‘‘ట్రంప్ కి కాకుండా ఇంకెవరికి ఇస్తారు’’: వైట్ హౌజ్

ఆరు నెలల్లో యూఎస్ అధ్యక్షుడు ఆరు యుద్దాలు ఆపారన్న కరోలినా లివిట్;

Update: 2025-08-01 10:15 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పూర్తిగా అర్హుడని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆరు యుద్ధాలను శాంతియుతంగా ముగించారని చెప్పుకొచ్చారు. ట్రంప్ గత ఏడాది నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ను ఓడించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

వైట్ హౌజ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కరోలినా.. గడచిన ఆరు నెలల్లో ట్రంప్ అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చారన్నారు. ఇందులో రెండు అణ్వాస్త్రా దేశాలయిన ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన సాయుధ ఘర్షణతో పాటు ఇజ్రాయెల్- ఇరాన్ వంటి దేశాల మధ్య సయోధ్య కుదిర్చారన్నారు. ‘‘ గడచిన కాలం అద్భుతంగా నడిచింది. ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి పూర్తిగా అర్హుడు’’ అన్నారు.
‘‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రస్తుతం కాంబోడియా- థాయిలాండ్ మధ్య ఘర్షణను సైతం శాంతియుతంగా ముగించారు. అలాగే ఇజ్రాయెల్- ఇరాన్, రువాండా- రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండియా- పాకిస్తాన్, సెర్భియా- కొసావో, ఈజిప్ట్- ఇథియోపియా దేశాలకు శాంతి ఒప్పందాలు కుదిర్చారు’’ అని లీవిట్ చెప్పారు.
ప్రతి నెలకు ఒక శాంతి ఒప్పందం..
‘‘ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్రంప్ ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చారు. గడిచిన కాలంలో ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించినందుకు ఆయన నోబెల్ ప్రైజ్ కు పూర్తిగా అర్హుడు’’అని లీవిట్ వాదించారు.
పహల్గామ్ లో పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చిచంపిన తరువాత భారత్, పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంతో రెండు దేశాల మధ్య ప్రారంభమైన సాయుధ ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదరడానికి తానే మధ్యవర్తిత్వం చేశానని ట్రంప్ ప్రకటించారు.
బయటి దేశాలు రాలేదు: భారత్
అయితే ట్రంప్ చేస్తున్న ప్రకటనలను భారత్ తిరస్కరిస్తూ వచ్చింది. జూలై 29 న లోక్ సభలో ఆపరేషన్ సింధూర్ పై జరిగిన చర్చలో మాట్లాడిన ప్రధాని మోదీ 190 దేశాలలో ఏ దేశం కూడా ఆపరేషన్ సిందూర్ ను ఆపమని కోరలేదని ప్రకటించారు. రాజ్యసభలో జరిగిన చర్చలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిస్తూ ఆపరేషన్ సిందూర్ పై ఏ దేశం కూడా మధ్యలో కలుగజేసుకోలేదని చెప్పారు. మిలిటరీ చర్య ఆపడానికి వాణిజ్య చర్చలకు ఎలాంటి సంబంధం లేదని, అసలే ప్రసక్తే రాలేదని వివరించారు.
ట్రంప్- మోదీ మధ్య ఫోన్ కాల్స్ కూడా లేవు
రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా జరిగిన చర్చలో విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిస్తూ.. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 మధ్య ట్రంప్ నుంచి మోదీకి ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని ప్రకటించారు. అయితే ట్రంప్ మాత్రం పదేపదే రెండు ఆసియా దేశాల మధ్య యుద్దం ఆపడానికి తాను వాణిజ్యాన్ని ఉపయోగించి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని బలవంతం చేసినట్లు ప్రకటించుకున్నారు.
ప్రపంచశాంతి కోసం తాను పాటుపడ్డానని కచ్చితంగా నోబెల్ శాంతి ప్రైజ్ కు తాను అర్హుడిని ట్రంప్ వాదన. ‘‘వారు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే. మీరు ఒకసారి రువాండ వైపు చూడండి.. అలాగే కాంగో వైపు, సెర్భియా, కోసావో రెండు ఆసియా పెద్దదేశాలైన భారత్, పాకిస్తాన్ వైపు చూడండి’’ అని గతంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News