ఎవరూ ఉషా చిలుకూరి, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పేరేలా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ పేరు మరోసారి అధికారికంగా ఖరారు అయింది. ఆయన తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీవాన్స్ ను..
By : The Federal
Update: 2024-07-16 08:16 GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జూలై 15) ఒహియో సెనేటర్ జెడి వాన్స్‌ను అధ్యక్ష ఎన్నికలకు ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారు. వాన్స్ పేరు ప్రకటించిన వెంటనే, అతని బలమైన రిపబ్లికన్ మూలలతో పాటు, అతని భార్య ఉషా చిలుకూరి వాన్స్ అనే భారతీయ అమెరికన్ గుర్తింపు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్ర ప్రదేశ్ లోని ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఉన్నాయి.
వృత్తిరీత్యా న్యాయవాదీగా పనిచేస్తున్న ఉషా చిలుకూరీ వాన్స్, జాతీయ సంస్థలో లిటిగేటర్ గా పని చేస్తున్నారు. కాలిఫోర్నియాలో భారతీయ వలస దంపతులకు జన్మించిన ఉష శాన్ డియాగో శివారులో పెరిగారని న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఉషా ‘రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాల’లో చదువుకుంది. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పూర్తి చేసింది.
వాన్స్‌ను కలవడం, ప్రేమ పెళ్లి..
ఉష 2013లో యేల్ లా స్కూల్‌లో వాన్స్‌ను కలిశారు. వారు మొదట శ్వేత జాతి అమెరికన్లలో పేదరికం, సామాజిక క్షీణత అనే అంశం పై చర్చలు నిర్వహించే వారు. ఇందుకోసం విద్యార్థులుగా కలిసి పనిచేశారు. తరువాత ఇద్దరు ప్రేమలో మునిగి తేలారు. వాన్స్ తన భార్య పట్ల తనకున్న అభిమానం గురించి చెబుతూ, ఉషాను తన "యేల్ స్పిరిట్ గైడ్" అని వర్ణించే వాడు. యేల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఈ జంట 2014లో పెద్దలను ఒప్పించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మిరాబెల్.
విజయవంతమైన కెరీర్
యేల్ లో, ఉష యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా, ది యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా పనిచేసినట్లు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. కేంబ్రిడ్జ్ యూనివర్శిటిలో వామపక్ష ఉదారవాద గ్రూపులతో పని చేసింది. 2014 లో డెమోక్రాట్ గా నమోదు చేసుకున్నారు. తన కెరీర్‌లో US సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్‌లకు లా క్లర్క్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టులో పని చేయడానికి కంటే ముందు శాన్ ప్రాన్సిస్ స్కోలోని ముంగేర్ తో పాటు వాషింగ్టన్ డీసీలో 2015- 2017 వరకు లాయర్ గా పని చేశారు. సంక్లిష్టమైన సివిల్ లిటిగేషన్‌లు, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్‌తో సహా అన్ని రంగాలలో పట్టుసాధించారు.
మార్గనిర్దేశకురాలు..
ఉష తరచుగా అనేక బహిరంగ వేదికలపై తన భర్తకు మద్దతుగా కనిపించింది. అనేక సంవత్సరాలుగా భర్త రాజకీయ కార్యక్రమాలకు అండగా నిలిచింది. 2016- 2022లో సెనేట్ ప్రచారాలతో సహా వాన్స్ రాజకీయ ప్రచారాలను ముందుండి నడిపించింది. ఆ ఎన్నికల్లో అతను విజయం సాధించాడు. తన భర్త రచించిన హిల్ బిల్లి పుస్తకాన్ని సినిమాగా తీశారు. ఇందులో ఉష చురుకుగా వ్యవహరించారు. ఇందులో శ్వేత జాతి అమెరికన్ల పేదరికం, వారు పడుతున్న అవస్థల గురించి వివరించారు. తరువాత 2018 లో ఒహియోలో రిపబ్లిక్ ఓటర్ గా నమోదు చేసుకున్నారు.
వాన్స్ అభ్యర్థిత్వంపై ప్రభావం
రిపబ్లికన్లు వాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైనట్లయితే, యుఎస్-ఇండియా సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో ఉష ఒక వాహికగా పని చేయగలరని నమ్ముతున్నారు.
"ఉషా వాన్స్ అత్యంత నిష్ణాతులైన న్యాయవాది భారతీయ నేపథ్యం ఉన్న కుమార్తె. ఆమె భర్త వైస్ ప్రెసిడెంట్ అయితే వైవిధ్యాన్ని తెస్తుంది" అని పారిశ్రామికవేత్త, US- ఆధారిత గ్లోబల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి సలహాదారు AI మాసన్ ANI కి చెప్పారు.
“ఆమెకు భారతీయ సంస్కృతి, భారత్ గురించి అన్నీ తెలుసు. USA - భారత్ మధ్య గొప్ప సంబంధాలను నావిగేట్ చేయడంలో ఆమె తన భర్తకు పెద్ద సాయం చేస్తుంది, ”అని ట్రంప్ కుటుంబంతో సంబంధాలు కలిగి ఉన్న వ్యాపారవేత్త చెప్పారు.