‘కంగ్రాట్యూలేషన్ మై ఫ్రెండ్’ ట్రంప్ కు మోదీ అభినందనలు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదిక అభినందనలు తెలిపారు.
By : The Federal
Update: 2024-11-06 09:57 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - యుఎస్ మధ్య సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని అన్నారు.
ఈ చారిత్రాత్మక ఎన్నికల విజయానికి నా స్నేహితుడు @realDonaldTrump కి హృదయపూర్వక అభినందనలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, భారత్-యుఎస్ సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను. అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
"మన ప్రజల అభ్యున్నతి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కలిసి పని చేద్దాం" అని ఆయన అన్నారు. 2016-2020 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌తో గతంలో జరిగిన సమావేశాల చిత్రాలను కూడా ప్రధాని పోస్ట్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అమెరికా చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించారని చెప్పవచ్చు. నాలుగువందల సంవత్సరాల అమెరికా చరిత్రలో ఇలా మాజీ అధ్యక్షుడు ఓ టర్మ్ గ్యాప్ తరువాత తిరిగి గెలవడం కేవలం రెండోసారి మాత్రమే. 174 సంవత్సరాల క్రితం సరిగ్గా చెప్పాలంటే 1884 ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడైన గ్రోవర్ క్లీవ్ లాండ్ తిరిగి 1892 ఎన్నికల్లో గెలిచి మరోసారి అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఆ తరువాత ట్రంప్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం ట్రంప్ 267 ఓట్ల ఎలక్టోరల్ ఓట్లను పొందారు. ఆయనకు మరో మూడు ఓట్లు లభిస్తే రెండో సారి అధ్యక్షుడవుతారు. ఆయన పార్టీ దాదాపు మరో నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉంది. ఆయన ప్రత్యర్థి డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ 230 ఓట్ల దగ్గరే ఆగిపోయారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు...
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహు అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నికైన ట్రంప్ కు, ఆయన భార్య మెలానియాకు అభినందనలు తెలిపారు. ‘ అతి పెద్ద విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు అభినందనలు. వైట్ హౌజ్ మీ కోసం ఎదురు చూస్తోంది. మీ రాక అమెరికాకు కొత్త శకాన్ని అందిస్తుంది. ఇజ్రాయెల్- అమెరికా మధ్య శక్తివంతమైన సంబంధాలకు ఇది దోహదం చేస్తాయి’’ అని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.