బాంబు పేలుడుతో దద్దరిల్లిన పాకిస్తాన్.. పదుల సంఖ్యలో ప్రజలు మృతి
పాకిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు తో ఉలిక్కి పడింది. ఉగ్రవాదుల స్వర్గధామంగా పేరుగాంచిన ఈ దేశంలో పంజాబీ సైనికులు, ప్రజలు ఉగ్రవాదులకు టార్గెట్ గా మారారు.
By : The Federal
Update: 2024-11-09 06:59 GMT
పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా రైల్వే స్టేషన్ లో జరిగిన బాంబు పేలుడుతో పదుల సంఖ్య లో ప్రజలు మరణించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ లోని జియో న్యూస్ ప్రకారం.. క్వెట్టాలోని రైల్వే స్టేషన్ లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో వెళ్లడానికి ప్రజలు టికెట్ల కోసం క్యూలో నిల్చున్నారు. స్టేషన్ అంతా రద్దీగా ఉన్న సమయంలో కౌంటర్ దగ్గర భారీ పేలుడు సంభవించింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. పేలుడు ధాటికి 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. రక్తపు మరకలతో ప్లాట్ ఫాం బీతావాహంగా మారింది.
మరణించిన, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు కు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. బలూచిస్తాన్ లో బీఎల్ఎఫ్ స్వత్రంత్య పోరాటం చేస్తోంది. అయితే అది స్వంత ప్రజలపై దాడి చేయదు. కేవలం పంజాబ్ ప్రజలు, సైనికులను మాత్రమే టార్గెట్ చేస్తోంది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా లోని పెషావర్ వరకూ ప్రయాణిస్తుంది. అయితే రైలు ప్లాట్ ఫాం పైకి రావడానికంటే ముందే పేలుడు సంభవించింది.
పాముకు పాలు పోస్తే అది పెంచిన వారినే కాటు వేస్తుందని ఓ సామెత. ఇందుకు మన పొరుగు దేశం చక్కని ఉదాహారణ. ఇదే సామెతను అమెరికా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరి క్లింటన్ అనేకసార్లు ఉదహరించారు. సరిగ్గా పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు పాక్ పైనే పంజా విసురుతోంది. పాకిస్తాన్ ఇప్పటికే బెలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా పై పట్టును కోల్పోయింది. ఈ రెండు ప్రావిన్సు లలో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొడుతున్నారు.