బంగ్లాదేశ్‌లో 'ఆపరేషన్ డెవిల్ హంట్' ప్రారంభం

ఇటీవల ఆవామీ లీగ్ నేతల నివాసాలపై దాడి నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ అల్లరి మూకల పట్టివేతకు ఆదేశాలు ఇచ్చారు.;

Update: 2025-02-09 12:41 GMT
Click the Play button to listen to article

దేశాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు, సమూహాలను లక్ష్యంగా చేసుకుని.. బంగ్లాదేశ్(Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం 'ఆపరేషన్ డెవిల్ హంట్'(Operation Devil Hunt)ను ప్రారంభించింది. గాజీపూర్ జిల్లాలో విద్యార్థులు, సాధారణ పౌరులపై దాడి తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గత శుక్రవారం రాత్రి మాజీ విముక్తి యుద్ధ వ్యవహారాల మంత్రి ఏకేఎం మొజమ్మెల్ హక్ నివాసంలో జరిగిన ఘటనలో పలువురు గాయపడగా..శనివారం బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనుస్ (Muhammad Yunus) 'ఆపరేషన్ డెవిల్ హంట్'కు ఆదేశాలు ఇచ్చారు.

గాజీపూర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) చౌధరి జబేర్ సాదేక్ ప్రకారం..ఈ ఆపరేషన్‌లో భాగంగా 40 మందిని అరెస్ట్ చేసినట్లు యునైటెడ్ న్యూస్ ఆఫ్ బంగ్లాదేశ్ తెలిపింది.

దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు..

గత బుధవారం రాత్రి మాజీ ప్రధాని షేక్ హసీనా లైవ్ ప్రసంగం తర్వాత దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఢాకా, ఇతర నగరాల్లో హసీనా (Awami League) అనుచరుల ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. సుమారు 35 జిల్లాల్లో 70కి పైగా దాడులు జరిగినట్లు కొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహ్మాన్ నివాసమైన 32 ధన్‌మండీ భవనాన్ని కూడా దహనం చేశారు.

సైనిక దళాల సహకారంతో..

దేశాన్ని అశాంతికి గురిచేసే వారు, నేరాలకు పాల్పడే వారిని అరికట్టడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని హోంశాఖ సలహాదారు మొహమ్మద్ జహంగీర్ అలం చౌధరి చెప్పారు. సైన్యం, వాయుసేన, నావికాదళం, పోలీస్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్, అంసార్, కోస్ట్ గార్డ్ భాగస్వామ్యంతో ఈ ఆపరేషన్‌ మొదలుపెట్టామని చెప్పారు.

"ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశాం. ఇంకా అరెస్ట్ కావాల్సిన వారిని త్వరలో పట్టుకుని, గరిష్ఠ శిక్ష విధించేందుకు చర్యలు తీసుకుంటాం" అని జహంగీర్ స్పష్టం చేశారు.

ప్రతిపక్షాల స్పందన..

ఎంటీ-వ్యతిరేక విద్యార్థి ఉద్యమం, జాతీయ పౌర కమిటీ ఈ హింసను నిరసిస్తూ ఘజీపూర్‌లో పెద్దఎత్తున ర్యాలీలు, నిరసనలు నిర్వహించాయి. బంగ్లాదేశ్ జాతీయవాద పార్టీ (BNP) తక్షణం "మాబ్ కల్చర్" అరికట్టాలని, లా & ఆర్డర్ పునరుద్ధరించాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 11 నుంచి దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు బీఎన్‌పీ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ సమాజం కూడా బంగ్లాదేశ్ పరిణామాలను గమనిస్తోంది.

 

Tags:    

Similar News