ఇజ్రేల్ షిప్ లో చిక్కుకున్న భారతీయులకు ఊరట...
ఇజ్రాయెల్ కు చెందిన కంటైనర్ షిప్ ను ఇరాన్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భారతీయులు ఉన్నారు. వీరి విడుదలపై భారత్ దౌత్య మార్గంలో..
By : The Federal
Update: 2024-04-15 10:57 GMT
ఇరాన్, ఇజ్రాయెల్ కు చెందిన ఓ భారీ కంటైనర్ షిప్ ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 17 మంది భారతీయులు ఉన్నారు. వీరి భద్రతపై భారత విదేశాంగ శాఖ, ఇరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టింది. దీనిపై సానుకూల ఫలితాలు వచ్చినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ప్రకటించారు. త్వరలో భారత విదేశాంగ శాఖ అధికారులు, ఇరాన్ అదుపులో ఉన్న సిబ్బందిని కలవడానికి అనుమతి ఇస్తామని తమకు స్పష్టమైన హామీ లభించిందని తెలిపారు.
తమ దేశ కాన్సులేట్ కార్యాలయంపై దాడులు చేసి ఏడుగురు ఖుద్ ఫోర్స్ అధికారులను హతమార్చడం, ఇరాన్ భగ్గుమన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా తాము కూడా దాడులు చేస్తామని ప్రకటించిన టెహ్రాన్, అంతకుముందే ఇజ్రాయెల్ కు చెందిన ఓ భారీ కంటైనర్ షిప్ ను స్వాధీనం చేసుకుంది. అయితే అందులో భారతీయ సిబ్బంది ఉన్నారు. దీనిపై భారత్ దౌత్య మార్గంలో సంప్రదింపులు ప్రారంభించింది.
ఇరాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్న కార్గో షిప్‌లో ఉన్న 17 మంది భారతీయ సిబ్బందిని కలిసేందుకు ఇరాన్ త్వరలో భారత అధికారులకు అనుమతి ఇస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ తన భారత కౌంటర్ ఎస్ జైశంకర్‌తో చెప్పారు.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ తనకు ఫోన్ చేశారని, ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌక లో 17 మంది భారతీయులు ఉన్నందున వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. వారి యోగక్షేమాల గురించి ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు. అందుకోసం ఇరాన్ విదేశాంగమంత్రిని సాయం కోరారని ప్రకటనలో తెలిపారు. తమ ప్రభుత్వం పరిస్థితిని పరిశీలిస్తోందని,త్వరలోనే భారత అధికారులకు సిబ్బందిని కలిసే అవకాశం కల్పిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి బదులిచ్చారు.
సంయమనం పాటించండి..
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ప్రస్తావిస్తూ, అమీర్-అబ్దుల్లాహియాన్ ఇరాన్ "చట్టబద్ధమైన రక్షణ"ను సమర్థించారు, అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి ఐక్యరాజ్యసమితితో సహా వివిధ అంతర్జాతీయ వేదికల ద్వారా భారతదేశం తన ప్రయత్నాలను కొనసాగించాలని ఆయన కోరారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణకు పిలుపునిచ్చాడు.
అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, వివాదం ముదిరిపోకుండా ఉండాలంటే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆయన సామాజిక మధ్యమం ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “ఈ సాయంత్రం ఇరాన్ FM @Amirabdolahianతో మాట్లాడాను. అలాగే గల్ప్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితిని కూడా చర్చించాం. ఉద్రికత్తలు తగ్గించాలని కోరాం. ఏదైన చర్చల ద్వారా పరిష్కరించాలని వారికి సూచించాం. టచ్‌లో ఉండటానికి అంగీకరించారు. ”