ట్రంప్ టారిఫ్ ఎఫెక్టుతో బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కుదేళవుతుందా?

చిట్టగాంగ్‌లోని 611 వస్త్ర కర్మాగారాలలో ఇప్పటికి 350 మాత్రమే నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ దుస్తులపై ట్రంప్ 37 శాతం సుంకం విధించడంతో పరిశ్రమలు మూతపడే అవకాశం ఉంది.;

Update: 2025-04-05 12:33 GMT
Click the Play button to listen to article

ప్రపంచంలో రెడీమేడ్ దుస్తుల తయారీలో చైనాది మొదటి స్థానం కాగా బంగ్లాదేశ్‌ది రెండో స్థానం. అయితే బంగ్లాదేశ్(Bangladesh) నుంచి ఉత్పత్తి అయ్యే రెడీమేడ్ దుస్తులపై అమెరికా(America) 37 శాతం సుంకాన్ని విధించడంతో చాలా పరిశ్రమలు మూత పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పనిచేస్తున్నవి కేవలం 350 మాత్రమే..

ఫ్యాషన్ మీడియా హౌస్ ‘అపారెల్ రిసోర్సెస్’ నివేదిక ప్రకారం.. గత ఏడాది కనీసం 76 వస్త్ర పరిశ్రమలు (Garments industry) మూతపడ్డాయి. 50 వేల మందికి పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. చిట్టగాంగ్ ప్రాంతంలోని 611 రిజిస్టర్డ్ వస్త్ర పరిశ్రమల్లో కేవలం 350 మాత్రమే పనిచేస్తున్నాయని బంగ్లాదేశ్ వస్త్ర తయారీదారులు ఎగుమతిదారుల సంఘం నాయకులు చెబుతున్నారు. వీటిలో 180 పరిశ్రమలు విదేశీ ఆర్డర్‌లపై పనిచేస్తుండగా..170 సబ్‌కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నాయి.

ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ ప్రకారం..ఆగస్టు 2024 - మార్చి 2025 మధ్య కాలంలో ముఖ్యమైన పారిశ్రామిక జిల్లాల్లో 95 రెడీమేడ్ వస్త్ర కర్మాగారాలు మూతపడ్డాయి. వీటిలో గాజీపూర్‌లో 54, నారాయణగంజ్-నర్సింగ్డిలో 23 మరియు సావర్-అషులియాలో 18 ఉన్నాయి. ఈ కర్మాగారాల్లో మొత్తం 61,881 మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కాటన్‌పై 16 శాతం..పాలిస్టర్‌పై 32 శాతం..

బంగ్లాదేశ్ ఉత్పత్తి చేసే కాటన్ దుస్తులపై 16 శాతం, పాలిస్టర్ దుస్తులపై 32 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేవాటిల్లో ఎక్కువ కాటన్ వస్త్రాలే.

తీవ్ర ప్రభావం..

బంగ్లాదేశ్‌లోని వస్త్ర తయారీదారులు, ఆర్థికవేత్తలు అమెరికా సుంకాలను "భారీ దెబ్బ"గా అభివర్ణించారు. ఇందుకు మేం సిద్ధంగా లేమని వ్యాపార సంఘం నాయకుడొకరు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి వస్త్రాలను ఎక్కువగా కొనుగోలు చేసే దేశం అమెరికానే. బంగ్లాదేశ్ వార్షిక రెడీమేడ్ వస్త్ర ఎగుమతుల్లో ఇరవై శాతం అమెరికాదే. గతేడాది ఎగుమతుల మొత్తం $8.4 బిలియన్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో కొనుగోలుదారును వెతకడం అంత సులభం కాదని ప్రముఖ ఫ్యాక్టరీ యజమానులు అంగీకరిస్తున్నారు.

అంతర్జాతీయ బ్రాండ్లు..

బంగ్లాదేశ్‌లో దాదాపు 4,600 రెడీమేడ్ వస్త్ర కర్మాగారాలు ఉన్నాయి. క్యారీఫోర్, యునిక్లో, ప్రిమార్క్, హెచ్అండ్ఎం, జారా, ఎంఅండ్ఎస్ లాంటి ప్రముఖ బ్రాండ్ల దుస్తులు ఈ కర్మాగారాల్లో తయారవుతాయి. కాగా ‘‘ట్రంప్ (Donald trumph) అకస్మాత్తుగా విధించిన సుంకం మాకు భారీ దెబ్బ.’’ అని బంగ్లాదేశ్ గార్మెంట్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (BGMEA) నిర్వాహకుడు అన్వర్ హుస్సేన్ పేర్కొన్నారు.

సంక్షోభంలో వస్త్ర పరిశ్రమ..

గత మూడు, నాలుగు సంవత్సరాలుగా.. బంగ్లాదేశ్‌లోని రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధిక వేతనాలు, పని గంటల కుదించాలన్న కార్మికుల నిరసనల కారణంగా 183 వస్త్ర కర్మాగారాలు మూతపడ్డాయని బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ రిసోర్స్ సెంటర్ పేర్కొంది.

మార్చి 27 గడువుకు ముందే కార్మికులకు జీతాలు, బోనస్‌లు చెల్లించని వస్ర్త పరిశ్రమల యజమానులు యజమానులపై ప్రయాణ నిషేధాన్ని విధించింది. బకాయి వేతనాలు, బోనస్‌ చెల్లించే వరకు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని కార్మిక, ఉపాధి సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ మీడియాకు తెలిపారు.

పరిస్థితి అధ్వానం..

ఆగస్టు 2024లో షేక్ హసీనా పదవీచ్యుతురాలయిన తర్వాత దేశంలో చెలరేగిన రాజకీయ హింస, విద్యుత్ కొరత, ఓడరేవు రద్దీతో పాటు, విదేశీ కొనుగోలుదారులకు డెలివరీలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొన్ని కర్మాగారాల యజమానులు ప్రత్యామ్నాయ పరిశ్రమల అన్వేషణలో ఉన్నారు. దీనికి తోడు అవామీ పార్టీ అనుకూల వ్యాపారవేత్తల కర్మాగారాలను ఆందోళనకారులు ధ్వంసం చేయడంతో వాటి యజమానులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. హసీనా మద్దతుదారుడు, వస్త్ర రంగంలో అగ్రశ్రేణి అయిన బెక్సిమ్‌కో గ్రూప్‌కు చెందిన సల్మాన్ రెహమాన్‌ జైలు పాలయ్యారు.

ఆటోమేషన్ సవాళ్లు..

బంగ్లాదేశ్ జీడీపీలో రెడీమేడ్ వస్త్ర రంగం వాటా 11 శాతం. నాలుగు మిలియన్లకు పైగా కార్మికులున్నారు. వీరిలో 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళా కార్మికులే. వియత్నాం, కంబోడియా వంటి వస్త్ర ఉత్పత్తి దేశాల నుంచి పోటీని ఎదుర్కోడానికి బంగ్లాదేశ్‌లో పరిశ్రమలను ఆధునీకరించాల్సి వస్తోంది. 2023 షిమ్మీ టెక్నాలజీస్ సర్వే ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని 80 శాతం అగ్రశ్రేణి కర్మాగారాలు రెండేళ్లలోపు సెమీ ఆటోమేటెడ్ యంత్రాలలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా శ్రామిక శక్తి 22 శాతం తగ్గే అవకాశం ఉంది. పైపెచ్చు మహిళా కార్మికులపై పని ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఆటోమేటెడ్ ట్రాకింగ్ పరికరాలు వారి ఉత్పాదకతను పర్యవేక్షించడమే అందుకు కారణం. "నిడిల్" వంటి పరికరాలు ఒక కార్మికుడు గంటకు ఎన్ని ముక్కలు కుడతాడో ట్రాక్ చేస్తాయి. లక్ష్యాన్ని చేరుకోలేని కార్మికుడిని తొలగించే అవకాశం కూడా ఉంది. యంత్రాలను రన్నింగ్‌లో ఉంచడానికి భోజనం చేయడానికి కూడా సమయం దొరకకపోవచ్చు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

Tags:    

Similar News