షేక్ హసీనా వ్యాఖ్యలు వ్యక్తిగతం: బంగ్లాదేశ్‌కు భారత్ స్పష్టం
‘బంగ్లాదేశ్ అంతర్గత పరిపాలనా అంశాలకు న్యూఢిల్లీతో ముడిపెట్టడం సరికాదు’ - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్;
భారత్ శుక్రవారం బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక హై కమిషనర్ నురాల్ ఇస్లాంను పిలిపించి మాట్లాడింది. బంగ్లాదేశ్ అంతర్గత పరిపాలనా అంశాలను న్యూఢిల్లీతో ముడిపెట్టడం సమంజనం కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఆయనకు చెప్పారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, అందులో భారతదేశానికి ఎలాంటి పాత్ర లేదని జైస్వాల్ స్పష్టం చేశారు. భారత్‌ను బంగ్లాదేశ్ ప్రతికూలంగా చూపిస్తూ ప్రకటనలు చేయడం మంచింది కాదన్నారు. భారత ప్రభుత్వం పరస్పర ప్రయోజనకర సంబంధాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తుందన్నారు. అలాగే బంగ్లాదేశ్ కూడా అదే తరహాలో ప్రతిస్పందించాలని కోరారు జైస్వాల్.
అవామీ లీగ్ నేతల ఇళ్లు ధ్వంసం..
77 ఏళ్ల హసీనా గత ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాదిమంది నిరసనకారులు ఢాకాలో బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేఖ్ ముజిబుర్ రహ్మాన్ నివాసానికి నిప్పు పెట్టి, అవామీ లీగ్ (Awami League)నేతల ఇళ్లను ధ్వంసం చేశారు. తాత్కాలిక ప్రభుత్వం గురువారం హసీనా ఇచ్చిన "ఉద్రేకపూరిత" ప్రసంగమే "ఆకస్మిక, అనుకోని" హింసకు కారణమైందని పేర్కొంది.
ప్రజాగ్రహానికి హసీనా వ్యాఖ్యలే కారణం..
ఇటు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. షేఖ్ ముజిబుర్ రహ్మాన్ నివాసం ధ్వంసం కావడం "అనుకోని ఘటన" అని పేర్కొంది. అయితే భారత్ నుంచి హసీనా చేసిన "ఉద్రేకపూరిత" వ్యాఖ్యలే ప్రజాగ్రహానికి కారణమని స్పష్టం చేసింది. ‘‘ఇకపై షేక్ హసీనా భారత్ నుంచి ఇలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలని తాత్కాలిక ప్రభుత్వం ఆశిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మేం కోరుకుంటున్నాము," అని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.