భారత్ మీద 'సుంకం బాంబ్' వేసిన ట్రంప్
ఆగస్టు 1 నుంచి భారత్‌పై 25 శాతం సుంకాలు;
అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌పై సుంకాల(Tariff) మోతకు సిద్ధమయ్యారు. భారత్‌లో తయారైన వస్తువులపై 25శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందన్నారు. రష్యా నుంచి భారత్ ఎక్కువగా సైనిక ఉత్పత్తులు కొంటోందని, ముఖ్యంగా చమురును అధికంగా దిగుమతి చేసుకుంటుందని చెప్పారు.
‘ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే..’
‘భారత్ మాకు మిత్ర దేశమే. ఈ విషయాన్ని మేము మరువం. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వ్యాపారం తక్కువ మోతాదులోనే కొనసాగింది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోల్చితే ఇండియాలో టారీఫ్‌లు ఎక్కువ. భారత్ అనుసరించే వ్యాపార, వాణిజ్య నిబంధనలు కఠినంగా ఉంటాయి. నగదు రహిత వాణిజ్యానికి ఇవి పెద్ద అడ్డంకిగా మారాయి’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకుముందు ఏప్రిల్ 22న అమెరికాకు దిగుమతి చేసుకునే భారతీయ వస్తువులపై ట్రంప్ 26% సుంకాన్ని విధించారు, ఆ "పరస్పర" సుంకాలపై విరామం ప్రకటించారు.
అయితే భారత్ - అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఆదివారం పేర్కొన్నారు.
గత వారం ప్రధాని మోదీ UK పర్యటన సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా, అమెరికాలోని భాగస్వాములతో కొనసాగుతున్న సంబంధాలను నొక్కి చెబుతూ.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA)పై భారతదేశం అమెరికాతో చర్చలలో చురుకుగా నిమగ్నమై ఉందని పేర్కొన్నారు.