ఆపరేషన్ సింధూర్: విదేశీ మీడియా ఎలా వ్యాఖ్యానించింది?
ఎప్పటిలాగే భారత వ్యతిరేక వ్యాసాలు రాసిన బీబీసీ, పాక్ అనుకూల వార్తలు రాసిన చైనా, అల్ జజీరా;
By : The Federal
Update: 2025-05-07 10:06 GMT
ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ లోని తొమ్మిది ప్రాంతాలలో భారత్ భీకరమైన సైనిక చర్యకు దిగింది.
‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్ ఈ మిలిటరీ దాడులు చేపట్టింది. ఈ సంఘటనలపై అంతర్జాతీయ మీడియా నుంచి మిశ్రమ స్పందనలను వచ్చాయి.
న్యూఢిల్లీ ఖచ్చితమైన దాడులు నిర్వహించిందని, పాక్ లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. వీటిని భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడటానికి లాంచ్ ప్యాడ్ లు, శిక్షణా సౌకర్యాలుగా ఉపయోగిస్తున్నారని చాలాకాలంగా ఆరోపిస్తుంది.
వాస్తవ కవరేజ్..
భారత్ చేసిన ఈ దాడులను ఉగ్రవాద వ్యతిరేక దాడి అని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. కొన్ని చారిత్రాత్మకంగా భారత- పాక్ మధ్య సంఘర్షణను హైలైట్ చేశాయి. కొన్ని సంస్థలు పాక్ లో జరిగిన ప్రాణనష్టాన్ని లెక్కగట్టాయి కానీ తాము ఈ మరణాలను ధృవీకరించడం లేదని కూడా తెలిపాయి.
యూకేకి చెందిన ది గార్డియన్ పత్రిక భారత్ చేసిన సైనిక దాడిని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ.. ‘‘భారత్, పాకిస్తాన్ పై దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 26 మందిని చంపింది, ఐదు భారత జెట్లను కూల్చినట్లు పాక్ చెబుతోంది’’ అనే హెడ్ లైన్ తో వార్తలు ప్రసారం చేసింది.
దాడి తరువాత సరిహద్దు గ్రామాల్లో నెలకొన్న భయానక వాతావరణంపై వివరణాత్మక కథనాన్ని కూడా ఇది ప్రచురించింది. భారత్ ఎటువంటి హెచ్చరిక లేకుండా పీఓకేలోని గ్రామాలపై దాడి జరిగినట్లు, గ్రామస్తులు ఈ విషయం చెప్పినట్లు ఉటంకించింది.
భారత వ్యతిరేక ప్రచారంతో బీబీసీ..
మరో వైపు బీబీసీ కాశ్మీర్ పై భారత్, పాక్ ఎందుకు పోరాడుతున్నాయనే అంశంపై కథనాలు ప్రసారం చేసింది. ఈ వ్యాసంలో 1947 లో రెండు దేశాలు స్వాతంత్య్రం పొందిన తరువాత కాశ్మీర్ పై రెండు దేశాలు జరిపిన ఘర్షణ చరిత్రను వివరించింది.
ఆసక్తికరంగా బీబీసీ వ్యాసంలో భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ అస్థిరంగా ఉందని పేర్కొంది. చాలామంది కాశ్మీర్ లు దీనిని భారత్ పరిపాలించాలని కోరుకోవడం లేదని, పాక్ దయతో స్వతంత్యం గా ఉండాలని కోరుకుంటున్నట్లు వ్యాసంలో పేర్కొన్నారు.
జమ్మూకాశ్మీర్ లో మతం కీలకపాత్ర పోషిస్తుందని, ఇక్కడి జనాభాలో 60 కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారని వ్యాసంలో వివరించింది. మూడు దశాబ్దాలుగా ఇక్కడ భారత పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు జరుగుతోందని, పదివేల మంది ప్రాణాలు పొగొట్టుకున్నారని అందులో పేర్కొంది.
అమెరికా, బంగ్లాదేశ్ మీడియా..
ది వాషింగ్టన్ పోస్ట్ తన వెబ్ సైట్లో కాశ్మీర్ దాడి తరువాత, భారత్, పాకిస్తాన్ పై దాడి, యుద్ధ భయాలను పెంచుతుందనే కథనంతో వార్తలు ప్రసారం చేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత క్షిపణిలు దాడికి గురైన పాకిస్తాన్ అధికారులు, ఆ ప్రాంతాలలో ఉన్న పౌరుల నుంచి ప్రతిచర్యలు వచ్చినట్లు పేర్కొంది.
న్యూయార్క్ టైమ్స్.. పాక్ పై భారత్ దాడికి దిగిందని పేర్కొంది. ఆయుధ అమ్మకాల విషయాలను అది ప్రస్తావించింది. భారత్ తన దాడుల గురించి ముందే అమెరికాకు తెలియజేసిందని, ఇది అంతర్జాతీయంగా ఘర్షణను తగ్గించే విధానాన్ని తెలియజేస్తుందని ప్రస్తావించింది.
బంగ్లాదేశ్ కు చెందిన ఆంగ్ల పత్రిక ది డైలీ స్టార్.. భారత్ పాక్ పై దాడులకు దిగిందని, ఇస్లామాబాద్ దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొన్న వాటిని ప్రస్తావించింది. పాకిస్తాన్ పై ఎలా దాడి చేసిందో విషయాన్ని సవివరంగా చెప్పే ప్రయత్నం చేసింది.
పశ్చిమాసియాలో ఖతర్ కు చెందిన అల్ జజీరా పాకిస్తాన్ అనుకూల వార్తలు ప్రసారం చేసింది. ఇస్లామాబాద్ కు సానుభూతి వచ్చేలా కథనాన్ని తీర్చిదిద్దింది.
పాక్ పత్రికలు.. ఏమన్నాయంటే..
జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులు, కాశ్మీర్ పోనీవాలా మరణించిన తరువాత భారత మీడియా హిస్టీరికల్ గా మారిందని, పాక్ లోని ఇంగ్లీష్ వార్తా పత్రిక డాన్ అనవసర ఆరోపణలకు దిగింది. ఇండియాలో ఇప్పుడు ఉన్న ఈ ఉన్మాదాన్ని వేరుచేయలేమని వ్యాఖ్యానించింది.
చైనా, రష్యా మీడియా..
చైనా పాలక కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో నడిచే గ్లోబల్ టైమ్స్ .. పాకిస్తాన్ పౌర స్థావరాలపై భారత్ దాడి అని, 26 మంది అమాయకులు మరణించారని, 46 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇక అధికారిక జిన్హువా న్యూస్ ఏజెన్సీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
రష్యాకు చెందిన స్పుత్నిక్ వార్తా సంస్థ.. భారత్, పాకిస్తాన్ లో ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా ముగించిందని బ్యానర్ గా పెట్టి, సుఖోయ్ యుద్ద విమానాలతో పాటు, రాఫెల్ చిత్రాన్ని ప్రముఖంగా ప్రచురించింది.