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని ప్లకార్డును పట్టుకొని.. పుతిన్‌ ముందే తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు. కిరిల్‌ మాట్లాడుతూ.. ‘నా స్నేహితురాలు దీన్ని చూస్తోంది. ఓల్గా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?. ప్లీజ్‌ నన్ను పెళ్లి చేసుకో.. నేను నీకు ప్రపోజ్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నాడు. వెంటనే ఆ ప్రాంగణంలోని వారంతా చప్పట్లు కొట్టారు. అనంతరం అతడు పుతిన్‌ (Vladimir Putin)తో మాట్లాడుతూ.. రష్యాలో జీవన వ్యయం పెరగడంపై ఆందోళన వ్యక్తంచేశాడు. తాను, తన స్నేహితురాలు ఎనిమిదేళ్లుగా కలిసి ఉంటున్నామని అయితే, విస్తృత ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

 జర్నలిస్టు కిరిల్‌ బజానోవ్‌ ప్రపోజల్‌ను అతని స్నేహితురాలు అంగీకరించినట్లు తెలిపారు. దీంతో పుతిన్‌తో సహా అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తంచేస్తూ చప్పట్లు కొట్టారు. తన వివాహ వేడుకకు హాజరుకావాలని కిరిల్‌ పుతిన్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై అధ్యక్షుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే, కిరిల్‌కు ఆర్థికసాయం ప్రకటించారు. ‘కిరిల్‌ యువ కుటుంబాల ఆర్థిక పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తంచేశాడు. అది నిజమే. ఇప్పుడు మనం విరాళాలతో అతడి పెళ్లికి కావాల్సిన డబ్బును సేకరించాలి’ అని అన్నారు.


దీంతో సమావేశం మరోసారి గంభీరంగా మారిపోయింది. రష్యన్ ఆర్ధిక పరిస్థితికి ఈ విరాళం అద్దం పట్టిందంటూ కొన్ని మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.

Tags:    

Similar News