America | ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కశ్యప్ పటేల్‌

ఊహించినట్లుగానే అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్‌ నియమితులయ్యారు. కీలక పదవి దక్కించుకున్న ఈ భారతీయ అమెరికన్ ఎవరు?

Update: 2024-12-01 07:52 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహితుడైన కశ్యప్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు, దీంతో పటేల్ అగ్రరాజ్యంలో అత్యున్నత ర్యాంక్ పొందిన భారతీయ అమెరికన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా పటేల్ గురించిన కొన్ని విషయాలను ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌తో పంచుకున్నారు. “కశ్యప్ పటేల్‌ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. కశ్యప్ తెలివైన న్యాయవాది, పరిశోధకుడు కూడా. నా మొదటి పదవీకాలంలో అద్భుతంగా పని చేశాడు.’’ అని కితాబిచ్చాడు.

ఎవరీ కశ్యప్..

కశ్యప్ పటేల్ న్యూయార్క్‌లో జన్మించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈయన తల్లిదండ్రులు 1970 ప్రాంతంలో తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా నుంచి యుఎస్‌కి తరలివెళ్లారు. డొనాల్డ్ ట్రంప్ కోసం ఏదైనా చేయగల వ్యక్తిగా పేరున్న పటేల్.. యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. న్యూయార్క్ పేస్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. UKలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి ఇంటర్నేషనల్ లాలో సర్టిఫికేట్ కూడా పొందాడు.

పబ్లిక్ డిఫెండర్‌గా కెరీర్..

తొలుత మియామిలో పబ్లిక్ డిఫెండర్‌గా వృత్తిని ప్రారంభించిన కశ్యప్.. హత్య, నార్కో-ట్రాఫికింగ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన క్లిష్టమైన కేసులను వాదించడంలో మంచి అనుభవం గడించారు. దాంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో టెర్రరిజం ప్రాసిక్యూటర్‌గా కొనసాగారు. ISIS, అల్-ఖైదా వంటి తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులపై పరిశోధనలు చేసే బృందానికి నాయకత్వం వహించారు. గ్లోబల్ టెర్రరిజం కార్యకలాపాలకు సంబంధించి జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC)కి న్యాయ శాఖ నుంచి లైజన్ ఆఫీసర్‌గా కూడా కొంతకాలం పనిచేశాడు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై కమిటీ విచారణకు పటేల్ నాయకత్వం వహించారు.

గతంలో కీలక పదవుల్లో..

ఫిబ్రవరి 2019లో పటేల్ జాతీయ భద్రతా మండలి (NSC)లో చేరారు. వాద నిరోధక డైరెక్టరేట్‌కు సీనియర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ISIS, అల్-ఖైదా నాయకులకు వ్యతిరేకంగా, అల్-బాగ్దాదీ, ఖాసెమ్ అల్-రిమిని నిర్మూలించడం, సిరియా ప్రభుత్వం వద్ద ఉన్న అమెరికన్ బందీలను సురక్షితంగా స్వదేశానికి రప్పించడం కశ్యప్ పర్యవేక్షణలోనే జరిగాయి. ఏడాది తరువాత ట్రంప్ పాలనలో నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్ డిప్యూటీగా నియమితులయ్యారు. USలోని వివిధ గూఢచార సంస్థల పర్యవేక్షణ, భద్రతా పరిస్థితులపై ట్రంక్‌కు సూచనలు చేసేవారు. అధ్యక్షుడిగా ట్రంప్ పదవీకాలం ముగిసే సమయంలో పటేల్‌ను CIA లేదా FBI డిప్యూటీ డైరెక్టర్ అయ్యే అవకాశం కోల్పోయారు. అనుభవం లేదన్న కారణంతో CIA డైరెక్టర్ గినా హాస్పెల్, అటార్నీ జనరల్ బిల్ బార్ కశ్యప్ పటేల్‌ను పక్కనపెట్టారు.

ట్రంప్ పదవీకాలం పూర్తవ్వడంతో పటేల్ కూడా ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. అయితే ట్రంప్ ఎజెండాను ప్రచారం చేయడంలో చురుగ్గా వ్యవహరించారు. ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్‌ డైరెక్టర్ల బోర్డులో కూడా కశ్యప్‌ పనిచేశారు. ట్రంప్‌కు వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్న 44 ఏళ్ల న్యాయవాది కశ్యప్ పటేల్‌కు.. గెలిచిన వెంటనే ట్రంప్‌ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. 

Tags:    

Similar News