భారత్ పై 20-25 శాతం సుంకాలు విధించబోతున్న ట్రంప్
ఆగష్టు 1 నాటికి ఒప్పందం కుదరకపోతే టారిఫ్ తప్పదని సంకేతాలు;
By : The Federal
Update: 2025-07-30 09:46 GMT
భారత్- అమెరికా మధ్య ఆగష్టు 1 నాటికి వాణిజ్య ఒప్పందం కుదరకపోతే న్యూఢిల్లీ పై 20 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించిది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్న తరుణంలో టారిఫ్ రేట్ ఇంకా నిర్ణయించలేదని ఆయన చెప్పినట్లు సమాచారం.
మంచి మిత్రుడే కానీ..
భారత్, అమెరికాకు మంచి మిత్రుడే కానీ ప్రపంచంలోని ఏ దేశం వసూలు చేయలేనంత సుంకాలు అమెరికా వస్తువులపై ఇండియా వసూలు చేస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన మంగళవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు.
ఆగష్టు 1 నుంచి అనేక దేశాలపై విధించిన సుంకాలు అమలులోకి వస్తాయి. ఆయన ప్రకటించిన టారిఫ్ వార్ ఏప్రిల్ మధ్యలో స్వల్ఫకాల విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ పరస్పర సుంకాలను ప్రకటించారు. అమెరికా వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాల చర్చలను జరుపుతున్నందున జూలై 9 వరకూ 90 రోజుల గడువు విధించారు. తరువాత ఈ తేదీని ఆగష్టు 1 వరకు పొడిగించారు.
నిరాశజనకంగా చర్చలు..
వాణిజ్య ఒప్పందంపై భారత్ తో మరిన్ని చర్చలు అవసరమని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ చెప్పడంతో మధ్యంతర ఒప్పందాలు కుదిరే అవకాశాలు స్పష్టంగా కనిపించడం లేదు. అయితే చివరి నిమిషంలో పురోగతి సాధ్యమయ్యే అవకాశాన్ని అధికారులు తోసిపుచ్చడం లేదు.
‘‘మేము మా భారతీయ సహచరులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాము. వారితో మేము ఎల్లప్పుడూ చాలా నిర్మాణాత్మక చర్చలు జరిపాము’’ అని గ్రీర్ సోమవారం సీఎన్బీసీ కి చెప్పారు.
రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం తదుపరి రౌండ్ చర్చల కోసం ఆగష్టు 25న అమెరికా బృందం భారత్ ను సందర్శించనుందని మంగళవారం ఒక అధికారి తెలిపారు.
వచ్చే నెలాఖరులో ఆ బృందం వస్తున్నప్పటికీ ఆగష్టు 1కి ముందు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం విభేదాలను పరిష్కరించుకోవడానికి ఇరు వర్గాలు నిమగ్నమై ఉన్నాయి. ‘‘ఆరో రౌండ్ చర్చల కోసం అమెరికా బృందం సందర్శిస్తోంది’’ అని ఆ అధికారి పీటీఐకి తెలిపారు.
ఐదో రౌండ్ చర్చలు..
ఈ ఒప్పందం కోసం భారత్, అమెరికా బృందాలు గతవారం వాషింగ్టన్ లో ఐదో రౌండ్ చర్చలను ముగించాయి. భారత్ ప్రధాన సంధానకర్త, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, దక్షిణ మధ్య ఆసియా కు అసిస్టెంట్ యూఎస్ వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ చర్చలు జరిపారు.
వ్యవసాయం, పాల ఉత్పత్తులపై సుంకం రాయితీలు ఇవ్వాలన్నా అమెరికా డిమాండ్ పై భారత్ తన వైఖరినీ కఠినతరం చేసింది. పాడిరంగంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో న్యూఢిల్లీ ఇప్పటి వరకూ తన వాణిజ్య భాగస్వాములెవరికి ఎటువంటి రాయితీ సుంకాలు ఇవ్వలేదు. వ్యవసాయానికి సంబంధించిన ఏ అంశాలను వాణిజ్య ఒప్పందంలో చేర్చవద్దని కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
వాణిజ్య నిబంధనలపై భారత్ దృఢ వైఖరి..
ఈ అదనపు సుంకాన్ని(26 శాతం) తొలగించాలని భారత్ కోరుతోంది. ఉక్కు, అల్యూమినియం(50 శాతం), ఆటోరంగం పై (25 శాతం) సుంకాలను సడలించడం గురించి కూడా పరిశీలిస్తోంది. ఈ అంశాలు వాణిజ్య ఒప్పంద చర్చలలో ముఖ్యమైన భాగం.
వీటికి వ్యతిరేకంగా భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతీకార సుంకాలను విధించే హక్కును కలిగి ఉంది. ఈ వాణిజ్య ఒప్పందంలో వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు వస్తువులు, దుస్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పండ్లు వంటి శ్రమతో కూడిన రంగాలకు కూడా మనదేశం సుంకం రాయితీ కోరుతోంది.
మరో వైపు కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటో మొబైల్స్, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, వైన్లు, పెట్రో కెమికల్, వ్యవసాయ వస్తువులు, పాల వస్తువులు, ఆపిల్ , చెట్ల గింజలు, జన్యుపరమైన పంటలపై సుంకం రాయితీలు ఇవ్వాలనీ అమెరికా కోరుతోంది.