భారత్ కు మాత్రమే ఆ శక్తి ఉంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా జరుగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్ కు మాత్రమే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

Update: 2024-08-24 12:18 GMT

ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాను నిలువరించే శక్తి ప్రపంచంలో కేవలం భారత్ కు మాత్రమే ఉందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. “భారత్ పెద్ద ప్రభావవంతమైన దేశం. ప్రపంచంలోనే చాలా సందేహాస్పద దేశాల సర్కిల్ లో కూడా ఇండియా అంటే గౌరవం ఉంది. ఈ యుద్ధం పట్ల, రష్యా పట్ల భారత్ వైఖరిని మేము మార్చుకుంటే, మేము యుద్ధాన్ని ఆపేస్తాము, ఎందుకంటే పుతిన్ కూడా దానిని ఆపాలనుకుంటున్నారు, ” అని భారత మీడియాతో జెలెన్ స్కీ చెప్పారు.

ఉక్రెయిన్ లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా పర్యటించడం చారిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోదీ, జెలెన్స్కీని భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. దానికి ఆయన సమ్మతించినట్లు చెప్పారు. తాను భారత్ లో పర్యటించడానికి ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.  రెండు అగ్రదేశాల మధ్య భారత్ తెలివిగా బ్యాలెన్స్ చేస్తుందని జెలెన్ స్కీ ప్రశంసించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య దౌత్యం విషయంలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
కానీ శాంతి చర్చల ప్రక్రియలో మాభూభాగాలను, సార్వభౌమత్వాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేమని ప్రకటించారు. మా ప్రజల స్వేచ్ఛను హరించడాన్ని అంగీకరించం. మాభూభాగాలు.. మా విలువలు.. మా స్వేచ్ఛను కోల్పోవడానికి మేం సిద్ధంగా లేము.. మేము మారమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శాంతిని కోరుకుంటున్నారని తనకు తెలుసని అన్నారు. మోదీ- పుతిన్ సమావేశంలో ఏం చర్చించుకున్నారో తనకు తెలియదని చెప్పారు.
రక్షణ ఉత్పత్తులు, కొన్ని సాంకేతికతల గురించి మోదీతో చర్చించినట్లు చెప్పారు. మాతో ఒప్పందానికి న్యూ ఢిల్లీ సిద్ధంగా ఉంటే కీవ్ కూడా అందుకు సమ్మతిస్తుందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి (కొన్ని నెలల క్రితం రష్యాకు వ్యతిరేకంగా) భారతదేశం మద్దతు ఇవ్వడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, గతంలో ఏమి జరిగిందో దానిని విస్మరించాలనుకుంటున్నట్లు జెలెన్స్కీ చెప్పారు.
అయితే కొత్త తీర్మానాలకు ముందు మేము మాట్లాడుకోవాలి. మా మధ్య మరింత బలమైన సంబంధాలను ఏర్పరచుకోవాలి. “భవిష్యత్తులో మా సంబంధాలలో పెద్ద సవాళ్లు ఉండవు. అలాగే భవిష్యత్తు సంబంధాలపై నేను దృష్టి పెడతాను, ”అన్నారాయన.
భారత్ - రష్యా మధ్య చమురుకు సంబంధించి చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎత్తి చూపారు, “ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కుప్పకూలుతుందో అని పుతిన్ భయపడుతున్నాడు, అతనికి చమురు తప్ప ఏమీ మిగలలేదు. అతని ప్రధాన కరెన్సీ చమురు. వారు ఒక రకమైన శక్తి-ఆధారిత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు. అవి ఎగుమతి-ఆధారితమైనవి. "కాబట్టి, రష్యన్ ఫెడరేషన్ నుంచి ఇంధన వనరులను దిగుమతి చేసుకునే దేశాలు కాస్త ఆలోచించాలి’’ అన్నారాయన. ఉక్రెయిన్ జైళ్లలో ఏ భారతీయులు లేరని చెప్పారు. ఒకవేళ ఉన్నట్లు తెలిస్తే వారిని వెంటనే విడుదల చేస్తామని హమీ ఇచ్చారు.
ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో రష్యా సైన్యం కోసం పనిచేస్తున్న కొంతమంది భారతీయులు మరణించినట్లు మీడియాలో వచ్చిన కథనాలను తాను చదివానని ఆయన చెప్పారు.
1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మోదీ దాదాపు తొమ్మిది గంటలపాటు ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి, జులైలో మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర చర్చలు జరిపిన ఆరు వారాల తర్వాత మోదీ ఉక్రెయిన్ లో పర్యటించారు. భారత్ ఎప్పుడూ కూడా ఉక్రెయిన్, రష్యా వైపు లేదని కేవలం శాంతివైపే ఉందని మోదీ ఉద్ఘాటించారు. యుద్దభూమిలో పరిష్కరాలు దొరకవని, కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని మోదీ ఇరు దేశాలకు వివరించే ప్రయత్నం చేశారు.
Tags:    

Similar News